లూకా 4:1-21

లూకా 4:1-21 IRVTEL

యేసు పరిశుద్ధాత్మతో నిండి యొర్దాను నది నుండి తిరిగి వచ్చాడు. పరిశుద్ధాత్మ ఆయనను అరణ్యంలోకి నడిపించాడు. అక్కడ నలభై రోజులు సాతాను ఆయనను విషమ పరీక్షలకు గురి చేశాడు. ఆ రోజుల్లో ఆయన ఏమీ తినలేదు. ఆ తరువాత ఆయనకు ఆకలి వేసింది. సాతాను ఆయనతో, “నీవు దేవుడి కుమారుడివైతే, ఈ రాయిని రొట్టె అయిపోమని ఆజ్ఞాపించు” అన్నాడు. యేసు, “‘మనిషి రొట్టె వలన మాత్రమే బతకడు’ అని రాసి ఉంది” అని జవాబిచ్చాడు. అప్పుడు సాతాను ఆయనను ఎత్తయిన కొండ మీదికి తీసుకు వెళ్ళి, ప్రపంచ రాజ్యాలన్నీ ఒక్క క్షణంలో ఆయనకు చూపించాడు. “ఈ రాజ్యాధికారమంతా వాటి వైభవాలతో పాటు నీకిస్తాను. దానిపై అధికారం నాదే. అది ఎవరికివ్వడం నా ఇష్టమో వారికిస్తాను. కాబట్టి నీవు నాకు మొక్కి నన్ను పూజిస్తే ఇదంతా నీదే” అని ఆయనతో చెప్పాడు. అయితే యేసు, “‘నీ దేవుడైన ప్రభువును పూజించి ఆయనను మాత్రమే సేవించాలి’ అని రాసి ఉంది” అని జవాబిచ్చాడు. ఆ తరువాత సాతాను యేసును యెరూషలేముకు తీసుకువెళ్ళి దేవాలయ గోపురంపై ఉంచి, “నీవు దేవుని కుమారుడివైతే ఇక్కడ నుండి కిందికి దూకు. ‘దేవుడు నిన్ను కాపాడడానికి నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. నీ పాదాలకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల్లో ఎత్తిపట్టుకుంటారు’ అని రాసి ఉంది గదా,” అని ఆయనతో అన్నాడు. అయితే యేసు, “‘నీ దేవుడైన ప్రభువును పరీక్షించకూడదు’ అని రాసి ఉంది” అని జవాబిచ్చాడు. సాతాను, యేసును అన్ని రకాలుగా పరీక్షించడం ముగించి మరొక అవకాశం వచ్చేవరకూ ఆయనను విడిచి వెళ్ళిపోయాడు. అప్పుడు యేసు పరిశుద్ధాత్మ శక్తితో గలిలయకు తిరిగి వెళ్ళిపోయాడు. ఆయనను గురించిన సమాచారం ఆ ప్రాంతమంతా వ్యాపించింది. ఆయన వారి సమాజ మందిరాల్లో బోధిస్తుంటే అందరూ ఆయనను మెచ్చుకున్నారు. ఒక రోజు తాను పెరిగిన నజరేతుకు ఆయన వచ్చాడు. తన అలవాటు ప్రకారం విశ్రాంతి దినాన సమాజ మందిరానికి వెళ్ళి చదవడానికి నిలబడ్డాడు. యెషయా ప్రవక్త గ్రంథం వారు ఆయనకు అందించారు. ఆయన గ్రంథం విప్పితే, “ప్రభువు ఆత్మ నా మీద ఉన్నాడు. పేదలకు సువార్త ప్రకటించడానికి ఆయన నన్ను అభిషేకించాడు. చెరలో ఉన్న వారికి స్వేచ్ఛ, గుడ్డివారికి చూపు వస్తుందని ప్రకటించడానికీ అణగారిన వారిని విడిపించడానికీ, ప్రభువు అనుగ్రహ సంవత్సరం ప్రకటించడానికీ ఆయన నన్ను పంపాడు” అని రాసిన చోటు ఆయనకు దొరికింది. ఆయన గ్రంథం మూసి సమాజ మందిర పరిచారకునికి ఇచ్చి కూర్చున్నాడు. సమాజ మందిరంలో ఉన్న వారంతా ఆయనను తేరి చూశారు. “మీరు వింటూ ఉండగానే ఈ లేఖనం నెరవేరింది” అని ఆయన వారితో అన్నాడు.