మత్తయి 16:1-12

మత్తయి 16:1-12 IRVTEL

అప్పుడు పరిసయ్యులు, సద్దూకయ్యులు వచ్చి ఆయనను పరీక్షించడానికి తమ కోసం పరలోకం నుండి ఒక అద్భుతం చెయ్యమని అడిగారు. ఆయన వారితో ఇలా అన్నాడు, “సాయంకాలం ఆకాశం ఎర్రగా ఉంది కాబట్టి వర్షం కురవదనీ, అదే ఆకాశం ఉదయం ఎర్రగా, మబ్బులతో ఉంది కాబట్టి గాలివాన వస్తుందనీ మీరు చెబుతారు కదా. ఆకాశంలోని సూచనలు మీకు తెలుసు గాని ఈ కాలాల సూచనలు మాత్రం గుర్తించలేరు. సూచక క్రియలు అడిగే ఈ తరం దుష్టత్వంతో, వ్యభిచారంతో నిండి ఉంది. యోనా ప్రవక్త గురించినది తప్ప మరే సూచనా ఈ తరానికి ఇవ్వడం జరగదు.” ఆ వెంటనే ఆయన వారిని విడిచి వెళ్ళిపోయాడు. అవతలి ఒడ్డుకు చేరినప్పుడు ఆయన శిష్యులు రొట్టెలు తెచ్చుకోవడం మర్చిపోయారు. అప్పుడు యేసు, “పరిసయ్యులు, సద్దూకయ్యులు అనే పొంగజేసే పిండిని గురించి జాగ్రత్త పడండి” అని వారితో అన్నాడు. అయితే శిష్యులు “మనం రొట్టెలు తేకపోవడం చేత ఇలా అన్నాడు” అని తమలో తాము చర్చించుకున్నారు. యేసుకు అది తెలిసి, “అల్పవిశ్వాసులారా, మీరు రొట్టెలు తీసుకు రాని విషయం గురించి ఎందుకు ఆలోచిస్తున్నారు? “మీరింకా గ్రహించలేదా? ఐదు రొట్టెలు ఐదు వేలమంది తిన్న తరువాత ఎన్ని పెద్ద గంపలు ఎత్తారో, ఏడు రొట్టెలు నాలుగు వేలమంది తిన్న తరువాత ఎన్ని పెద్ద గంపలు ఎత్తారో అవేమీ మీకు గుర్తు లేదా? నేను మీతో మాట్లాడింది రొట్టెలను గురించి కాదని ఎందుకు గ్రహించరు? పరిసయ్యులు, సద్దూకయ్యులు అనే పొంగజేసేపిండిని గురించి జాగ్రత్త పడండి” అని వారితో చెప్పాడు. అప్పుడు రొట్టెల్లో వాడే పొంగజేసే పదార్థాన్ని గురించి కాక పరిసయ్యులు, సద్దూకయ్యులు చేసే బోధ విషయంలో జాగ్రత్తపడమని ఆయన తమతో చెప్పాడని శిష్యులు గ్రహించారు.