యెరుబ్బయలు కొడుకు అబీమెలెకు షెకెములో ఉన్న తన మేనమామల దగ్గరికి వెళ్లి, వాళ్ళతో, తన తల్లి పూర్వీకుల కుటుంబాల వారితో, “మీరు దయ చేసి షెకెము నాయకులందరూ వినేలా వాళ్ళతో మాట్లాడండి, మీకేది మంచిది? యెరుబ్బయలు కొడుకులు డెబ్భైమంది మిమ్మల్ని ఏలుబడి చేయడం మంచిదా? ఒక్కడు మిమ్మల్ని ఏలుబడి చేయడం మంచిదా? నేను మీ రక్తసంబంధినని జ్ఞాపకం చేసుకోండి” అని అన్నాడు. అతని తల్లి సహోదరులు అతని గూర్చి షెకెము యజమానులు వినేలా ఆ మాటలన్నీ చెప్పినప్పుడు వాళ్ళు “ఇతను మన సహోదరుడు” అనుకుని తమ హృదయం అబీమెలెకు వైపు తిప్పుకున్నారు. అప్పుడు వాళ్ళు బయల్బెరీతు గుడిలోనుంచి డెబ్భై తులాల వెండి తెచ్చి అతనికి ఇచ్చినప్పుడు వాటితో అబీమెలెకు అల్లరి మూకను కూలికి పెట్టుకున్నాడు. వాళ్ళు అతని వశంలో ఉన్నవాళ్ళు. తరువాత అతడు ఒఫ్రాలో ఉన్న తన తండ్రి యింటికి వెళ్లి యెరుబ్బయలు కొడుకులు, తన సహోదరులు అయిన ఆ డెబ్భై మందిని ఒక్క బండ మీద చంపాడు. యెరుబ్బయలు చిన్న కొడుకు యోతాము మాత్రమే దాక్కుని తప్పించుకున్నాడు. తరువాత షెకెము నాయకులందరూ, బెత్ మిల్లో ఇంటివారందరూ కలిసి వచ్చి షెకెములో ఉన్న మస్తకి చెట్టు కింద శిబిరం దగ్గర అబీమెలెకును రాజుగా నియమించారు. అది యోతాముకు తెలిసినప్పుడు అతడు వెళ్లి గెరిజీము కొండ అంచు మీద నిలబడి బిగ్గరగా పిలిచి, వాళ్ళతో ఇలా అన్నాడు, “షెకెము పెద్దలారా, మీరు నా మాట వింటే దేవుడు మీ మాట వింటాడు. చెట్లు తమ మీద ఒక రాజును అభిషేకించుకోవాలనుకుని, బయలుదేరి మమ్మల్ని ఏలమని ఒలీవచెట్టుని అడిగాయి. ఒలీవచెట్టు ‘దేవుణ్ణీ మానవులనూ దేనివలన మనుషులు సన్మానిస్తారో అలాటి నా నూనె ఇవ్వకుండా చెట్ల మీద రాజుగా ఉండి ఇటు అటు ఊగడానికి నేను వస్తానా’ అని వాటితో అంది. అప్పుడు చెట్లు, ‘నువ్వు వచ్చి మమ్మల్ని ఏలు’ అని అంజూరపు చెట్టును అడిగాయి. అంజూరపు చెట్టు, ‘చెట్ల మీద రాజుగా ఉండి ఇటు అటు ఊగడానికి నా మాధుర్యాన్ని, నా మంచి ఫలాలను ఇవ్వకుండా నేను మానాలా?’ అని వాటితో అంది. ఆ తరువాత చెట్లు, ‘నువ్వు వచ్చి మమ్మల్ని ఏలు’ అని ద్రాక్షావల్లిని అడిగినప్పుడు ద్రాక్షావల్లి, ‘దేవుణ్ణీ మానవులనూ సంతోషపెట్టే నా రసాన్ని ఇవ్వకుండా మాని చెట్ల మీద రాజుగా ఉండి ఇటు అటు ఊగడానికి నేను వస్తానా’ అని వాటితో అంది. అప్పుడు చెట్లన్నీ, ‘నువ్వు వచ్చి మమ్మల్ని ఏలు’ అని ముళ్ళపొదతో మనవి చేసినప్పుడు ముండ్ల పొద ‘మీరు నిజంగా నన్ను మీ మీద రాజుగా నియమించుకోవాలని కోరుకుంటే నా నీడలోకి రండి. లేదా అగ్ని నాలో నుంచి బయలుదేరి లెబానోను దేవదారు చెట్లను కాల్చివేస్తుంది’ అని చెట్లతో చెప్పింది.” “నా తండ్రి మీ నిమిత్తం తన ప్రాణాలకు తెగించి యుద్ధం చేసి మిద్యానీయుల చేతిలో నుంచి మిమ్మల్ని విడిపించాడు. అయితే మీరు నా తండ్రి కుటుంబం మీదికి లేచి, ఒకే బండ మీద అతనిడెబ్భై మంది కొడుకులను చంపిన, అతని దాసీ కొడుకు అబీమెలెకు మీ బంధువు కాబట్టి, షెకెమువాళ్ళ మీద అతన్ని రాజుగా నియమించారు. యెరుబ్బయలుకు, అతని ఇంటి వాళ్ళకు, మీరు ఉపకారం చెయ్యకుండా అబీమెలెకును రాజుగా నియమించుకొన్న విషయంలో మీరు యథార్ధంగా ప్రవర్తించి ఉంటే నేడు మీరు యెరుబ్బయలు పట్ల అతని యింటివాళ్ళ పట్ల సత్యంగా యథార్ధంగా ప్రవర్తించి ఉంటే, అబీమెలెకును బట్టి సంతోషించండి. అతడు మిమ్మల్ని బట్టి సంతోషిస్తాడు గాక. అలా కాకపోతే అబీమెలెకు నుంచి అగ్ని బయలుదేరి షెకెము వాళ్ళనీ బెత్ మిల్లో యింటి వాళ్ళనీ కాల్చివేయు గాక. షెకెము వాళ్ళలో నుంచి, బెత్ మిల్లో యింటినుంచి అగ్ని బయలుదేరి అబీమెలెకును కాల్చివేయు గాక” అని చెప్పాడు. అప్పుడు యోతాము తన సహోదరుడైన అబీమెలెకుకు భయపడి పారిపోయి బెయేరుకు వెళ్లి అక్కడ నివసించాడు.
చదువండి న్యాయాధి 9
వినండి న్యాయాధి 9
షేర్ చేయి
అన్ని అనువాదాలను సరిపోల్చండి: న్యాయాధి 9:1-21
వచనాలను సేవ్ చేయండి, ఆఫ్‌లైన్‌లో చదవండి, బోధన క్లిప్‌లను చూడండి ఇంకా మరెన్నో చేయండి!
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు