“అపరాధం కోసం చేసే బలి అర్పణ సంగతులు. అది ఎంతో పరిశుద్ధం. దహనబలి కోసం పశువులను వధించే స్థలం లోనే అపరాధబలి పశువులను కూడా వధించాలి. దాని రక్తాన్ని బలిపీఠం చుట్టూ అన్ని వైపులా చిమ్మాలి. దాని కొవ్వు పట్టిన తోకనూ, దాని అంతర్భాగాల్లోని కొవ్వునూ, రెండు మూత్ర పిండాలనూ, వాటి పైని కొవ్వునూ, కాలేయం పైన పేరుకున్న కొవ్వునూ, ఇలా దానిలోని కొవ్వు అంతటినీ తీసి అర్పించాలి. యాజకుడు యెహోవాకి దహనబలిగా వీటిని బలిపీఠం పైన దహించాలి. అది అపరాధం కోసం చేసే బలి. యాజకుడి కుటుంబంలో ప్రతి మగవాడూ దీన్ని తినవచ్చు. ఇది అతి పరిశుద్ధం. కాబట్టి పరిశుద్ధ స్థలం లోనే దీన్ని తినాలి. పాపం కోసం చేసే బలి అపరాధం కోసం చేసే బలిలానే ఉంటుంది. ఈ రెంటికీ పాటించాల్సిన చట్టం ఒకటే. ఆ బలుల్లో మిగిలిన మాంసం వాటితో పరిహారం చేసే యాజకుడికే దక్కుతుంది. దహనబలి పశువు చర్మం ఆ దహనబలిని అర్పించిన యాజకుడికి చెందుతుంది. పొయ్యి మీద కుండలోనైనా, పెనం మీదనైనా వండిన లేదా కాల్చిన నైవేద్యం అంతా యాజకుడికే చెందుతుంది. అది పొడి నైవేద్యమైనా, నూనె కలిపినది అయినా అదంతా అహరోను సంతానం వాళ్ళు సమానంగా పంచుకోవాలి. ప్రజలు యెహోవాకు అర్పించే శాంతి బలిని గూర్చిన చట్టం ఇది. ఎవరైనా కృతఙ్ఞత అర్పణగా దాన్ని అర్పించదలిస్తే దానితో పాటు పొంగజేసే పదార్ధం లేకుండా నూనె కలిపి చేసిన రొట్టెలూ, పొంగజేసే పదార్ధం లేకుండా నూనె రాసి చేసిన అప్పడాలూ, సన్నని పిండిలో నూనె బాగా కలిపి చేసిన రొట్టెలూ అర్పించాలి. వీటితో పాటు కృతజ్ఞతలు చెల్లించడానికి శాంతిబలి అర్పణ సమయంలో పొంగజేసే పదార్ధంతో చేసిన రొట్టెను అర్పించాలి. ఈ వేరు వేరు అర్పణల్లో నుండి ఒక దాన్ని యెహోవాకి అర్పించాలి. శాంతిబలి కోసం బలిపీఠం పైన రక్తాన్ని చిలకరించిన యాజకునికి అది చెందుతుంది. కృతజ్ఞతలు చెల్లించే ఉద్దేశ్యంతో శాంతిబలిని అర్పించే వ్యక్తి బలిపశువు మాంసాన్ని బలి అర్పించే రోజే తినాలి. దాంట్లో దేన్నీ తరువాత రోజు కోసం ఉంచుకోకూడదు. అయితే మొక్కు చెల్లించడం కోసం గానీ, స్వేచ్ఛార్పణ చెల్లించడం కోసం గానీ బలి ఇస్తే ఆ పశువు మాంసాన్ని బలి అర్పణ రోజే తినాలి. కానీ ఏదన్నా మిగిలితే దాన్ని రెండోరోజు కూడా తినవచ్చు. మూడో రోజుకి ఇంకా మిగిలి ఉన్న మాంసాన్ని కాల్చి వేయాలి. ఎవరన్నా శాంతిబలి పశువు మాంసాన్ని ఏ కొంచెమైనా మూడోరోజు కూడా తింటే ఆ బలి అంగీకారానికి నోచుకోదు. ఆ బలి అర్పణ తెచ్చిన వాడి లెక్కలోకి రాదు. అది అసహ్యకరంగా ఉంటుంది. అలా తినేవాడు తన అపరాధాన్ని మోస్తూనే ఉంటాడు. అపవిత్రమైన దానికి తగిలిన మాంసాన్ని తిన కూడదు. దాన్ని కాల్చివేయాలి. మిగిలిన మాంసం పవిత్రులైన వాళ్ళు తినవచ్చు. యెహోవాకు అర్పించే శాంతిబలి పశువు మాంసాన్ని ఎవరైనా అపవిత్రుడిగా ఉండి కొంచెం తిన్నా అలాంటి వాడు ప్రజల్లో లేకుండా పోవాలి. మనుష్యుల అపవిత్రతనైనా, ఏదన్నా జంతువు అపవిత్రతనైనా, లేదా అపవిత్రమైన, అసహ్యకరమైన వస్తువునైనా తాకి దాని తరువాత ఎవరైనా యెహోవాకి అర్పించే శాంతిబలి పశువు మాంసం తింటే అలాంటి వాడు ప్రజల్లో లేకుండా పోవాలి.” ఇంకా యెహోవా మోషేతో మాట్లాడి ఇలా చెప్పాడు. “నువ్వు ఇశ్రాయేలు ప్రజలకు ఇలా చెప్పు, ఎద్దు కొవ్వును గానీ, గొర్రె కొవ్వును గానీ, మేక కొవ్వును గానీ మీరు తిన కూడదు. అర్పణం కాకుండా సాధారణంగా చనిపోయిన పశువు కొవ్వునూ, అడవి మృగాలు చీల్చి వేసిన పశువు కొవ్వునూ ఇతర విషయాలకు ఉపయోగించవచ్చు గానీ ఎట్టి పరిస్థితుల్లోనూ తినకూడదు. యెహోవాకి దహనబలిగా ప్రజలు అర్పించే పశువుల కొవ్వుని తినేవాడు ప్రజల్లో లేకుండా పోవాలి. అలాగే పక్షి రక్తం గానీ, జంతువు రక్తం గానీ మీ ఇళ్ళల్లో తినకూడదు. ఎవడు రక్తాన్ని తింటాడో వాడు ప్రజల్లో లేకుండా పోవాలి.”
చదువండి లేవీ 7
వినండి లేవీ 7
షేర్ చేయి
అన్ని అనువాదాలను సరిపోల్చండి: లేవీ 7:1-27
వచనాలను సేవ్ చేయండి, ఆఫ్‌లైన్‌లో చదవండి, బోధన క్లిప్‌లను చూడండి ఇంకా మరెన్నో చేయండి!
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు