దేశాన్ని పాడు చెయ్యడానికి వాళ్ళు అక్కడికి వచ్చే వారు. ఇశ్రాయేలీయులు మిద్యానీయుల వల్ల ఎంతో హీనదశకు వచ్చినప్పుడు వాళ్ళు యెహోవాకు మొర్రపెట్టారు. మిద్యానీయుల వల్ల కలిగిన బాధను బట్టి ఇశ్రాయేలీయులు యెహోవాకు మొర్ర పెట్టినప్పుడు యెహోవా ఇశ్రాయేలీయుల దగ్గరికి ఒక ప్రవక్తను పంపాడు. అతడు వాళ్ళకు ఇలా ప్రకటించాడు “ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా చెబుతున్నాడు, ‘ఐగుప్తులో నుంచి మిమ్మల్ని రప్పించి, బానిసల గృహంలో నుంచి మిమ్మల్ని బయటకు తీసుకుని వచ్చాను. ఐగుప్తీయుల చేతిలో నుంచి, మిమ్మల్ని బాధపెట్టిన వారందరి చేతిలో నుంచి మిమ్మల్ని విడిపించి, మీ దగ్గర నుంచి వాళ్ళను తోలివేసి వాళ్ళ దేశాన్ని మీకు ఇచ్చాను. మీ దేవుడనైన యెహోవాను నేనే. మీరు అమోరీయుల దేశంలో నివాసం ఉంటున్నారు. వాళ్ళ దేవుళ్ళకు భయపడవద్దని మీతో చెప్పాను గానీ మీరు నా మాట వినలేదు.’” అప్పుడు యెహోవా దూత వచ్చి ఒఫ్రాలో అబీయెజ్రీయుడైన యోవాషుకు చెందిన మస్తకి చెట్టు కింద కూర్చున్నాడు. యోవాషు కొడుకు గిద్యోను మిద్యానీయుల కంటబడకుండా గానుగ చాటున గోదుమలు దుళ్లగొడుతూ ఉన్నప్పుడు, యెహోవా దూత అతనికి కనబడి “శౌర్యం గల బలశాలీ, యెహోవా నీకు తోడుగా ఉన్నాడు” అని అతనితో అన్నాడు, గిద్యోను “అయ్యా, నా ప్రభూ, యెహోవా మాకు తోడై ఉంటే ఇదంతా మాకెందుకు సంభవిస్తుంది? యెహోవా ఐగుప్తులో నుంచి మమ్మలి రప్పించాడని చెబుతూ, మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యాలన్నీ ఏమయ్యాయి? యెహోవా మమ్మల్ని విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి మమ్మల్ని అప్పగించాడు గదా” అని అతనితో చెప్పాడు. అప్పుడు యెహోవా అతనివైపు తిరిగి “బలం తెచ్చుకుని వెళ్లి మిద్యానీయుల చేతిలోనుంచి ఇశ్రాయేలీయులను కాపాడు. నిన్ను పంపినవాణ్ణి నేనే” అని చెప్పాడు. అతడు “నా ప్రభూ, దేని సాయంతో నేను ఇశ్రాయేలీయులను రక్షించగలను? నా కుటుంబం మనష్షే గోత్రంలో అందరికంటే బలహీనమైనది. మా తండ్రుల కుటుంబాల్లో నేను ఏ ప్రాముఖ్యతా లేనివాణ్ణి” అని ఆయనతో చెప్పాడు. అందుకు యెహోవా “అయితే ఏమిటి? నేను నీకు తోడుగా ఉంటాను గనక ఒకే మనిషిని చంపినట్టు మిద్యానీయులను నువ్వు చంపుతావు” అని చెప్పాడు.
చదువండి న్యాయాధి 6
వినండి న్యాయాధి 6
షేర్ చేయి
అన్ని అనువాదాలను సరిపోల్చండి: న్యాయాధి 6:6-16
వచనాలను సేవ్ చేయండి, ఆఫ్‌లైన్‌లో చదవండి, బోధన క్లిప్‌లను చూడండి ఇంకా మరెన్నో చేయండి!
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు