యాకోబు పారిపోయాడని మూడో రోజుకి లాబానుకు తెలిసింది. అతడు తన బంధువులను వెంటబెట్టుకుని, ఏడు రోజుల ప్రయాణమంత దూరం యాకోబును తరుముకుని వెళ్లి, గిలాదు కొండ మీద అతణ్ణి కలుసుకున్నాడు. ఆ రాత్రి కలలో దేవుడు లాబాను దగ్గరికి వచ్చి “నువ్వు యాకోబుతో మంచి గానీ చెడు గానీ పలకవద్దు. జాగ్రత్త సుమా” అని అతనితో చెప్పాడు. చివరికి లాబాను యాకోబును కలుసుకున్నాడు. యాకోబు తన గుడారాన్ని ఆ కొండ మీద వేసుకుని ఉన్నాడు. లాబాను కూడా తన బంధువులతో గిలాదు కొండమీద గుడారం వేసుకున్నాడు. అప్పుడు లాబాను యాకోబుతో “ఏంటి, ఇలా చేశావు? నన్ను మోసపుచ్చి, కత్తితో చెరపట్టిన వారిలాగా నా కూతుళ్ళను తీసుకుపోవడం ఎందుకు? నాకు చెప్పకుండా రహస్యంగా పారిపోయి నన్ను మోసపుచ్చావేంటి? సంబరంగా, పాటలతో, కంజరిలతో, సితారాలతో నిన్ను సాగనంపి ఉండేవాడినే. నేను నా మనవళ్ళనూ, కూతుళ్ళనూ ముద్దు పెట్టుకోనియ్యకుండా బుద్ధిహీనంగా ఇలా చేశావు. నేను మీకు హాని చేయగలను. అయితే రాత్రి మీ తండ్రి దేవుడు, ‘జాగ్రత్త సుమా! నువ్వు యాకోబుతో మంచి గానీ చెడు గానీ పలకవద్దు’ అని నాతో చెప్పాడు. నీ తండ్రి ఇంటి మీద బెంగ కలిగి వెళ్ళిపోవాలనిపిస్తే వెళ్ళు, నా దేవుళ్ళను దొంగిలించావేంటి?” అన్నాడు. అందుకు యాకోబు “నువ్వు బలవంతంగా నా నుండి నీ కుమార్తెలను తీసుకుంటావేమో అని భయపడ్డాను. ఎవరి దగ్గర నీ దేవుళ్ళు కనబడతాయో వారు బతకకూడదు. నువ్వు మన బంధువుల ముందు వెదికి చూసి నీది నా దగ్గర ఏదైనా ఉంటే దాన్ని తీసుకో” అని లాబానుతో చెప్పాడు. రాహేలు వాటిని దొంగిలించిందని యాకోబుకు తెలియలేదు. లాబాను యాకోబు గుడారంలోకీ లేయా గుడారంలోకీ ఇద్దరు దాసీల గుడారాల్లోకీ వెళ్ళాడు గాని అతనికేమీ దొరకలేదు. తరువాత అతడు లేయా గుడారంలో నుండి రాహేలు గుడారంలోకి వెళ్ళాడు. రాహేలు ఆ విగ్రహాలను తీసి ఒంటె సామగ్రిలో పెట్టి వాటి మీద కూర్చుంది. లాబాను ఆ గుడారమంతా వెదికి చూసినా అవి దొరకలేదు. ఆమె తన తండ్రితో “తమ ఎదుట నేను లేఛి నిలబడనందుకు తమరు కోపపడవద్దు. నేను నా నెలసరి కాలంలో ఉన్నాను” అని చెప్పింది. అతడెంత వెతికినా ఆ విగ్రహాలు దొరకలేదు. యాకోబు కోపంగా లాబానుతో వాదిస్తూ “నేనేం ద్రోహం చేశాను? నీవిలా మండిపడి నన్ను తరమడానికి నేను చేసిన పాపమేంటి? నువ్వు నా సామానంతా తడివి చూశాక నీ ఇంటి వస్తువుల్లో ఏమైనా దొరికిందా? నావారి ముందూ, నీవారి ముందూ దాన్ని తెచ్చి పెట్టు. వారు మన ఇద్దరి మధ్య తీర్పు తీరుస్తారు. ఈ ఇరవై సంవత్సరాలూ నేను నీ దగ్గర ఉన్నాను. నీ గొర్రెలైనా మేకలైనా ఏవీ పిల్లలు కనకుండా పోలేదు, నీ మంద పొట్టేళ్ళను దేనినీ నేను తినలేదు. క్రూర జంతువులు చంపివేసిన దాన్ని నీ దగ్గరికి తీసుకురాకుండా ఆ నష్టం నేనే పెట్టుకున్నాను. పగలైనా, రాత్రైనా, ఇతరులు దొంగిలించిన వాటి విలువను నా దగ్గరే వసూలు చేశావు. నేనెలా ఉన్నానో చూడు, పగలు ఎండకీ రాత్రి మంచుకూ క్షీణించిపోయాను. నా కళ్ళకి నిద్ర అనేదే లేకుండా పోయింది. నీ ఇద్దరు కూతుళ్ళకోసం పద్నాలుగు సంవత్సరాలూ నీ మంద కోసం ఆరు సంవత్సరాలూ మొత్తం ఇరవై సంవత్సరాలు నీకు సేవ చేస్తూ నీ ఇంట్లో ఉన్నాను. అయినా నువ్వు నా జీతం పదిసార్లు మార్చావు. నా తండ్రి దేవుడు, అబ్రాహాము దేవుడు, ఇస్సాకు భయపడిన దేవుడు నాకు తోడై ఉండకపోతే నువ్వు నన్ను తప్పకుండా ఖాళీ చేతులతోనే వెళ్ళగొట్టి ఉండేవాడివి. దేవుడు నా ప్రయాసనీ నా చేతుల కష్టాన్నీ చూశాడు. అందుకే గత రాత్రి నిన్ను గద్దించాడు” అని అన్నాడు.
Read ఆది 31
వినండి ఆది 31
షేర్ చేయి
అన్ని అనువాదాలను సరిపోల్చండి: ఆది 31:22-42
వచనాలను సేవ్ చేయండి, ఆఫ్‌లైన్‌లో చదవండి, బోధన క్లిప్‌లను చూడండి ఇంకా మరెన్నో చేయండి!
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు