హెబ్రీ పత్రిక 10:1-22

హెబ్రీ పత్రిక 10:1-22 IRVTEL

ఎందుకంటే ధర్మశాస్త్రం అనేది భవిష్యత్తులో కలిగే శ్రేష్ఠమైన విషయాలకు ప్రతిబింబంలా ఉంది కానీ అది వాటి నిజ స్వరూపం కాదు. యాజకులు ప్రతి సంవత్సరం అర్పించే ఒకే రకం బలుల ద్వారా ధర్మశాస్త్రం దేవుని దగ్గరికి వచ్చే వారిని పరిపూర్ణులను చేయలేదు. ఒకవేళ అలా చేయగలిగితే ఇక ఆ బలులు అర్పించడం మానేస్తారు కదా! ఆరాధించేవారు ఒక సారంటూ శుద్ధులైతే పాపానికి గూర్చిన స్పృహ వారికిక ఉండదు కదా! అయితే ఆ బలులు అర్పించడం వల్ల ప్రతి సంవత్సరం పాపాలు గుర్తుకు వస్తూనే ఉంటాయి. ఎందుకంటే ఎద్దుల, మేకల రక్తం పాపాన్ని తీసివేయడం అసాధ్యం. క్రీస్తు ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఇలా అన్నాడు, “నువ్వు బలులను గానీ కానుకలను గానీ కోరుకోలేదు. కానీ నాకొక దేహాన్ని నువ్వు సిద్ధం చేసావు. దహన బలులన్నా పాప పరిహారం కోసం చేసే బలులన్నా నీకు సంతోషం ఉండదు. అప్పుడు నేను నీతో ఇలా అన్నాను, ‘చూడు, నా గురించి గ్రంథంలో రాసిన ప్రకారం నీ ఇష్టాన్ని జరిగించడానికి నేనున్నాను.’” పైన చెప్పినట్టుగా ఆయన, “నువ్వు బలులను గానీ, కానుకలను గానీ దహన బలులను గానీ పాప పరిహారం కోసం చేసే బలులను గానీ కోరుకోవు, వీటిలో నీకు సంతోషం ఉండదు. ఇవి ధర్మశాస్త్రం ప్రకారం అర్పించబడేవి” అన్నాడు. ఆ తరువాత ఆయన, “చూడు, నీ ఇష్ట ప్రకారం చేయడానికి నేనున్నాను” అని చెప్పాడు. రెండవ ప్రక్రియను నెలకొల్పడానికి ఆయన మొదటి ప్రక్రియను పక్కన పెట్టేశాడు. ఈ రెండవ ప్రక్రియలో యేసు క్రీస్తు దేహం ఒక్కసారే బలి కావడం చేత దేవుని ఇష్ట ప్రకారం మనకు శుద్ధి జరిగింది. నిజంగా ప్రతి యాజకుడూ ప్రతి రోజూ నిలబడి ఒకే విధమైన బలులు అదేపనిగా అర్పిస్తూ సేవ చేస్తూ ఉంటాడు. అవి ఎప్పటికీ పాపాలను తీసివేయలేవు. కానీ క్రీస్తు పాపాల కోసం శాశ్వతంగా నిలిచి ఉండే ఒకే బలి అర్పించి దేవుని కుడి పక్కన కూర్చుని ఉన్నాడు. తన శత్రువులు అవమానం పొంది తన కాళ్ళ కింద పీటగా మారే సమయం కోసం వేచి చూస్తూ ఉన్నాడు. శుద్ధి పొందిన వారిని ఆయన ఒక్క బలి ద్వారా శాశ్వతంగా పరిపూర్ణులుగా చేశాడు. దీన్ని గురించి పరిశుద్ధాత్మ కూడా మనకు సాక్షమిస్తున్నాడు. మొదట ఆయన ఇలా అన్నాడు, “‘ఆ రోజులు గడిచిన తరువాత నేను వారితో చేసే ఒప్పందం ఇదే’ అని ప్రభువు అంటున్నాడు. ‘నా శాసనాలను వారి హృదయాల్లో ఉంచుతాను. వారి మనసులపై వాటిని రాస్తాను.’” తరువాత ఆయన, “వాళ్ళ పాపాలనూ అక్రమాలనూ ఇక మీదట ఎప్పటికీ జ్ఞాపకం చేసుకోను” అన్నాడు. ఈ విషయాలకు ఎప్పుడు క్షమాపణ కలుగుతుందో ఇక అప్పటి నుండి పాప పరిహారం కోసం చేసే బలులు ఉండవు. కాబట్టి సోదరులారా, యేసు రక్తం ద్వారా అతి పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించడానికి మనకు ధైర్యం ఉంది. తెర గుండా అంటే తన దేహం ద్వారా ప్రవేశించే కొత్తదీ, సజీవమూ అయిన మార్గాన్ని ఆయన మనకోసం తెరిచాడు. దేవుని ఇంటి పైన మనకు గొప్ప యాజకుడున్నాడు గనుక, విశ్వాసం విషయంలో సంపూర్ణ నిశ్చయత ఉన్న యథార్ధ హృదయంతో, కల్మషమైన మనస్సాక్షి నుండి శుద్ధి అయిన హృదయంతో, స్వచ్ఛమైన నీటితో కడిగిన శరీరంతో దేవుణ్ణి సమీపిద్దాం.