యెహోవా సీనాయికొండ మీద మోషేకు ఇలా చెప్పాడు “నీవు ఇశ్రాయేలీయులతో ఇలా చెప్పు. నేను మీకిస్తున్న దేశానికి మీరు వచ్చిన తరువాత ఆ భూమి కూడా యెహోవా పేరట విశ్రాంతి కాలాన్ని పాటించాలి. ఆరు సంవత్సరాలు నీ పొలంలో విత్తనాలు చల్లాలి. ఆరు సంవత్సరాలు నీ పండ్ల తోటను సాగుచేసి దాని పండ్లు సమకూర్చుకోవచ్చు. ఏడవ సంవత్సరం భూమికి మహా విశ్రాంతి కాలం, అంటే అది యెహోవా పేరట విశ్రాంతి సంవత్సరంగా ఉండాలి. ఆ సంవత్సరం నీ పొలంలో విత్తనాలు చల్ల కూడదు. నీ పండ్ల తోటను బాగు చేయకూడదు. బీడుగా వదిలిన చేలో దానంతట అదే పండిన పంట కోత కోసం ఏర్పాట్లు చేసుకోకూడదు. బాగు చేయని నీ చెట్ల పండ్లు ఏరుకోకూడదు. అది భూమికి విశ్రాంతి సంవత్సరం. అప్పుడు భూమి విశ్రాంతి సంవత్సరంలో దానంతట అదే పండిన పంట నీకు, నీ సేవకుడికి, నీ దాసికి, నీ జీతగాడికి, నీతో నివసిస్తున్న పరదేశికి ఆహారంగా ఉంటుంది. నీ పశువులకు, నీ దేశంలోని జంతువులకు దాని పంట అంతా మేతగా ఉంటుంది. ఏడు విశ్రాంతి సంవత్సరాలను, అంటే ఏడేసి సంవత్సరాలను లెక్క బెట్టాలి. ఆ ఏడు విశ్రాంతి సంవత్సరాల కాలం మొత్తం 49 సంవత్సరాలు అవుతుంది. ఏడో నెల పదవ రోజు మీ దేశమంతటా కొమ్ము బూర ఊదాలి. ప్రాయశ్చిత్త దినాన మీ దేశమంతటా ఆ బూర ఊదాలి. మీరు ఆ సంవత్సరాన్ని, అంటే ఏభైయవ సంవత్సరాన్ని పరిశుద్ధ పరచి మీ దేశంలో ఉన్న వారందరికి విడుదల కలిగిందని చాటించాలి. అది మీకు సునాదం. అప్పుడు మీలో ప్రతివాడూ తన ఆస్తిని తిరిగి సొంతం చేసుకోవాలి. ప్రతివాడూ తన కుటుంబానికి తిరిగి రావాలి. ఆ సంవత్సరం, అంటే ఏభైయవ సంవత్సరం మీకు సునాద కాలం. ఆ సంవత్సరంలో మీరు విత్తనాలు చల్ల కూడదు, కోత ఏర్పాట్లు చేసుకోకూడదు. బీడుగా వదిలిన చేలో దానంతట అదే పండిన పంట తినవచ్చు. బాగు చేయని ద్రాక్ష తోటలో పండ్లు ఏరుకోవచ్చు. అది సునాద కాలం. అది మీకు పవిత్రం. చేలో దానంతట అదే పండిన పంటను మీరు తింటారు. ఆ సునాద సంవత్సరం మీలో ప్రతి వాడు తన ఆస్తిని తిరిగి పొందాలి. నీవు నీ పొరుగు వాడికి అమ్మిన దాని విషయంలో గానీ నీ పొరుగు వాడి దగ్గర నీవు కొనుక్కున్న దాని విషయంలో గానీ మీరు ఒకరినొకరు బాధించుకోకూడదు. సునాద సంవత్సరం అయిన తరువాత జరిగిన సంవత్సరాల లెక్క ప్రకారం నీ పొరుగు వాడి దగ్గర నీవు దాన్ని కొనాలి. పంటల లెక్క చొప్పున అతడు నీకు దాన్ని అమ్మాలి. ఆ సంవత్సరాల లెక్క పెరిగిన కొద్దీ దాని వెల పెంచాలి. ఆ సంవత్సరాల లెక్క తగ్గిన కొద్దీ దాని వెల తగ్గించాలి. ఎందుకంటే పంటవచ్చిన సంవత్సరాల లెక్క చొప్పున అతడు దాని ఖరీదు కట్టాలి గదా. మీరు ఒకరి నొకరు బాధించుకో కుండా నీ దేవునికి భయపడాలి. నేను మీ దేవుడైన యెహోవాను. కాబట్టి మీరు నా శాసనాలను నా విధులను పాటించి వాటి ననుసరించి నడుచుకోవాలి. అప్పుడు మీరు ఆ దేశంలో సురక్షితంగా నివసిస్తారు. ఆ భూమి సస్యశ్యామలంగా ఉంటుంది. మీరు తృప్తిగా తిని దానిలో సురక్షితంగా నివసిస్తారు. ఏడవ సంవత్సరంలో మేము ఏమి తింటాము? మేము విత్తనాలు చల్లకూడదు, పంట కూర్చుకోకూడదు గదా అనుకుంటారేమో. నేను ఆరో సంవత్సరం నా దీవెన మీకు కలిగేలా ఆజ్ఞాపిస్తాను. ఆ సంవత్సరం మూడేళ్ళకు సరిపడిన పంట పండుతుంది. మీరు ఎనిమిదో సంవత్సరాన విత్తనాలు చల్లి తొమ్మిదో సంవత్సరం వరకూ పాత పంట తింటారు. కొత్త పంట వచ్చేదాకా పాత దాన్ని తింటారు. భూమిని శాశ్వతంగా వేరొకడికి అమ్మకూడదు. ఎందుకంటే భూమి నాది. మీరు నా దగ్గర తాత్కాలికంగా నివసిస్తున్న పరదేశులు.
చదువండి లేవీ 25
వినండి లేవీ 25
షేర్ చేయి
అన్ని అనువాదాలను సరిపోల్చండి: లేవీ 25:1-23
వచనాలను సేవ్ చేయండి, ఆఫ్‌లైన్‌లో చదవండి, బోధన క్లిప్‌లను చూడండి ఇంకా మరెన్నో చేయండి!
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు