మత్తయి 15:22-37

మత్తయి 15:22-37 IRVTEL

అప్పుడు అక్కడ నివసించే కనాను జాతి స్త్రీ ఒకామె వచ్చి, “ప్రభూ, దావీదు కుమారా, నన్ను కరుణించు. నా కూతురికి దయ్యం పట్టి విపరీతంగా బాధ పెడుతున్నది” అని పెద్దగా అరిచి చెప్పింది. కానీ ఆయన ఏమీ బదులు పలకలేదు. అప్పుడు ఆయన శిష్యులు, “ఈమె కేకలు వేస్తూ మన వెంటే వస్తున్నది, ఈమెని పంపించెయ్యి” అని ఆయనను వేడుకున్నారు. దానికి ఆయన, “దేవుడు ఇశ్రాయేలు వంశంలో తప్పిపోయిన గొర్రెల దగ్గరకే నన్ను పంపించాడు, ఇంకెవరి దగ్గరకూ కాదు” అని జవాబిచ్చాడు. అయినా ఆమె వచ్చి ఆయనకు మొక్కి, “ప్రభూ, నాకు సహాయం చెయ్యి” అంది. ఆయన, “పిల్లలు తినే రొట్టెను కుక్కపిల్లలకి పెట్టడం సరి కాదు” అని ఆమెతో అన్నాడు. ఆమె, “ప్రభూ, నిజమే! కాని కుక్కపిల్లలు సైతం తమ యజమాని భోజనం బల్లపై నుండి కింద పడే ముక్కలు తింటాయి కదా” అంది. అందుకు యేసు, “నీ నమ్మకం గొప్పదమ్మా. నీవు కోరుకున్నట్టే నీకు జరుగుతుంది” అని ఆమెతో చెప్పాడు. సరిగ్గా ఆ గంటలోనే ఆమె కుమార్తె బాగుపడింది. యేసు అక్కడ నుండి బయలుదేరి, గలిలయ సముద్రం పక్కగా ఉన్న ఒక కొండ ఎక్కి కూర్చున్నాడు. ప్రజలు గుంపులు గుంపులుగా అనేకమంది కుంటివారిని, గుడ్డివారిని, మూగవారిని, వికలాంగులను, ఇంకా అనేక రోగాలున్న వారిని తీసుకు వచ్చి ఆయన పాదాల దగ్గర ఉంచారు. ఆయన వారిని బాగుచేశాడు. మూగవారు మాట్లాడటం, వికలాంగులు బాగుపడటం, కుంటివారు నడవటం, గుడ్డివారికి చూపు రావడం చూసి ప్రజలు ఆశ్చర్యపడ్డారు. వారంతా ఇశ్రాయేలీయుల దేవునికి స్తుతులు చెల్లించారు. అప్పుడు యేసు తన శిష్యులను పిలిచి, “ఈ ప్రజల మీద నాకు జాలిగా ఉంది. మూడు రోజుల నుండి వీరు నా దగ్గరే ఉన్నారు. వారికి తినడానికి ఏమీ లేదు. వాళ్ళను ఆకలితో పంపటం నాకిష్టం లేదు. అలా పంపివేస్తే వారు దారిలోనే స్పృహ తప్పి పోతారేమో” అన్నాడు. ఆయన శిష్యులు, “ఇంతమందికి సరిపడినన్ని రొట్టెలు ఈ అడవి ప్రాంతంలో ఎక్కడ దొరుకుతాయి?” అన్నారు. యేసు, “మీ దగ్గర ఎన్ని రొట్టెలున్నాయి?” అని వారిని అడిగాడు. వారు, “ఏడు రొట్టెలు, కొన్ని చిన్న చేపలు ఉన్నాయి” అని చెప్పారు. అప్పుడు యేసు “నేల మీద కూర్చోండి” అని ఆ ప్రజలకి ఆజ్ఞాపించి, ఆ ఏడు రొట్టెలు, ఆ చేపలు పట్టుకుని దేవునికి కృతజ్ఞతలు చెల్లించి వాటిని ముక్కలు చేసి తన శిష్యులకిచ్చాడు. శిష్యులు ఆ ప్రజలకు వాటిని పంచిపెట్టారు. వారంతా కడుపారా తిన్న తరువాత అక్కడ ఏడు గంపల నిండుగా ముక్కలు మిగిలిపోయాయి.