యిర్మీయా 42:1-12

యిర్మీయా 42:1-12 IRVTEL

అప్పుడు కారేహ కుమారుడు యోహానానూ, హోషేయా కుమారుడు యెజన్యా, సైన్యాధిపతులందరూ ఇంకా గొప్పవారూ, సామాన్యులూ ప్రజలందరూ కలసి ప్రవక్త అయిన యిర్మీయా దగ్గరికి వచ్చారు. వాళ్ళు అతనితో ఇలా అన్నారు. “నువ్వు చూస్తున్నట్టు మేం చాలా తక్కువ మందిమి. మా మనవిని చెవినబెట్టి మిగిలిన ఈ ప్రజల కోసం నీ దేవుడైన యెహోవాను ప్రార్థించు. మేం ఏ మార్గాన వెళ్ళాలో, ఏం చేయాలో నీ దేవుడైన యెహోవాను అడిగి మాకు తెలియజేయి.” కాబట్టి ప్రవక్త అయిన యిర్మీయా వాళ్లకిలా చెప్పాడు. “మీరు చెప్పింది విన్నాను. చూడండి, మీరు అభ్యర్ధించినట్టే నేను మీ దేవుడైన యెహోవాను ప్రార్ధిస్తాను. యెహోవా ఏం జవాబిచ్చాడో అది ఏదీ దాచకుండా మీకు చెప్తాను.” వాళ్ళు యిర్మీయాతో ఇలా అన్నారు. “నీ దేవుడైన యెహోవా మాకు చెప్పినదంతా మేం చేయకపోతే అప్పుడు యెహోవా మాకు వ్యతిరేకంగా నమ్మకమైన సత్యసాక్షిగా ఉంటాడు గాక. అది మాకు అనుకూలంగా ఉన్నా ప్రతికూలంగా ఉన్నా మేము మాత్రం నిన్ను పంపుతున్న మన దేవుడైన యెహోవా స్వరానికి లోబడతాం. మన దేవుడైన యెహోవా చెప్పిన మాటకు లోబడటం మాకు మేలు చేస్తుంది.” పది రోజుల తర్వాత యెహోవా వాక్కు యిర్మీయా దగ్గరికి వచ్చింది. కాబట్టి అతడు కారేహ కొడుకు యోహానానునూ, అతనితో ఉన్న సైన్యాధిపతులందర్నీ, ఇంకా గొప్పవారూ, సామాన్యులూ అయిన ప్రజలందర్నీ తన దగ్గరికి పిలిచాడు. వారికిలా చెప్పాడు. “ఇశ్రాయేలు దేవుడైన యెహోవా దగ్గర మీ కోసం ప్రార్ధించడానికి మీరు నన్ను పంపారు. ఆయన ఇలా చెప్పాడు. ‘మీరు వెనక్కి వెళ్లి ఈ దేశంలోనే నివసించినట్లయితే నేను మిమ్మల్ని నిర్మిస్తాను. మిమ్మల్ని చీల్చివేయను. మిమ్మల్ని నాటుతాను గానీ పెకలించి వేయను. మీ పైకి నేను తెచ్చిన విపత్తును తప్పిస్తాను. మీరు బబులోను రాజుకు భయపడుతూ ఉన్నారు. అతనికి భయపడకండి.’ ఇది యెహోవా చేస్తున్న ప్రకటన. ‘మిమ్మల్ని రక్షించడానికీ, అతని చేతిలో నుండి తప్పించడానికీ నేను మీతో ఉన్నాను కాబట్టి అతనికి భయపడకండి. నేను మిమ్మల్ని కరుణిస్తాను. మీ పైన కనికరపడతాను. మీ దేశానికి తిరిగి మిమ్మల్ని తీసుకువస్తాను.’