హెబ్రీ పత్రిక 7:23-28

హెబ్రీ పత్రిక 7:23-28 IRVTEL

ఈ యాజకులు కలకాలం సేవ చేయకుండా వారిని మరణం నిరోధిస్తుంది. అందుకే ఒకరి తరువాత మరొకరుగా అనేకమంది యాజకులు అయ్యారు. యేసు కలకాలం జీవిస్తాడు కనుక ఆయన యాజకత్వం కూడా మార్పులేనిదిగా ఉంటుంది. కాబట్టి ఈయన తన ద్వారా దేవుని దగ్గరికి వచ్చేవారిని సంపూర్ణంగా రక్షించడానికి సమర్ధుడుగా ఉన్నాడు. వారి తరపున విన్నపాలు చేయడానికి కలకాలం జీవిస్తూ ఉన్నాడు. ఆయన కల్మషం అంటని వాడు, నిందా రహితుడు, పవిత్రుడు, పాపులకు వేరుగా ఉన్నవాడు, ఆకాశాల కంటే ఉన్నతంగా ఉన్నాడు. ఇలాటి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. ఇతర ప్రధాన యాజకుల్లాగా ప్రతిదినం ముందుగా తన సొంత పాపాల కోసం అర్పణలు అర్పించి తరువాత ప్రజల కోసం అర్పించాల్సిన అవసరం ఈయనకు లేదు. ఈయన తనను తానే అర్పణగా ఒక్కసారే అర్పించి ముగించాడు. ధర్మశాస్త్రం బలహీనతలున్న వారిని ముఖ్య యాజకులుగా నియమిస్తుంది. కాని ధర్మశాస్త్రం తరువాత వచ్చిన ప్రమాణ వాక్కు కుమారుణ్ణి ప్రధాన యాజకుడిగా నియమించింది. ఈయన శాశ్వతకాలం నిలిచే పరిపూర్ణత పొందినవాడు.