ఆయన తన పన్నెండుగురు శిష్యులను పిలిచి వారికి దయ్యాలన్నిటి మీద శక్తినీ అధికారాన్నీ, రోగాలు నయం చేసే శక్తినీ ఇచ్చాడు. దేవుని రాజ్యాన్ని ప్రకటించడానికీ రోగులను బాగు చేయడానికీ వారిని పంపాడు. అప్పుడు ఆయన, “మీరు ప్రయాణం కోసం చేతికర్రను గానీ సంచిని గానీ రొట్టెను గానీ వెండిని గానీ ఇంకా దేనినైనా తీసుకు వెళ్ళవద్దు. రెండు అంగీలు దగ్గర ఉంచుకోవద్దు. మీరు ఏ ఇంట్లో ప్రవేశిస్తారో ఆ ఇంట్లోనే బస చేయండి. అక్కడ నుండే బయలుదేరండి. మిమ్మల్ని ఎవరైనా చేర్చుకోకపోతే ఆ ఊరిలో నుండి బయలుదేరేటప్పుడు వారిమీద సాక్ష్యంగా ఉండడానికి మీ కాలి దుమ్మును దులిపివేయండి” అన్నాడు. వారు బయలుదేరి అన్ని స్థలాల్లో సువార్త ప్రకటిస్తూ, రోగులను బాగు చేస్తూ గ్రామాల్లో పర్యటించారు. జరుగుతున్నవన్నీ రాష్ట్రపాలకుడు హేరోదు విని కలవరపడ్డాడు. ఎందుకంటే ఆయన గురించి కొందరు ‘యోహాను చనిపోయి లేచాడు’ అనీ, మరి కొందరు ‘ఏలీయా కనిపించాడు’ అనీ, ఇంకొంతమంది ‘పూర్వకాలంలో నివసించిన ప్రవక్త ఒకరు లేచాడు’ అనీ చెప్పుకుంటూ ఉన్నారు. అప్పుడు హేరోదు ‘నేను యోహాను తల తీయించాను కదా. మరి ఎవరిని గురించి ఈ సంగతులు అంటున్నారో’ అనుకుని ఆయనను చూడాలనుకున్నాడు. అపొస్తలులు తిరిగి వచ్చి, తాము చేసినవన్నీ ఆయనకు తెలియజేశారు. అప్పుడు ఆయన వారిని వెంట బెట్టుకుని బేత్సయిదా అనే ఊరికి ఏకాంతంగా వెళ్ళాడు. జన సమూహాలు అది తెలుసుకుని ఆయనను అనుసరించారు. ఆయన వారిని రానిచ్చి, దేవుని రాజ్యం గురించి వారికి బోధిస్తూ రోగులను బాగుచేశాడు. పొద్దు గుంకుతూ ఉన్నప్పుడు పన్నెండుమంది శిష్యులు ఆయన దగ్గరికి వచ్చి, “మనం అరణ్య ప్రాంతంలో ఉన్నాం. వీరంతా చుట్టుపక్కల గ్రామాలకూ, పల్లెలకూ వెళ్ళి రాత్రి బస చూసుకుని, ఆహారం సంపాదించుకోడానికి వీరిని పంపించెయ్యి” అన్నారు. ఆయన, “మీరే వీళ్ళకి భోజనం పెట్టండి” అన్నాడు. అప్పుడు వారు మన దగ్గర ఐదు రొట్టెలూ రెండు చేపలూ తప్పించి ఇంకేమీ లేవు. వీళ్ళందరికీ పెట్టాలంటే భోజనం కొని తేవాల్సిందే” అన్నారు. అక్కడ సుమారు పురుషులే ఐదు వేలమంది ఉన్నారు. ఆయన, “వారిని యాభై మంది చొప్పున బారులు తీర్చి కూర్చోబెట్టండి” అని శిష్యులతో చెప్పాడు. వారు అలానే చేసి అందర్నీ కూర్చోబెట్టారు. అప్పుడు ఆయన ఆ ఐదు రొట్టెలనూ రెండు చేపలనూ తీసుకు, ఆకాశం వైపు చూసి, వాటిని దీవించి, విరిచి, జనసమూహానికి వడ్డించమని శిష్యులకిచ్చాడు. వారంతా తృప్తిగా తిన్న తరువాత మిగిలిన ముక్కలను పన్నెండు గంపల్లో ఎత్తారు.
చదువండి లూకా 9
వినండి లూకా 9
షేర్ చేయి
అన్ని అనువాదాలను సరిపోల్చండి: లూకా 9:1-17
వచనాలను సేవ్ చేయండి, ఆఫ్‌లైన్‌లో చదవండి, బోధన క్లిప్‌లను చూడండి ఇంకా మరెన్నో చేయండి!
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు