యేసు యోహాను కన్నా ఎక్కువ మందిని శిష్యులుగా చేసుకుంటున్నాడని, అతని కన్నా ఎక్కువ మందికి బాప్తిసమిస్తున్నాడని పరిసయ్యులు విన్నారని ప్రభువుకు తెలిసింది. నిజానికి యేసు తానే బాప్తిసం ఇవ్వలేదు, ఆయన శిష్యులు ఇస్తూ ఉన్నారు. అప్పుడు ఆయన యూదయ దేశం నుండి ప్రయాణమై గలిలయ దేశానికి వెళ్ళాడు. మార్గంలో సమరయ ప్రాంతం గుండా ఆయన ప్రయాణం చేయాల్సి వచ్చింది. అలా ఆయన సమరయలో ఉన్న సుఖారు అనే ఊరికి వచ్చాడు. ఈ ఊరి దగ్గరే యాకోబు తన కొడుకు యోసేపుకు కొంత భూమిని ఇచ్చాడు.
యాకోబు బావి అక్కడ ఉంది. యేసు ప్రయాణంలో అలిసిపోయి ఆ బావి దగ్గర కూర్చున్నాడు. అది మిట్ట మధ్యాహ్నం.
ఒక సమరయ స్త్రీ నీళ్ళు తోడుకోవడానికి ఆ బావి దగ్గరికి వచ్చింది. యేసు ఆమెతో, “తాగడానికి నీళ్ళు ఇస్తావా?” అని అడిగాడు. ఆయన శిష్యులు ఆహారం కొనడానికి ఊరిలోకి వెళ్ళారు. ఆ సమరయ స్త్రీ యేసుతో ఇలా అంది, “నువ్వు యూదుడివి. సమరయ స్త్రీ అయిన నన్ను నీళ్ళు ఎలా అడుగుతున్నావు?” ఎందుకంటే యూదులు సమరయులతో ఎలాంటి సంబంధాలూ పెట్టుకోరు. దానికి యేసు, “నువ్వు దేవుని బహుమానాన్నీ, తాగడానికి నీళ్ళు కావాలని నిన్ను అడుగుతున్న వ్యక్తినీ తెలుసుకుంటే నువ్వే ఆయనను అడిగేదానివి. ఆయన నీకు జీవజలం ఇచ్చి ఉండేవాడు” అన్నాడు.
అప్పుడా స్త్రీ, “అయ్యా, ఈ బావి చాలా లోతు. తోడుకోడానికి నీ దగ్గర చేద లేదు. ఆ జీవజలం నీకెలా దొరుకుతుంది? మన తండ్రి అయిన యాకోబు ఈ బావి నీళ్ళు తాగాడు. తన సంతానానికీ, తన పశువులకూ తాగడానికి ఈ నీళ్ళే ఇచ్చాడు. మాకూ తాగడానికి ఈ బావిని ఇచ్చాడు. నువ్వు ఆయన కంటే గొప్పవాడివా?” అంది. దానికి యేసు, “ఈ నీళ్ళు తాగే ప్రతి ఒక్కరికీ మళ్ళీ దాహం వేస్తుంది.
కానీ నేను ఇచ్చే నీళ్ళు తాగే వారికి ఇక ఎప్పటికీ దాహం వేయదు. నేను వారికిచ్చే నీళ్ళు అయితే వారిలో నిత్య జీవానికి ఊరుతూ ఉండే ఊట అవుతాయి” అన్నాడు.
అప్పుడు ఆమె ఆయనతో, “అయ్యా, నీళ్ళు చేదుకోడానికి నేను ఇంత దూరం రానవసరం లేకుండా ఆ నీళ్ళు నాకివ్వు” అంది. యేసు ఆమెతో, “నువ్వు వెళ్ళి నీ భర్తను ఇక్కడికి తీసుకురా” అన్నాడు. దానికి ఆ స్త్రీ, “నాకు భర్త లేడు” అంది. యేసు ఆమెతో, “‘భర్త లేడని సరిగ్గానే చెప్పావు. ఎందుకంటే నీకు ఐదుగురు భర్తలున్నారు. ఇప్పుడు నీతో ఉన్నవాడు నీ భర్త కాడు. ఈ విషయంలో నువ్వు బాగానే చెప్పావు” అన్నాడు.
అప్పుడా స్త్రీ, “అయ్యా, నువ్వు ఒక ప్రవక్తవి అని నాకు అర్థమౌతున్నది. మా పూర్వీకులు ఈ కొండ పైన ఆరాధించారు. కానీ ఆరాధించే స్థలం యెరూషలేములో ఉందనీ అందరూ అక్కడికే వెళ్ళి ఆరాధించాలనీ మీరు అంటారు” అంది.
