మత్తయి 16:6-19

మత్తయి 16:6-19 IRVTEL

అప్పుడు యేసు, “పరిసయ్యులు, సద్దూకయ్యులు అనే పొంగజేసే పిండిని గురించి జాగ్రత్త పడండి” అని వారితో అన్నాడు. అయితే శిష్యులు “మనం రొట్టెలు తేకపోవడం చేత ఇలా అన్నాడు” అని తమలో తాము చర్చించుకున్నారు. యేసుకు అది తెలిసి, “అల్పవిశ్వాసులారా, మీరు రొట్టెలు తీసుకు రాని విషయం గురించి ఎందుకు ఆలోచిస్తున్నారు? “మీరింకా గ్రహించలేదా? ఐదు రొట్టెలు ఐదు వేలమంది తిన్న తరువాత ఎన్ని పెద్ద గంపలు ఎత్తారో, ఏడు రొట్టెలు నాలుగు వేలమంది తిన్న తరువాత ఎన్ని పెద్ద గంపలు ఎత్తారో అవేమీ మీకు గుర్తు లేదా? నేను మీతో మాట్లాడింది రొట్టెలను గురించి కాదని ఎందుకు గ్రహించరు? పరిసయ్యులు, సద్దూకయ్యులు అనే పొంగజేసేపిండిని గురించి జాగ్రత్త పడండి” అని వారితో చెప్పాడు. అప్పుడు రొట్టెల్లో వాడే పొంగజేసే పదార్థాన్ని గురించి కాక పరిసయ్యులు, సద్దూకయ్యులు చేసే బోధ విషయంలో జాగ్రత్తపడమని ఆయన తమతో చెప్పాడని శిష్యులు గ్రహించారు. యేసు కైసరయ ఫిలిప్పీ ప్రాంతాలకు వచ్చినపుడు తన శిష్యులను ఇలా అడిగాడు, “మనుష్య కుమారుడు ఎవరని ప్రజలు మాట్లాడుకుంటున్నారు?” వారు, “కొందరేమో నీవు బాప్తిసమిచ్చే యోహానువనీ, మరి కొందరు ఏలీయావనీ, కొందరు యిర్మీయావనీ, లేక ఎవరో ఒక ప్రవక్తవనీ అనుకొంటున్నారు” అన్నారు. “అయితే మీరు నేనెవరినని భావిస్తున్నారు?” అని వారిని అడిగాడు. వెంటనే సీమోను పేతురు, “నీవు అభిషిక్తుడివి! సజీవుడైన దేవుని కుమారుడివి!” అని చెప్పాడు. అందుకు యేసు అతనితో ఇలా అన్నాడు, “యోనా కుమారా, సీమోనూ, నీవు ధన్యుడివి. ఎందుకంటే ఈ సత్యం నీకు వెల్లడి చేసింది పరలోకంలోని నా తండ్రే గాని మానవ మాత్రులు కాదు. ఇంకో విషయం, నీవు పేతురువి. ఈ బండమీద నా సంఘాన్ని నిర్మిస్తాను. పాతాళ లోకపు ద్వారాలు దాన్ని ఎదిరించి నిలబడలేవు. పరలోక రాజ్యపు తాళాలు నీకిస్తాను. నీవు భూమి మీద దేనిని బంధిస్తావో దాన్ని పరలోకంలో బంధించడం, దేనిని విడిపిస్తావో దాన్ని పరలోకంలో విడిపించడం జరుగుతుంది.”