లూకా 24:36-53

లూకా 24:36-53 IRVTEL

వారు ఇలా మాట్లాడుకుంటూ ఉండగా యేసే వారి మధ్య నిలబడి, “మీకు శాంతి కలుగు గాక” అన్నాడు. అయితే వారు తమకేదో ఆత్మ కనిపించిందనుకుని భయంతో హడలిపోయారు. అప్పుడాయన, “మీరు ఎందుకు భయపడుతున్నారు? మీ హృదయాల్లో ఎందుకు సందేహపడుతున్నారు? నేనే ఆయనను అనడానికి రుజువుగా నా చేతులూ, నా పాదాలూ చూడండి. నన్ను ముట్టుకుని చూడండి. నాకు ఉన్నట్టుగా ఆత్మకు ఎముకలూ మాంసమూ ఉండవు” అని చెప్పాడు. అలా చెప్పి తన చేతులనూ, కాళ్ళనూ వారికి చూపించాడు. అయితే వారు సంతోషంతో తబ్బిబ్బులై పోతూ ఇంకా నమ్మకుండా ఆశ్చర్యపోతూ ఉన్నారు. అప్పుడు ఆయన, “మీ దగ్గర ఏదైనా ఆహారం ఉందా?” అని అడిగాడు. వారు కాల్చిన చేప ముక్కను ఆయనకు ఇచ్చారు. ఆయన దాన్ని తీసుకుని వారి కళ్ళ ముందే తిన్నాడు. తరువాత ఆయన, “మోషే ధర్మశాస్త్రంలోనూ, ప్రవక్తల గ్రంథాల్లోనూ, కీర్తనల్లోనూ నా గురించి రాసినవన్నీ నెరవేరాలని నేను మీతో ఉన్నప్పుడు చెప్పాను గదా” అన్నాడు. అప్పుడు లేఖనాలను గ్రహించగలిగేలా ఆయన వారి మనసులను తెరిచాడు. “క్రీస్తు హింసల పాలై చనిపోయి మూడవ రోజున చనిపోయిన వారిలో నుండి లేస్తాడనీ, యెరూషలేములో ప్రారంభమై సమస్త జాతులకూ ఆయన పేర పశ్చాత్తాపం, పాప క్షమాపణ ప్రకటన జరుగుతుందనీ రాసి ఉంది. మీరు ఈ విషయాలన్నిటికీ సాక్షులు. “వినండి, నా తండ్రి చేసిన వాగ్దానాన్ని మీ మీదికి పంపుతున్నాను. మీరు పైనుండి శక్తి పొందే వరకూ పట్టణంలోనే ఉండండి” అని వారికి చెప్పాడు. ఆయన బేతనియ వరకూ వారిని తీసుకు పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించాడు. అలా వారిని ఆశీర్వదిస్తూ ఉండగానే ఆయన వారిలో నుండి వేరై పరలోకానికి ఆరోహణం అయ్యాడు. వారు ఆయనను ఆరాధించి గొప్ప ఆనందంతో యెరూషలేముకు తిరిగి వెళ్ళారు. దేవాలయంలో నిరంతరం ఉంటూ దేవుణ్ణి కీర్తిస్తూ, ఆరాధిస్తూ ఉన్నారు.