అందుకు యేసు ఇలా చెప్పాడు. “అమ్మా, తండ్రిని ఈ కొండ మీదో, యెరూషలేములోనో ఆరాధించని కాలం వస్తుంది. నా మాట నమ్ము. మీరు మీకు తెలియని దాన్ని ఆరాధిస్తారు. మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధిస్తాము. ఎందుకంటే రక్షణ యూదుల్లో నుండే వస్తుంది. నిజమైన ఆరాధికులు తండ్రిని హృదయ పూర్వకంగా ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించే కాలం వస్తుంది. ఇప్పటికే వచ్చేసింది. తనను ఆరాధించేవారు అలాటివారే కావాలని తండ్రి చూస్తున్నాడు.
దేవుడు ఆత్మ కాబట్టి ఆయనను ఆరాధించే వారు ఆత్మతో, సత్యంతో ఆరాధించాలి.” అప్పుడు ఆ స్త్రీ ఆయనతో, “క్రీస్తు అని పిలిచే మెస్సీయ వస్తున్నాడని నాకు తెలుసు. ఆయన వచ్చినప్పుడు మాకు అంతా వివరిస్తాడు” అంది. అది విని యేసు, “నీతో మాట్లాడుతున్న నేనే ఆయన్ని” అని చెప్పాడు.
ఇదే సమయానికి ఆయన శిష్యులు తిరిగి వచ్చారు. ఆ స్త్రీతో ఆయన మాట్లాడుతూ ఉండడం చూసి ‘ఎందుకు మాట్లాడుతున్నాడా’ అని ఆశ్చర్యపడ్డారు. కానీ ‘నీకేం కావాలని’ గానీ ‘ఆమెతో ఎందుకు మాట్లాడుతున్నావు’ అని గానీ ఎవరూ అడగలేదు. ఇక ఆ స్త్రీ తన నీళ్ళ కుండ అక్కడే వదిలిపెట్టి ఊరిలోకి వెళ్ళింది. ఆ ఊరి వారితో, “మీరు నాతో వచ్చి నేను చేసిన పనులన్నిటినీ నాతో చెప్పిన వ్యక్తిని చూడండి. ఈయన క్రీస్తు కాడా?” అంది. వారంతా ఊరి నుండి బయలు దేరి ఆయన దగ్గరికి వచ్చారు.
ఆలోగా శిష్యులు, “బోధకా, భోజనం చెయ్యి” అని ఆయనను బతిమాలారు. దానికి ఆయన, “తినడానికి మీకు తెలియని ఆహారం నాకుంది” అని వారితో చెప్పాడు. “ఆయన తినడానికి ఎవరైనా భోజనం ఏదైనా తెచ్చారా ఏమిటి?” అని శిష్యులు ఒకరితో ఒకరు చెప్పుకున్నారు.
యేసు వారిని చూసి, “నన్ను పంపించిన వాని ఇష్టాన్ని చేయడం, ఆయన పని చేసి ముగించడమే నా ఆహారం. పంట కోయడానికి కోతకాలం రావాలంటే ఇంకా నాలుగు నెలలు ఉన్నాయని మీరు చెబుతారు కదా! మీ తలలెత్తి పొలాలను చూడండి. అవి ఇప్పటికే పక్వానికి వచ్చి కోతకు సిద్ధంగా ఉన్నాయని మీతో చెబుతున్నాను. విత్తనాలు చల్లేవాడూ పంట కోసేవాడూ కలసి సంతోషించేలా కోసేవాడు జీతం తీసుకుని శాశ్వత జీవం కోసం ఫలాన్ని సమకూర్చుకుంటున్నాడు.
ఈ విషయంలో “విత్తనాలు చల్లేది ఒకరు, పంట కోసేది మరొకరు, అనే మాట నిజమే. మీరు దేని కోసం ప్రయాస పడలేదో దాన్ని కోయడానికి మిమ్మల్ని పంపాను. ఇతరులు చాకిరీ చేశారు. వారి కష్టఫలాన్ని మీరు అనుభవిస్తున్నారు” అన్నాడు.
‘నేను చేసినవన్నీ ఆయన నాతో చెప్పాడు’ అంటూ సాక్ష్యం ఇచ్చిన స్త్రీ మాటను బట్టి ఆ పట్టణంలోని అనేక మంది సమరయులు ఆయనలో విశ్వాసముంచారు.
ఆ సమరయ వారు ఆయన దగ్గరికి వచ్చి తమతో ఉండమని ఆయనను వేడుకున్నారు. కాబట్టి ఆయన అక్కడ రెండు రోజులు ఉన్నాడు. ఆయన మాటలు విని ఇంకా చాలా మంది ఆయనలో విశ్వాసముంచారు. వారు ఆ స్త్రీతో, “మేము విశ్వసించింది కేవలం నీ మాట మీదే కాదు.