యెషయా 29:1-10

యెషయా 29:1-10 IRVTEL

అరీయేలుకు బాధ! దావీదు విడిది చేసిన అరీయేలు పట్టణానికి బాధ! సంవత్సరం వెనుకే సంవత్సరం గడవనివ్వండి. పండగలు క్రమంగా జరగనివ్వండి. కానీ నేను అరీయేలును ముట్టడిస్తాను. అప్పుడు అది దుఃఖించి విలపిస్తుంది. అందుచేత అది నిజంగా నాకు నిప్పుల కుప్పలా ఉంటుంది. నేను నీకు విరోధంగా నీ చుట్టూ శిబిరం కడతాను. నీకు ఎదురుగా కోట కడతాను. ముట్టడి వేస్తాను. నీకు విరోధంగా ముట్టడి పనులను అధికం చేస్తాను. అప్పుడు నువ్వు కిందకి దిగుతావు. నేలపై నుండి మాట్లాడటం ప్రారంభిస్తావు. నీ మాటలు నేలపై నున్న దుమ్ములోనుండి వినపడతాయి. నీ మాటలు చాలా బలహీనంగా ఉంటాయి. నిన్ను ఆక్రమించుకోడానికి గుంపులుగా వచ్చే శత్రువులు ధూళిలా ఉంటారు. క్రూరులైన శత్రు సమూహం ఎగిరిపోయే పొట్టులాగా మాయమౌతారు. ఇదంతా అకస్మాత్తుగా ఒక్క క్షణంలో జరుగుతుంది. నిన్ను సేనల ప్రభువైన యెహోవా శిక్షిస్తాడు. ఉరుములతో, భూకంపాలతో, భీకర శబ్దాలతో, సుడిగాలి తుఫానులతో, దహించే అగ్నిజ్వాలలతో ఆయన నిన్ను శిక్షిస్తాడు. ఇదంతా ఒక కలలా ఉంటుంది. రాత్రి వేళ వచ్చే స్వప్నంలా ఉంటుంది. జాతుల సమూహం అరీయేలు పైనా దాని బలమైన స్థావరం పైనా యుద్ధం చేస్తాయి. వాళ్ళు ఆమె పైనా, ఆమె రక్షణ స్థావరాల పైనా దాడి చేస్తారు. ఆకలితో ఉన్నవాడు కలలో భోజనం చేసి మేలుకున్న తర్వాత వాడు ఇంకా ఆకలితోనే ఉన్నట్టుగా, దాహంతో ఉన్నవాడు కలలో నీళ్ళు తాగి మేలుకున్న తర్వాత వాడు ఇంకా దాహంతోనే ఉన్నట్టుగా అవును, అలాగే సీయోను కొండపై జాతుల సమూహం చేసే యుద్ధం కూడా ఉంటుంది. వేచి చూడండి! ఆశ్చర్యపొండి, నివ్వెరపొండి. మిమ్మల్ని మీరు గుడ్డివాళ్ళుగా చేసుకుని గుడ్డివాళ్ళు కండి. ద్రాక్షారసం తాగకుండానే మత్తెక్కిన వాళ్ళలా ఉండండి. మద్యం తీసుకోకుండానే తూలుతూ ఉండండి. ఎందుకంటే యెహోవా మీ మీద గాఢమైన నిద్రాత్మను కుమ్మరించాడు. ఆయన మీ కళ్ళు మూసివేశాడు. అంటే మీకు ప్రవక్తలను లేకుండా చేశాడు. మీ తలలకు ముసుగు వేశాడు. మీకు నాయకులను లేకుండా చేశాడు.

యెషయా 29:1-10 కోసం వీడియో