మత్తయి 13:24-46

మత్తయి 13:24-46 IRVTEL

ఆయన మరొక ఉపమానం వారితో చెప్పాడు, “పరలోక రాజ్యం తన పొలంలో మంచి విత్తనాలు చల్లించిన రైతులా ఉంది. మనుషులు నిద్రపోతూ ఉంటే అతని శత్రువు వచ్చి గోదుమల మధ్య కలుపు మొక్కల విత్తనాలు చల్లి పోయాడు. మొక్కలు పెరిగి కంకులు వేసినప్పుడు ఆ కలుపు మొక్కలు కూడా కనిపించాయి. అప్పుడు ఆ రైతు పనివారు అతని దగ్గరికి వచ్చి ‘అయ్యా, నువ్వు నీ పొలంలో మంచి విత్తనం చల్లించావు గదా, అందులో కలుపు మొక్కలు ఎలా వచ్చాయి?’ అని అడిగారు. ‘ఇది పగవాడు చేసిన పని’ అని అతడు వారితో అన్నాడు. ఆ పనివారు ‘మేము వెళ్ళి ఆ కలుపు మొక్కలను పీకేయమంటారా?’ అని అతన్ని అడిగారు. అందుకు ఆ యజమాని, ‘వద్దు. కలుపు మొక్కలను పీకితే వాటితోబాటు గోదుమ మొక్కలనుకూడా పెళ్లగిస్తారేమో. కోతకాలం వరకూ రెంటినీ కలిసి పెరగనివ్వండి. కోతకాలంలో మొదట కలుపు మొక్కలను పోగు చేసి కాల్చివేయడానికి కట్టలు కట్టండి. గోదుమలను నా గిడ్డంగిలో చేర్చండి, అని కోత కోసే వారికి చెబుతాను’ అన్నాడు.” ఆయన మరొక ఉపమానం వారితో చెప్పాడు. “పరలోకరాజ్యం ఇలా ఉంది. ఒకడు తన పొలంలో ఒక ఆవ విత్తనం నాటాడు. అది విత్తనాలన్నిటిలో చిన్నదే గాని పెరిగినప్పుడు కూర మొక్కలన్నిటినీ మించిన పెద్ద చెట్టు అవుతుంది. పక్షులు వచ్చి దాని కొమ్మల్లో గూళ్ళు కట్టుకుంటాయి.” ఆయన ఇంకొక ఉపమానం వారితో చెప్పాడు, “పరలోక రాజ్యం ఒక స్త్రీ మూడు మానికల పిండిలో వేసి కలిపి అది అంతా పులిసేలా చేసిన పులిపిండిలాగా ఉంది.” “నేను నా నోరు తెరచి ఉపమానాలతో బోధిస్తాను. లోకం సృష్టి మొదలుకొని రహస్యంగా ఉండిపోయిన విషయాలు చెబుతాను.” అని ప్రవక్త చెప్పిన మాట నెరవేరేలా యేసు ఈ సంగతులన్నీ ప్రజలకు ఉపమానాలతో బోధించాడు. ఉపమానం లేకుండా ఆయన వారికి దేన్నీ బోధించలేదు. అప్పుడాయన ప్రజలను పంపివేసి, ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఆయన శిష్యులు ఆయన దగ్గరికి వచ్చి, “పొలంలోని కలుపు మొక్కలను గురించిన ఉపమానం అర్థం మాకు చెప్పు” అని అడిగారు. అందుకాయన ఇలా అన్నాడు, “మంచి విత్తనం చల్లేది మనుష్య కుమారుడు. పొలం ఈ లోకం. మంచి విత్తనాలు పరలోక రాజ్యానికి సంబంధించిన వారు. కలుపు మొక్కలు దుష్టుని సంబంధులు. వాటిని చల్లే ఆ శత్రువు సాతాను. కోతకాలం లోకాంతం. కోత కోసే వారు దేవదూతలు. కలుపు మొక్కలను పోగుచేసి మంటల్లో కాల్చినట్టే ఈ లోకాంతంలో జరుగుతుంది. మనుష్యకుమారుడు తన దూతలను పంపుతాడు. వారాయన రాజ్యంలో నుండి పాపానికి కారణమయ్యే ప్రతి దానినీ దుర్మార్గం చేసే వారందరినీ సమకూర్చి అగ్నిగుండంలో పడవేస్తారు. అక్కడ ఏడుపూ పళ్ళు కొరుక్కోవడమూ ఉంటాయి. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యుని లాగా ప్రకాశిస్తారు. వినగలిగే చెవులున్నవాడు విను గాక. “పరలోకరాజ్యం పొలంలో దాచిన నిధి లాగా ఉంది. ఒక మనిషి దాన్ని చూసి దాచి పెట్టి, అది దొరికిన సంతోషంతో వెళ్ళి, తనకున్నదంతా అమ్మి ఆ పొలం కొంటాడు. “పరలోకరాజ్యం మంచి ముత్యాలను కొనడానికి వెతుకుతున్న ఒక వ్యాపారస్తుడి లాగా ఉంది. అతడు చాలా విలువైన ఒక ముత్యం కనబడగానే పోయి తనకు ఉన్నదంతా అమ్మేసి దాన్ని కొనుక్కుంటాడు.