లేవీ 9:7-24

లేవీ 9:7-24 IRVTEL

తరువాత మోషే అహరోనుకి ఇలా చెప్పాడు. “బలిపీఠం దగ్గరికి రా, యెహోవా ఆజ్ఞాపించినట్టు నీ పాపం కోసం అర్పించాల్సిన బలినీ, నీ కోసం దహనబలినీ అర్పించి నీ కోసం, ప్రజల కోసం పరిహారం చెయ్యి. ప్రజల కోసం బలి అర్పించి వాళ్ళ కోసం పరిహారం చెయ్యి.” కాబట్టి అహరోను బలిపీఠం దగ్గరికి వెళ్ళాడు. తన పాపాల కోసం బలి అర్పణగా దూడను వధించాడు. అతని కొడుకులు దాని రక్తాన్ని అతని దగ్గరికి తీసుకు వచ్చారు. అహరోను ఆ రక్తంలో తన వేలు ముంచి బలిపీఠపు కొమ్ముల పైన పూశాడు. మిగిలిన రక్తాన్ని బలిపీఠం అడుగు భాగంలో కుమ్మరించాడు. అయితే యెహోవా మోషేకి ఆజ్ఞాపించినట్టు దహనబలిగా దాని కొవ్వునూ, మూత్రపిండాలనూ, కాలేయం పైన పేరుకున్న కొవ్వునూ, బలిపీఠం పైన దహించాడు. దాని మాంసాన్నీ, చర్మాన్నీ శిబిరం బయట పూర్తిగా కాల్చివేశాడు. ఆ తరువాత అహరోను దహనబలి పశువును వధించాడు. అతని కొడుకులు దాని రక్తాన్ని అతనికి అందించారు. ఆ రక్తాన్ని అహరోను బలిపీఠం అన్ని వైపులా చిమ్మాడు. తరువాత వాళ్ళు అతనికి దహనబలి పశువును ముక్కలు చేసి ఆ ముక్కలనూ, తలనూ ఇచ్చారు. అతడు వాటిని బలిపీఠం పైన దహించాడు. దాని అంతర్భాగాలనూ, కాళ్ళనూ నీళ్ళతో కడిగి బలిపీఠం పై ఉన్న దహనబలి అర్పణలపై ఉంచి వాటిని కూడా దహించాడు. తరువాత అహరోను ప్రజల కోసం బలి అర్పించాడు. మేకను పట్టుకుని ప్రజల పాపం కోసం బలి అర్పణగా దాన్ని వధించాడు. మొదటి మేకను వధించినట్టుగానే దీన్ని కూడా పాపాల కోసం వధించాడు. తరువాత యెహోవా ఆజ్ఞాపించినట్టుగా దహనబలి జంతువును అర్పించాడు. దాని తరువాత నైవేద్యాన్ని తెచ్చి దానిలోనుంచి ఒక పిడికెడు తీసి బలిపీఠంపై దాన్ని ఉదయం చెల్లించాల్సిన దహనబలితో పాటు దహించాడు. తరువాత ప్రజల కోసం అర్పించాల్సిన శాంతిబలి అర్పణగా ఎద్దునూ, పోట్టేలునూ వధించాడు. అహరోను కొడుకులు వాటి రక్తాన్ని అతనికి అందించారు. దాన్ని అతడు బలిపీఠం చుట్టూ చిమ్మాడు. అయితే వాళ్ళు ఆ ఎద్దు కొవ్వునూ, పొట్టేలు కొవ్వునూ, కొవ్వుపట్టిన తోకనూ, వాటి అంతర్భాగాల్లోని కొవ్వునూ, మూత్రపిండాలనూ, కాలేయం పై అంటి ఉన్న కొవ్వునూ అతని కిచ్చారు. వాళ్ళు వీటిని ఆ పశువుల రొమ్ము భాగం పైన ఉంచారు. అప్పుడు అహరోను ఆ కొవ్వును బలిపీఠంపై దహించాడు. మోషే ఆజ్ఞాపించినట్టు అహరోను రొమ్ము భాగాన్నీ, కుడి తొడ భాగాన్నీ యెహోవా సమక్షంలో పైకెత్తి అర్పణగా ఆయనకు అర్పించాడు. ఆ తరువాత అహరోను పాపం కోసం బలినీ, దహనబలినీ, శాంతిబలినీ అర్పించి, తన చేతులను ప్రజల వైపు ఎత్తి వాళ్ళను దీవించాడు. తరువాత దిగి వచ్చాడు. మోషే, అహరోనులు ప్రత్యక్ష గుడారం లోపలికి వెళ్ళారు. తిరిగి వచ్చి ప్రజలను దీవించారు. అప్పుడు యెహోవా మహిమ తేజం ప్రజలందరికీ కన్పించింది. యెహోవా సమక్షం లోనుండి అగ్నిజ్వాలలు బయలుదేరి బలిపీఠం పైన ఉన్న దహనబలి సామగ్రినీ, కొవ్వునీ కాల్చి వేశాయి. అది చూసి ప్రజలంతా ఉత్సాహంగా కేకలు పెట్టారు. సాష్టాంగ నమస్కారం చేశారు.