ఆది 25:19-34

ఆది 25:19-34 IRVTEL

అబ్రాహాము కొడుకు ఇస్సాకును గూర్చిన సంగతులు ఇవి. అబ్రాహాము ఇస్సాకుకు తండ్రి. ఇస్సాకు పద్దనరాములో నివసించే సిరియా వాడైన బెతూయేలు కూతురూ సిరియావాడైన లాబాను సోదరీ అయిన రిబ్కాను పెళ్ళి చేసుకున్నాడు. అప్పటికి అతని వయస్సు నలభై సంవత్సరాలు. ఇస్సాకు భార్యకి పిల్లలు కలుగలేదు. అందుకని ఇస్సాకు ఆమె విషయం యెహోవాను వేడుకున్నాడు. యెహోవా అతని ప్రార్థన విన్నాడు. ఆ ప్రార్థనకు జవాబిచ్చాడు. ఫలితంగా అతని భార్య రిబ్కా గర్భవతి అయింది. ఆమె గర్భంలో ఇద్దరు పసికందులు ఉన్నారు. వాళ్ళిద్దరూ గర్భంలోనే పోరాడుకుంటున్నారు. కాబట్టి ఆమె “నాకెందుకిలా జరుగుతోంది. ఇలా అయితే నేను బతకడం ఎందుకు?” అనుకుని ఈ విషయమై యెహోవాను ప్రశ్నించింది. అప్పుడు యెహోవా ఆమెతో ఇలా చెప్పాడు. “రెండు జాతులు నీ గర్భంలో ఉన్నాయి. రెండు గోత్రాలు నీ గర్భంలో నుండే వేరుగా వస్తాయి. ఒక జాతి కంటే ఒక జాతి బలంగా ఉంటుంది. పెద్దవాడు చిన్నవాడికి దాసుడవుతాడు.” ఆమెకు నెలలు నిండి ప్రసవించే సమయం వచ్చినప్పుడు ఆమె గర్భంలో కవలలు ఉన్నారు. మొదటివాడు ఎర్రగా పుట్టాడు. ఎర్రటి వస్త్రంలా ఒళ్ళంతా జుట్టు ఉంది. కాబట్టి అతనికి ఏశావు అనే పేరు పెట్టారు. తరువాత అతని తమ్ముడు బయటకు వచ్చాడు. ఇతడు ఏశావు మడిమను చేత్తో పట్టుకుని వచ్చాడు. అతనికి యాకోబు అనే పేరు పెట్టారు. వాళ్ళిద్దరూ పుట్టినప్పుడు ఇస్సాకుకు అరవై ఏళ్ళు. ఆ పిల్లలిద్దరూ పెద్దవాళ్ళయ్యారు. వారిలో ఏశావు జంతువులను వేటాడడంలో నైపుణ్యం సాధించాడు. అరణ్యవాసిగా తిరిగేవాడు. కానీ యాకోబు నెమ్మదస్తుడు. గుడారంలోనే ఉండేవాడు. ఇస్సాకు ఏశావును ప్రేమించాడు. ఎందుకంటే ఏశావు వేటాడి తెచ్చిన జంతు మాంసాన్ని అతడు ఇష్టపడి తింటూ ఉండేవాడు. రిబ్కాకు అయితే యాకోబు అంటే ఇష్టం. యాకోబు కూరలతో వంట చేస్తూ ఉన్న సమయంలో ఏశావు చాలా అలసిపోయి పొలం నుండి ఇంటికి వచ్చాడు. ఏశావు యాకోబును “దయచేసి ఎర్రగా ఉన్న ఆ వంటకాన్ని నాకు తినడానికివ్వు. నేను చాలా అలసి పోయాను” అని అడిగాడు. అందుకే అతనికి ఏదోము అనే పేరు వచ్చింది. అందుకు యాకోబు “ముందు పెద్దవాడుగా నీ జన్మ హక్కుని నాకు ఇచ్చెయ్యి” అన్నాడు. అప్పుడు ఏశావు “చూడు, నేను ఆకలితో చావబోతున్నాను. ఈ జన్మహక్కు నాకెందుకు?” అన్నాడు. యాకోబు “ముందు ప్రమాణం చెయ్యి” అన్నాడు. ఏశావు యాకోబుతో ప్రమాణం చేసి తన జన్మ హక్కుని అతనికి ఆ విధంగా అమ్మి వేశాడు. యాకోబు తన దగ్గర ఉన్న రొట్టె, చిక్కుడు కాయల కూర ఏశావుకు ఇచ్చాడు. ఏశావు రొట్టే, కూరా తిని, తాగి అక్కడ నుండి తన దారిన వెళ్లి పోయాడు. ఆ విధంగా ఏశావు తన జ్యేష్ఠత్వపు జన్మ హక్కుని తిరస్కారంగా ఎంచాడు.

ఆది 25:19-34 కోసం వీడియో