ఆది 45:16-28

ఆది 45:16-28 IRVTEL

“యోసేపు సోదరులు వచ్చారు” అనే సంగతి ఫరో ఇంట్లో వినబడింది. అది ఫరోకు, అతని సేవకులకు చాలా ఇష్టమయింది. అప్పుడు ఫరో యోసేపుతో ఇలా అన్నాడు “నీ సోదరులతో ఇలా చెప్పు, ‘మీరిలా చేయండి. మీ పశువుల మీద బరువులు కట్టి కనాను దేశానికి వెళ్ళి మీ తండ్రినీ మీ ఇంటివారిని వెంట బెట్టుకుని నా దగ్గరికి రండి, ఐగుప్తు దేశంలోని మంచి వస్తువులను మీకిస్తాను. ఈ దేశపు సారాన్ని మీరు అనుభవిస్తారు. మీకు ఆజ్ఞ ఇస్తున్నాను, ఇలా చేయండి. మీ పిల్లల కోసం, మీ భార్యల కోసం ఐగుప్తులో నుండి బండ్లను తీసుకుపోయి మీ తండ్రిని వెంటబెట్టుకుని రండి. ఐగుప్తు దేశమంతటిలో ఉన్న మంచి వస్తువులు మీవే అవుతాయి కాబట్టి మీ సామగ్రిని లక్ష్యపెట్టవద్దు’” అన్నాడు. ఇశ్రాయేలు కుమారులు అలాగే చేశారు. యోసేపు ఫరో మాట ప్రకారం వారికి బండ్లు ఇప్పించాడు. ప్రయాణానికి భోజన పదార్ధాలు ఇప్పించాడు. అతడు వారికి రెండేసి జతల బట్టలు ఇచ్చాడు, బెన్యామీనుకు 300 షెకెల్ ల వెండి, ఐదు జతల బట్టలు ఇచ్చాడు. అతడు తన తండ్రి కోసం వీటిని పంపించాడు, ఐగుప్తులోని శ్రేష్ఠమైన వాటిని మోస్తున్న పది గాడిదలనూ ప్రయాణానికి తన తండ్రి కోసం ఆహారం, ఇతర ధాన్యం, వేర్వేరు తినే సరుకులు మోస్తున్న పది ఆడ గాడిదలనూ పంపించాడు. అప్పుడతడు తన సోదరులను సాగనంపి వారు బయలుదేరుతుంటే “దారిలో పోట్లాడుకోవద్దు” అని వారితో చెప్పాడు. వారు ఐగుప్తునుండి బయలు దేరి కనాను దేశానికి తమ తండ్రి అయిన యాకోబు దగ్గరికి వచ్చి “యోసేపు ఇంకా బతికే ఉన్నాడు. ఐగుప్తు దేశమంతటి మీదా అధిపతిగా ఉన్నాడు” అని అతనికి తెలియచేశారు. అయితే అతడు వారి మాట నమ్మలేక పోయాడు. అతని హృదయం విస్మయం చెందింది. అప్పుడు వారు యోసేపు తమతో చెప్పిన మాటలన్నీ అతనితో చెప్పారు. తనను తీసుకు వెళ్ళడానికి యోసేపు పంపిన బండ్లు చూసి, వారి తండ్రి యాకోబు ప్రాణం తెప్పరిల్లింది. అప్పుడు ఇశ్రాయేలు “ఇంతే చాలు. నా కొడుకు యోసేపు బతికే ఉన్నాడు, నేను చావక ముందు వెళ్ళి అతన్ని చూస్తాను” అన్నాడు.

ఆది 45:16-28 కోసం వీడియో