మత్తయి 12:30-42

మత్తయి 12:30-42 IRVTEL

నా వైపున ఉండనివాడు నాకు విరోధే. నాతో కలిసి పోగు చెయ్యని వాడు చెదరగొట్టేవాడే. “కాబట్టి నేను మీతో చెప్పేదేమిటంటే, మనుషులు చేసే ప్రతి పాపానికీ దూషణకూ క్షమాపణ దొరుకుతుందిగానీ దేవుని ఆత్మకు వ్యతిరేకమైన దూషణకు క్షమాపణ దొరకదు. మనుష్య కుమారుడికి విరోధంగా మాట్లాడే ఎవరికైనా క్షమాపణ దొరుకుతుందిగానీ పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడే వారికి, ఈ లోకంలోగానీ రాబోయే లోకంలోగానీ క్షమాపణ ఉండదు. “చెట్టు మంచిదయితే దాని పండూ మంచిదవుతుంది. అలా కాక, చెట్టు చెడ్డదయితే దాని పండూ చెడ్డదవుతుంది. చెట్టు ఎలాటిదో దాని పండు వలన తెలుసుకోవచ్చు. విష సర్ప సంతానమా, మీరు చెడ్డవారై ఉండి మంచి మాటలు ఎలా మాట్లాడగలరు? హృదయంలో నిండి ఉన్న దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. మంచివాడు తన హృదయంలోని మంచి సంపదలో నుండి మంచి వాటిని బయటికి తెస్తాడు. చెడ్డవాడు తన హృదయంలోని చెడ్డ సంపదలో నుండి చెడ్డవాటిని బయటికి తెస్తాడు. మనుషులు అజాగ్రత్తగా పలికే ప్రతి మాటకూ తీర్పు రోజున లెక్క చెప్పవలసి ఉంటుందని మీతో చెబుతున్నాను. నీ మాటలను బట్టి నువ్వు నీతిపరుడివని తీర్పు పొందుతావు. నీ మాటలను బట్టే నీవు శిక్ష పొందుతావు.” అప్పుడు ధర్మశాస్త్ర పండితులు, పరిసయ్యుల్లో కొందరు ఆయనకు జవాబిస్తూ, “బోధకుడా, నువ్వు ఒక సూచక క్రియ చేస్తే చూడాలని ఉంది” అన్నారు. ఆయన ఇలా అన్నాడు, “వ్యభిచారులైన ఈ దుర్మార్గపు తరం వారు సూచక క్రియ అడుగుతున్నారు. యోనా ప్రవక్త గురించిన సూచక క్రియ తప్ప ఏ సూచక క్రియా వారికి ఇవ్వబడదు. యోనా మూడు రాత్రింబగళ్ళు పెద్ద చేప కడుపులో ఎలా ఉన్నాడో అలాగే మనుష్యకుమారుడు మూడు రాత్రింబగళ్ళు భూగర్భంలో ఉంటాడు. నీనెవె ప్రజలు యోనా ప్రకటన విని పశ్చాత్తాప పడ్డారు కాబట్టి నీనెవె వారు ఈ తరం వారితో నిలబడి తీర్పు రోజున వారి మీద నేరం మోపుతారు. చూడండి, యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. తీర్పు రోజున దక్షిణ దేశపు రాణి ఈ తరం వారితో నిలబడి వారి మీద నేరం మోపుతుంది. ఆమె సొలొమోను జ్ఞానం వినడానికి ఎంతో దూరం నుండి వచ్చింది. అయితే చూడండి, సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు.