లూకా 24:28-35

లూకా 24:28-35 IRVTEL

ఇంతలో వారి గ్రామం వచ్చింది. ఆయన ఇంకా ముందుకు ప్రయాణం చేస్తున్నట్టు కనిపించింది. దాంతో వారు, “పొద్దు వాలుతున్నది. చీకటి పడుతుంది. ఈ రాత్రికి ఇక్కడే ఉండు” అంటూ ఆయనను బలవంతం చేశారు. కాబట్టి ఆయన వారితో కూడా ఇంట్లోకి వెళ్ళాడు. ఆయన వారితో భోజనానికి కూర్చున్నప్పుడు, ఒక రొట్టెను పట్టుకుని దానికోసం కృతజ్ఞతలు చెప్పి, విరిచి తినడానికి వారికిచ్చాడు. అప్పుడు వారి కళ్ళు తెరుచుకున్నాయి. వారు ఆయనను గుర్తు పట్టారు. అయితే ఆయన వారికి కనబడకుండా మాయమయ్యాడు. అప్పుడు వారు, “దారిలో ఆయన మనతో మాట్లాడుతూ లేఖనాలను మనకు అర్థం అయ్యేలా చెబుతున్నప్పుడు మన హృదయాలు దహించుకు పోతున్నట్టు అనిపించ లేదూ” అని చెప్పుకున్నారు. అప్పుడే వారు లేచి తిరిగి యెరూషలేము వెళ్ళారు. అక్కడ పదకొండు మంది శిష్యులూ, వారితో ఉన్నవారూ కలుసుకుని “ప్రభువు నిజంగా లేచి సీమోనుకు కనిపించాడు” అని చెప్పుకుంటున్నారు. వారది విని దారిలో జరిగిన సంగతులూ, ఆయన రొట్టె విరిచిన వెంటనే తమకెలా ప్రత్యక్షమయ్యాడో తెలియజేశారు.