“ఎవరూ దీపాన్ని వెలిగించి చాటుగానో బుట్ట కిందనో పెట్టరు, లోపలికి వచ్చేవారికి వెలుగు కనబడాలని దీపస్తంభం పైనే పెడతారు. నీ దేహానికి దీపం నీ కన్నే. నీ కన్ను మంచిదైతే నీ శరీరమంతా వెలుగు ఉంటుంది. నీ కన్ను చెడిపోతే నీ దేహం చీకటి మయమై ఉంటుంది. కాబట్టి నీలో ఉన్న వెలుగు చీకటి కాకుండా చూసుకో. నీ దేహంలో ఏ భాగమూ చీకటిలో లేకుండా నీ దేహం అంతా వెలుగే ఉన్నట్టయితే, దీపం కాంతి నీపై ప్రసరించినప్పుడు ఎలా ఉంటుందో అలాగే దేహం అంతా వెలుగుమయమై ఉంటుంది.” ఆయన మాట్లాడుతూ ఉండగా ఒక పరిసయ్యుడు తనతో కలసి భోజనం చేయమని ఆయనను ఆహ్వానించాడు. ఆయన అతనితో లోపలికి వెళ్ళి భోజనం వరసలో కూర్చున్నాడు. ఆయన భోజనానికి ముందు కాళ్ళు, చేతులు కడుక్కోకపోవడం చూసి ఆ పరిసయ్యుడు ఆశ్చర్యపోయాడు. అది చూసి ప్రభువిలా అన్నాడు, “పరిసయ్యులైన మీరు పాత్రనూ పళ్ళేన్నీ బయట శుభ్రం చేస్తారు గానీ మీ అంతరంగం మాత్రం దోపిడీతో, చెడుతనంతో నిండి ఉంది. అవివేకులారా, బయటి భాగాన్ని చేసినవాడే లోపలి భాగాన్ని కూడా చేశాడు కదా! మీకు ఉన్నవాటిని పేదలకు ధర్మం చేయండి. అప్పుడు మీకు అన్నీ శుభ్రంగా ఉంటాయి. అయ్యో పరిసయ్యులారా, మీకు యాతన. మీరు పుదీనా, సదాప మొదలైన ప్రతి ఆకు కూరలోనూ పదోభాగం దేవునికి చెల్లిస్తారు గానీ దేవుని ప్రేమనూ, న్యాయాన్నీ వదిలేస్తున్నారు. మిగిలిన వాటిని చేస్తూనే న్యాయంగా నడుచుకోవాలి, దేవుణ్ణి ప్రేమించాలి. అయ్యో పరిసయ్యులారా, మీకు యాతన, మీరు సమాజ మందిరాల్లో అగ్ర స్థానాలూ, వ్యాపార వీధుల్లో ప్రజల నుండి వందనాలూ కోరుకుంటారు. అయ్యో, మీరు కనిపించని సమాధుల్లా ఉన్నారు. అవి సమాధులని తెలియని మనుషులు వాటి మీదే నడుస్తారు.” అప్పుడు ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడు, “బోధకుడా. ఇలా చెప్పి మమ్మల్ని కూడా నిందిస్తున్నావు” అని ఆయనతో అన్నాడు. అందుకు యేసు, “అయ్యో, ధర్మశాస్త్ర ఉపదేశకులారా, మీకు యాతన. మీరు మనుషులపై మోయలేని బరువులు మోపుతారు. మీరు మాత్రం ఒక వేలితో కూడా ఆ బరువులను తాకరు. అయ్యో, మీకు యాతన, మీ పూర్వీకులు ప్రవక్తలను చంపారు. మీరు చనిపోయిన ప్రవక్తల సమాధులను కట్టిస్తున్నారు. దీన్నిబట్టి మీరు సాక్షులై మీ పూర్వీకులు చేసిన పనులకు సమ్మతి తెలుపుతున్నారు. వారు ప్రవక్తలను చంపారు. మీరు సమాధులు కడుతున్నారు. ఈ కారణం చేత దేవుని జ్ఞానం చెప్పేదేమిటంటే, ‘నేను వారి దగ్గరికి ప్రవక్తలనూ, అపొస్తలులనూ పంపుతాను. వారు కొంత మందిని చంపుతారు. కొంతమందిని హింసిస్తారు.’ కాబట్టి లోకారంభం నుండీ అంటే హేబెలు రక్తం నుండి బలిపీఠానికీ దేవాలయానికీ మధ్య హతమైన జెకర్యా రక్తం వరకూ చిందిన ప్రవక్తలందరి రక్తం కోసం ఈ తరం వారిపై విచారణ జరుగుతుందని మీకు కచ్చితంగా చెబుతున్నాను. అయ్యో, ధర్మశాస్త్రాన్ని ఉపదేశించే మీరు జ్ఞానం తాళం చెవిని తీసుకు పోయారు. మీరు లోపల ప్రవేశించరు. ప్రవేశించే వారిని అడ్డుకుంటారు” అని చెప్పాడు. ఆయన అక్కడ నుండి వెళ్ళి పోయిన తరువాత ధర్మశాస్త్ర పండితులూ పరిసయ్యులూ ఆయన మీద పగ పట్టి ఆయన మీద నేరం మోపడానికై ఆయన మాటల్లో తప్పు పట్టుకోడానికి చూస్తూ ఆయనతో వాదిస్తూ వచ్చారు.
చదువండి లూకా 11
వినండి లూకా 11
షేర్ చేయి
అన్ని అనువాదాలను సరిపోల్చండి: లూకా 11:33-54
వచనాలను సేవ్ చేయండి, ఆఫ్‌లైన్‌లో చదవండి, బోధన క్లిప్‌లను చూడండి ఇంకా మరెన్నో చేయండి!
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు