యాకోబు పత్రిక 2:1-10

యాకోబు పత్రిక 2:1-10 IRVTEL

నా సహోదరులారా, మహిమ స్వరూపి అయిన మన ప్రభు యేసు క్రీస్తును విశ్వసించే వారుగా పక్షపాతం లేకుండా ఉండండి. ఎవరైనా బంగారు ఉంగరాలు పెట్టుకుని, ఖరీదైన బట్టలు వేసుకున్న వాడు, మాసిన బట్టలు వేసుకొన్న పేదవాడొకడు, వీరిద్దరూ మీ సమావేశానికి వచ్చారనుకోండి. మీ దృష్టి ఖరీదైన బట్టలు వేసుకున్నవాడి మీద ఉంచి, “దయచేసి ఈ మంచి చోట కూర్చోండి,” అని చెప్పి, పేదవానితో, “నువ్వు అక్కడ నిలబడు,” లేదా, “నా కాళ్ళ దగ్గర కూర్చో,” అంటే, మీరు చెడు ఉద్దేశంతో నిర్ణయం తీసుకుని తేడా చూపుతున్నట్టే కదా? నా ప్రియ సోదరులారా, వినండి. దేవుడు ఈ లోకంలో పేదవారిని విశ్వాసంలో ధనవంతులుగాను, తనను ప్రేమించిన వారిని తాను వాగ్దానం చేసిన రాజ్యానికి వారసులుగాను ఎన్నుకోలేదా? కానీ మీరు పేదవాణ్ణి అవమానానికి గురి చేశారు. మిమ్మల్ని అణగదొక్కేదీ, చట్ట సభలకు ఈడ్చేదీ ధనవంతులు కాదా? మిమ్మల్ని పిలిచిన వాడి మంచి పేరు ఈ ధనికుల వల్లనే కదా దూషణకు గురౌతున్నది? “నిన్ను ప్రేమించుకున్నట్టే నీ పొరుగువాణ్ణి కూడా ప్రేమించు,” అని లేఖనాల్లో రాసి ఉన్న దైవ రాజాజ్ఞ పాటిస్తే, మీ ప్రవర్తన సరిగా ఉన్నట్టే. కాని మీరు కొందరి విషయంలో పక్షపాతంగా ఉంటే మీరు పాపం చేస్తున్నట్టే. మీరు ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘించినట్టు ధర్మశాస్త్రమే నిర్ధారిస్తున్నది. ఎవరైనా ధర్మశాస్త్రం అంతా పాటించి, ఏ ఒక్క ఆజ్ఞ విషయంలో అయినా తడబడితే, ఆజ్ఞలన్నిటినీ మీరిన అపరాధి అవుతాడు.