ఆయన తన పన్నెండు మంది శిష్యులను పిలిచి, అపవిత్రాత్మలను వెళ్ళగొట్టడానికి, అన్నిరకాల రోగాలనూ వ్యాధులనూ బాగుచేయడానికి వారికి అధికారం ఇచ్చాడు.
ఆ పన్నెండు మంది అపొస్తలుల పేర్లు ఇవి. మొట్ట మొదటిగా పేతురు అనే సీమోను, అతని సోదరుడు అంద్రెయ, జెబెదయి కొడుకు యాకోబు, అతని సోదరుడు యోహాను. ఫిలిప్పు, బర్తొలొమయి, తోమా, సుంకరి మత్తయి, అల్ఫయి కొడుకు యాకోబు, తద్దయి, కనానీయుడు సీమోను, ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యూదా.
యేసు ఆ పన్నెండు మందిని పంపుతూ వారికి ఆజ్ఞాపించింది ఏమిటంటే, “మీరు యూదేతరుల ప్రాంతాల్లోకి వెళ్ళొద్దు. సమరయ ప్రాంతంలోని ఏ ఊరిలోకీ వెళ్ళొద్దు. ఇశ్రాయేలు వంశంలో దారి తప్పిన గొర్రెల దగ్గరకే వెళ్ళండి. వెళుతూ, ‘పరలోకరాజ్యం దగ్గర్లో ఉంది’ అని ప్రకటించండి. రోగులను బాగుచేయండి, చనిపోయిన వారిని లేపండి, కుష్టురోగులను శుద్ధి చెయ్యండి, దయ్యాలను వెళ్ళగొట్టండి. ఉచితంగా పొందారు, ఉచితంగానే ఇవ్వండి.
బంగారం, వెండి, ఇత్తడి, ప్రయాణం కోసం పెట్టె, రెండు అంగీలు, చెప్పులు, చేతికర్ర, ఇవేవీ మీ సంచిలో ఉంచుకోవద్దు. ఎందుకంటే పనివాడు తన ఆహారానికి అర్హుడు. మీరు ఏదైనా పట్టణంలో లేదా ఊరిలో ప్రవేశించినప్పుడు దానిలో యోగ్యులెవరో అడిగి తెలుసుకోండి. అక్కడ నుండి వెళ్ళే వరకూ అతని ఇంట్లోనే అతిథిగా ఉండిపొండి. ఆ ఇంట్లో ప్రవేశిస్తూ ఇంటివారికి శుభం పలకండి. ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ శాంతి దాని పైకి వస్తుంది. దానిలో యోగ్యత లేకపోతే మీ శాంతి మీకు తిరిగి వచ్చేస్తుంది.
ఎవరైనా మిమ్మల్ని చేర్చుకోకపోతే మీ మాటలు వినకపోతే మీరు ఆ ఇంటిని గానీ ఆ ఊరిని గానీ, విడిచి వెళ్ళిపోయేటపుడు మీ పాదధూళి దులిపి వేయండి. తీర్పు దినాన ఆ పట్టణానికి పట్టే గతి కంటే సొదొమ గొమొర్రా నగరాల గతి నయంగా ఉంటుందని మీతో కచ్చితంగా చెబుతున్నాను.
“తోడేళ్ళ మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుతున్నాను. కాబట్టి పాముల్లాగా వివేకంగా, పావురాల్లాగా కపటం లేకుండా ఉండండి. మనుషుల గురించి జాగ్రత్తగా ఉండండి. వారు మిమ్మల్ని న్యాయస్థానాలకు అప్పగించి, తమ సమాజ మందిరాల్లో మిమ్మల్ని కొరడాలతో కొట్టిస్తారు. వీరికీ యూదేతరులకూ సాక్షార్థంగా నాకోసం మిమ్మల్ని అధిపతుల దగ్గరకీ రాజుల దగ్గరకీ తెస్తారు.
వారు మిమ్మల్ని అప్పగించేటపుడు, ‘ఎలా మాట్లాడాలి? ఏమి చెప్పాలి?’ అని ఆందోళన పడవద్దు. మీరేమి చెప్పాలో అది ఆ సమయంలోనే దేవుడు మీకు తెలియజేస్తాడు. మాట్లాడేది మీరు కాదు, మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడతాడు. సోదరుడు సోదరుణ్ణి, తండ్రి కొడుకునూ చావుకు అప్పగిస్తారు. పిల్లలు తల్లిదండ్రుల మీద లేచి వారిని చంపిస్తారు. నా నామాన్ని బట్టి అందరూ మిమ్మల్ని ద్వేషిస్తారు. చివరి వరకూ సహించే వారిని దేవుడు రక్షిస్తాడు.
వారు ఈ పట్టణంలో మిమ్మల్ని హింసిస్తుంటే వేరే పట్టణానికి పారిపొండి. మనుష్య కుమారుడు వచ్చేలోగా మీరు ఇశ్రాయేలు పట్టణాలు అన్నిటికీ వెళ్ళి ఉండరు అని మీతో కచ్చితంగా చెబుతున్నాను.