లేవీ 14:1-20

లేవీ 14:1-20 IRVTEL

యెహోవా మోషేకి ఇలా చెప్పాడు. “చర్మవ్యాధి ఉన్న వ్యక్తి శుద్ధీకరణ జరిగే రోజుకి సంబంధించిన చట్టం ఇది. అతణ్ణి యాజకుడి దగ్గరికి తీసుకురావాలి. చర్మానికి కలిగిన అంటురోగం మానిందీ లేనిదీ పరీక్షించడానికి యాజకుడు శిబిరం బయటకు వెళ్ళాలి. యాజకుడు అతణ్ణి చూసినప్పుడు అతని చర్మవ్యాధి నయం అయితే శుద్ధీకరణ కావాలని కోరే ఆ వ్యక్తిని యాజకుడు జీవించి ఉన్న, లోపం లేని రెండు పక్షులనూ, దేవదారు కర్రనూ, ఎర్రని నూలునూ, హిస్సోపు చెట్టు రెమ్మనూ తీసుకు రమ్మని ఆదేశించాలి. తరువాత యాజకుడు ఆరెండు పక్షుల్లో ఒకదాన్ని పారే నీటిపైన, ఒక మట్టి పాత్రలో చంపమని ఆదేశించాలి. అప్పుడు యాజకుడు బతికి ఉన్న రెండో పక్షినీ, దేవదారు కర్రనూ, ఎర్రని నూలునూ, హిస్సోపు రెమ్మనూ తీసుకుని వాటిని పారే నీటిపైన, ఒక మట్టి పాత్రలో చనిపోయిన పక్షి రక్తంలో ముంచాలి. చర్మవ్యాధి నయమై శుద్ధీకరణ కోసం చూసే వ్యక్తి పైన యాజకుడు ఆ నీళ్ళని ఏడు సార్లు చిలకరించాలి. తరువాత యాజకుడు అతడు శుద్ధుడని ప్రకటించాలి. అప్పుడు యాజకుడు జీవించి ఉన్న రెండో పక్షిని ఎగిరి పోయేట్టు బయట మైదానంలో వదిలి వేయాలి. అప్పుడు శుద్ధీకరణ కోసం వచ్చిన వ్యక్తి తన బట్టలు ఉతుక్కోవాలి. తన జుట్టు కత్తెర వేసుకోవాలి. నీళ్ళతో స్నానం చేయాలి. అప్పుడు అతడు శుద్ధుడు అవుతాడు. తరువాత అతడు శిబిరంలోకి వచ్చి తన గుడారం బయట ఏడు రోజులు ఉండిపోవాలి. ఏడో రోజున అతడు తన తలపై జుట్టునంతా క్షౌరం చేసుకోవాలి. తరువాత తన గడ్డాన్నీ, కనుబొమలను కూడా క్షౌరం చేసుకోవాలి. తన జుట్టు అంతా క్షౌరం చేసుకున్న తరువాత తన బట్టలు ఉతుక్కుని నీళ్ళతో స్నానం చేయాలి. అప్పుడు అతడు శుద్ధుడవుతాడు. ఎనిమిదో రోజు అతడు లోపం లేని రెండు మగ గొర్రె పిల్లలనూ, ఏడాది వయస్సున్న లోపం లేని ఒక ఆడ గొర్రె పిల్లనూ యాజకుడి దగ్గరికి తీసుకురావాలి. వాటితో పాటు నైవేద్యం కోసం నూనె కలిసిన మూడు కిలోల మెత్తని పిండినీ, అర లీటరు నూనెనూ తీసుకు రావాలి. శుద్ధీకరణ చేసే యాజకుడు శుద్ధీకరణ కోసం వచ్చిన వ్యక్తినీ ఈ సామగ్రినీ ప్రత్యక్ష గుడారం ద్వారం దగ్గరఉంచాలి. యాజకుడు వాటిలో ఒక మగ గొర్రెపిల్లనూ, నూనెనూ తీసుకుని వాటిని అపరాధం కోసం చేసే బలిగా అర్పిస్తాడు. వాటిని యెహోవా సమక్షంలో కదలించే అర్పణగా పైకెత్తి కదిలిస్తాడు. పాపం కోసం బలి పశువునూ, దహనబలి పశువునూ వధించే పరిశుద్ధ స్థలం లోనే ఈ మగ గొర్రెపిల్లని వధించాలి. పాపం కోసం చేసే అర్పణలాగే అపరాధం కోసం చేసే అర్పణ కూడా యాజకుడికే చెందుతుంది. ఎందుకంటే అది అతి పరిశుద్ధం. తరువాత యాజకుడు అపరాధం కోసం బలిగా వధించిన పశువు రక్తాన్ని కొంచెం తీసుకుని శుద్ధీకరణ కోసం వచ్చిన వ్యక్తి కుడిచెవి తమ్మె పైనా, కుడిచేతి బొటన వేలిపైనా, కుడి కాలి బొటన వేలిపైనా పూయాలి. తరువాత యాజకుడు అరలీటరు నూనె లో కొంచం తన ఎడమ అరచేతిలో పోసుకోవాలి. ఎడమ చేతిలో ఉన్న నూనెలో తన కుడి చేతి వేలుని ముంచి యెహోవా సమక్షంలో ఏడు సార్లు చిలకరించాలి. తరువాత యాజకుడు తన అరచేతిలో మిగిలిన నూనెలో కొంచెం తీసుకుని శుద్ధీకరణ కోసం వచ్చిన వ్యక్తి కుడిచెవి తమ్మె పైన, కుడిచేతి బొటన వేలిపైన, కుడి కాలి బొటన వేలిపైన ఉన్న అపరాధ బలిగా వధించిన పశువు రక్తంపై పూయాలి. మిగిలిన నూనెని శుద్ధీకరణ కోసం వచ్చిన వ్యక్తి తలపైన రాయాలి. ఆ విధంగా యాజకుడు యెహోవా సమక్షంలో ఆ వ్యక్తి కోసం పరిహారం చేయాలి. అప్పుడు యాజకుడు శుద్ధీకరణ కోసం వచ్చిన వ్యక్తి పాపం కోసం బలిని అర్పించి పరిహారం చేయాలి. ఆ తరువాత యాజకుడు దహనబలి పశువును వధించాలి. యాజకుడు దహనబలినీ, నైవేద్యాన్నీ బలిపీఠం పైన అర్పించాలి. ఆవిధంగా యాజకుడు ఆ వ్యక్తి కోసం పరిహారం చేయాలి. అప్పుడు అతడు శుద్ధుడవుతాడు.