వీళ్ళందరూ కెతురా సంతానం. అబ్రాహాము తన సంపదనంతా ఇస్సాకుకు ఇచ్చేశాడు. అబ్రాహాము తాను బ్రతికి ఉండగానే తన ఉంపుడుగత్తెల కొడుకులకు కానుకలిచ్చి తన కొడుకు ఇస్సాకు దగ్గర నుండి వారిని తూర్పు ప్రాంతాలకు పంపి వేశాడు. అబ్రాహాము మొత్తం నూట డెబ్భై ఐదు సంవత్సరాలు జీవించాడు. అబ్రాహాము సుదీర్ఘకాలం జీవించి నిండు వృద్ధాప్యంలో సంపూర్ణ జీవితం గడిపి చనిపోయి తన పితరులను చేరుకున్నాడు. అతని కొడుకులు ఇస్సాకూ, ఇష్మాయేలూ కలసి మమ్రే ఎదురుగా ఉన్న మక్పేలా గుహలో అతణ్ణి పాతి పెట్టారు. అది హిత్తీయుడైన సోహరు కుమారుడు ఎఫ్రోనుకు చెందిన పొలంలో ఉంది. అబ్రాహాము హేతు వారసుల దగ్గర కొన్న ఈ పొలంలోనే అబ్రాహామునూ అతని భార్య శారానూ పాతిపెట్టారు. అబ్రాహాము చనిపోయిన తరువాత దేవుడు అతని కొడుకు ఇస్సాకును ఆశీర్వదించాడు. ఆ సమయంలో ఇస్సాకు బెయేర్ లహాయి రోయి దగ్గర నివాసమున్నాడు. ఐగుప్తీయురాలూ శారా దాసీ అయిన హాగరు ద్వారా అబ్రాహాముకు పుట్టిన ఇష్మాయేలు వంశావళి ఇది. ఇష్మాయేలు పెద్ద కొడుకు అయిన నేబాయోతూ, కేదారు, అద్బయేలూ, మిబ్శామూ, మిష్మా, దూమానమశ్శా, హదరూ, తేమా, యెతూరూ, నాపీషూ, కెదెమా. ఇష్మాయేలు కొడుకులు వీరే. వారి వారి గ్రామాల ప్రకారమూ, కోటల ప్రకారమూ వంశావళుల ప్రకారమూ వాళ్ళ పేర్లు ఇవి. వీళ్ళు తమ తమ వంశాల ప్రకారం పన్నెండు మంది రాజులు. ఇష్మాయేలు నూట ముప్ఫై ఏడు సంవత్సరాలు జీవించాడు. ఆ తరువాత అతడు ప్రాణం విడిచాడు. తన పితరులను చేరుకున్నాడు. వీళ్ళు అష్షూరుకు వెళ్ళే దారిలో హవీలా నుండి ఐగుప్తుకు సమీపంగా ఉన్న షూరు వరకూ నివసిస్తుండే వాళ్ళు. వీళ్ళు ఒకరి పట్ల మరొకరు విరోధంగా జీవించేవారు. అబ్రాహాము కొడుకు ఇస్సాకును గూర్చిన సంగతులు ఇవి. అబ్రాహాము ఇస్సాకుకు తండ్రి. ఇస్సాకు పద్దనరాములో నివసించే సిరియా వాడైన బెతూయేలు కూతురూ సిరియావాడైన లాబాను సోదరీ అయిన రిబ్కాను పెళ్ళి చేసుకున్నాడు. అప్పటికి అతని వయస్సు నలభై సంవత్సరాలు. ఇస్సాకు భార్యకి పిల్లలు కలుగలేదు. అందుకని ఇస్సాకు ఆమె విషయం యెహోవాను వేడుకున్నాడు. యెహోవా అతని ప్రార్థన విన్నాడు. ఆ ప్రార్థనకు జవాబిచ్చాడు. ఫలితంగా అతని భార్య రిబ్కా గర్భవతి అయింది. ఆమె గర్భంలో ఇద్దరు పసికందులు ఉన్నారు. వాళ్ళిద్దరూ గర్భంలోనే పోరాడుకుంటున్నారు. కాబట్టి ఆమె “నాకెందుకిలా జరుగుతోంది. ఇలా అయితే నేను బతకడం ఎందుకు?” అనుకుని ఈ విషయమై యెహోవాను ప్రశ్నించింది. అప్పుడు యెహోవా ఆమెతో ఇలా చెప్పాడు. “రెండు జాతులు నీ గర్భంలో ఉన్నాయి. రెండు గోత్రాలు నీ గర్భంలో నుండే వేరుగా వస్తాయి. ఒక జాతి కంటే ఒక జాతి బలంగా ఉంటుంది. పెద్దవాడు చిన్నవాడికి దాసుడవుతాడు.” ఆమెకు నెలలు నిండి ప్రసవించే సమయం వచ్చినప్పుడు ఆమె గర్భంలో కవలలు ఉన్నారు. మొదటివాడు ఎర్రగా పుట్టాడు. ఎర్రటి వస్త్రంలా ఒళ్ళంతా జుట్టు ఉంది. కాబట్టి అతనికి ఏశావు అనే పేరు పెట్టారు. తరువాత అతని తమ్ముడు బయటకు వచ్చాడు. ఇతడు ఏశావు మడిమను చేత్తో పట్టుకుని వచ్చాడు. అతనికి యాకోబు అనే పేరు పెట్టారు. వాళ్ళిద్దరూ పుట్టినప్పుడు ఇస్సాకుకు అరవై ఏళ్ళు.
చదువండి ఆది 25
వినండి ఆది 25
షేర్ చేయి
అన్ని అనువాదాలను సరిపోల్చండి: ఆది 25:5-26
వచనాలను సేవ్ చేయండి, ఆఫ్‌లైన్‌లో చదవండి, బోధన క్లిప్‌లను చూడండి ఇంకా మరెన్నో చేయండి!
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు