యెహోవా యాకోబు మీద జాలిపడతాడు. ఆయన మళ్ళీ ఇశ్రాయేలును ఎంపిక చేసుకుని వారికి తమ స్వదేశంలో పూర్వ క్షేమ స్థితి కలిగిస్తాడు. పరదేశులు వాళ్ళల్లో కలిసి, యాకోబు సంతతితో జత కూడుతారు. ఇతర జాతులు వాళ్ళను తమ సొంత దేశానికి తీసుకు పోతారు. ఇశ్రాయేలు వంశస్థులు యెహోవా దేశంలో వాళ్ళను దాసదాసీలుగా ఉపయోగించుకుంటారు. తమను బందీలుగా పట్టుకున్న వాళ్ళను వాళ్ళు బందీలుగా పట్టుకుంటారు. తమను బాధించిన వాళ్ళ మీద పరిపాలన చేస్తారు. ఆ రోజున నీ బాధ నుంచి, నీ వేదన నుంచి, నువ్వు చెయ్యాల్సి వచ్చిన కష్టం నుంచి యెహోవా నీకు విశ్రాంతి ఇస్తాడు. ఆ రోజున నువ్వు బబులోను రాజు గూర్చి ఎగతాళి పాట ఎత్తి ఇలా పాడతావు. “బాధించిన వాళ్లకు అంతం ఎలా వచ్చిందో చూడు. గర్వించిన రౌద్రం ఎలా అంతమయ్యిందో చూడు! దుష్టుల దుడ్డుకర్రనూ, ఎడతెగని హత్యలతో జాతులను క్రూరంగా కొట్టిన పాలకుల రాజదండాన్ని యెహోవా విరగ్గొట్టాడు. వాళ్ళు ఆగ్రహంతో నిరంకుశ బలత్కారంతో జాతులను లోబరచుకున్నారు. భూలోకమంతా నిమ్మళించి విశ్రాంతిగా ఉంది. వాళ్ళు పాటలతో తమ సంబరాలు మొదలు పెట్టారు. నిన్ను గూర్చి తమాల వృక్షాలు, లెబానోను దేవదారు వృక్షాలు సంతోషిస్తూ ఇలా అంటాయి, ‘నువ్వు ఓడిపోయినప్పట్నుంచి చెట్లు నరికే వాడెవడూ మమ్మల్ని నరకడానికి మా మీదకు రాలేదు.’ నువ్వు ప్రవేశిస్తూ ఉండగానే నిన్ను ఎదుర్కోడానికి పాతాళం నీ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. అది నీ కోసం చనిపోయిన వాళ్ళను లేపుతోంది. భూరాజులందరినీ, జనాల రాజులందరినీ వాళ్ళ సింహాసనాల మీద నుంచి లేపుతోంది. వాళ్ళందరూ నిన్ను చూసి, నువ్వు కూడా మాలాగే బలహీనుడివయ్యావు. నువ్వూ మాలాంటి వాడివయ్యావు. నీ ఆడంబరం, నీ తీగ వాయిద్య స్వరం పాతాళానికి పడిపోయాయి. నీ కింద పురుగులు వ్యాపిస్తాయి. క్రిములు నిన్ను కప్పుతాయి. తేజోనక్షత్రమా, వేకువచుక్కా, ఆకాశం నుంచి నువ్వెలా పడిపోయావు? జాతులను కూల్చిన నువ్వు నేలమట్టం వరకూ ఎలా తెగి పడిపోయావు? నువ్వు నీ హృదయంలో, ‘నేను ఆకాశానికి ఎక్కిపోతాను, దేవుని నక్షత్రాలకన్నా ఎత్తుగా నా సింహాసనాన్ని గొప్ప చేసుకుంటాను, ఉత్తరం వైపు ఉన్న సభాపర్వతం మీద కూర్చుంటాను, మేఘమండలం మీదకు ఎక్కుతాను, మహోన్నతుడైన దేవునితో నన్ను సమానంగా చేసుకుంటాను’ అనుకున్నావు. అయితే నువ్వు ఇప్పుడు పాతాళపు లోతుల్లోకి దిగిపోయావు. నరకంలో పడి ఉన్నావు.
చదువండి యెషయా 14
వినండి యెషయా 14
షేర్ చేయి
అన్ని అనువాదాలను సరిపోల్చండి: యెషయా 14:1-15
వచనాలను సేవ్ చేయండి, ఆఫ్‌లైన్‌లో చదవండి, బోధన క్లిప్‌లను చూడండి ఇంకా మరెన్నో చేయండి!
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు