మీరు అలసి పోకుండా, సొమ్మసిల్లి పోకుండా ఉండడానికి పాపులు తనకు వ్యతిరేకంగా పలికిన మాటలను సహించిన ఆయనను గూర్చి ఆలోచించండి. మీరు ఇంతవరకూ రక్తం కారేంతగా పాపాన్ని ఎదిరించడమూ, దానితో పోరాడటమూ చేయలేదు. కుమారులుగా మీకు ఉపదేశించే ప్రోత్సాహపు మాటలను మీరు మరచిపోయారు. “నా కుమారా, ప్రభువు క్రమశిక్షణను తేలికగా తీసుకోవద్దు. ఆయన నిన్ను సరి చేసినప్పుడు నిరుత్సాహ పడవద్దు.” ప్రభువు తాను ప్రేమించేవాణ్ణి క్రమశిక్షణలో పెడతాడు. తాను స్వీకరించే ప్రతి కుమారుణ్ణి శిక్షిస్తాడు. హింసలను క్రమశిక్షణగా భావించి సహించండి. తండ్రి క్రమశిక్షణలో పెట్టని కుమారుడు ఎవరు? దేవుడు మిమ్మల్ని కుమారులుగా భావించి మీతో వ్యవహరిస్తాడు. కుమారులు అయిన వారందరినీ దేవుడు క్రమశిక్షణలో పెడతాడు. ఒకవేళ మీకు క్రమశిక్షణ లేదంటే దాని అర్థం మీరు నిజమైన కుమారులు కాదు, అక్రమ సంతానంలాంటి వారన్న మాట. ఇంకా చెప్పాలంటే మనకు ఈ లోకంలో తండ్రులు శిక్షణ ఇచ్చేవారుగా ఉన్నారు. మనం వారిని గౌరవిస్తాం. అంతకంటే ఎక్కువగా మనం ఆత్మలకు తండ్రి అయిన వాడికి విధేయులంగా జీవించనక్కర్లేదా? మన తండ్రులు వాళ్లకి సరి అని తోచినట్టు కొన్ని సంవత్సరాలు మనకు నేర్పించారు. కాని మనం ఆయన పరిశుద్ధతను పంచుకోడానికి దేవుడు మన మంచి కోసం మనకు శిక్షణనిస్తున్నాడు. అయితే ప్రతి క్రమశిక్షణా ప్రస్తుతం మనకు బాధాకరంగానే ఉంటుంది కానీ సంతోషంగా ఏమీ ఉండదు. అయితే ఆ శిక్షణ పొందిన వారికి అది తరువాత నీతి అనే శాంతికరమైన ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి సడలి పోయిన మీ చేతులను పైకెత్తండి. బలహీనంగా మారిన మోకాళ్ళను తిరిగి బలపరచండి. మీ కుంటికాలు బెణకక బాగుపడేలా మీ మార్గాలు తిన్ననివిగా చేసుకోండి అందరితో శాంతికరమైన సంబంధాలూ, పరిశుద్ధతా కలిగి ఉండడానికి తీవ్ర ప్రయత్నం చేయండి. ఎందుకంటే పరిశుద్ధత లేకుండా ఎవడూ ప్రభువును చూడడు. దేవుని కృప నుండి మీలో ఎవరూ తప్పిపోకుండా జాగ్రత్త పడండి. అలాగే సమస్యలు కలిగించి అనేకమందిని కలుషితం చేసే చేదు అనే వేరు మీలో మొలవకుండా జాగ్రత్త పడండి. లైంగిక అవినీతిని సాగించేవారుగానీ ఒక్క పూట భోజనం కోసం తన జన్మహక్కును అమ్మి వేసుకున్న ఏశావులాంటి దైవభీతి లేని వాడు కానీ మీలో లేకుండా జాగ్రత్త పడండి. ఏశావు ఆ తరవాత ఆశీర్వాదాన్ని పొందాలనుకున్నప్పుడు అతనికి దక్కింది తిరస్కారమే. ఎందుకంటే అతడు కన్నీళ్ళతో శ్రద్ధగా వెదికినా పశ్చాత్తాపం పొందే అవకాశం అతనికి దొరకలేదని మీకు తెలుసు.
Read హెబ్రీ పత్రిక 12
వినండి హెబ్రీ పత్రిక 12
షేర్ చేయి
అన్ని అనువాదాలను సరిపోల్చండి: హెబ్రీ పత్రిక 12:3-17
వచనాలను సేవ్ చేయండి, ఆఫ్‌లైన్‌లో చదవండి, బోధన క్లిప్‌లను చూడండి ఇంకా మరెన్నో చేయండి!
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు