అబ్రాహాము సేవకుడు వారి మాటలు విని యెహోవాకు సాష్టాంగ నమస్కారం చేశాడు. తరువాత ఆ సేవకుడు వెండీ బంగారు నగలనూ, వస్త్రాలనూ బయటికి తీసి రిబ్కాకు ఇచ్చాడు. అలాగే అతడు ఆమె తల్లికీ, సోదరుడికీ విలువైన కానుకలిచ్చాడు. అప్పుడు అతడూ అతనితో వచ్చిన వాళ్ళూ భోజన పానాదులు చేశారు. ఆ రాత్రి అక్కడే గడిపారు. ఉదయాన్నే లేచి అతడు “నా యజమాని దగ్గరికి నన్ను పంపించండి” అని అడిగాడు. ఆమె సోదరుడూ, ఆమె తల్లీ “మా అమ్మాయిని కనీసం పది రోజులన్నా మా దగ్గర ఉండనీయి. తరువాత ఆమెను తీసుకు వెళ్ళవచ్చు” అన్నారు. కానీ అతడు “యెహోవా నా ప్రయాణాన్ని సఫలం చేసాడు. కాబట్టి దయచేసి నన్ను ఆపవద్దు. నా యజమాని దగ్గరికి నన్ను పంపించండి” అన్నాడు. అప్పుడు వాళ్ళు అమ్మాయిని పిలిచి తను ఏమంటుందో తెలుసుకుందాం అని రిబ్కాను పిలిచారు. “ఈ వ్యక్తి తో నువ్వు వెళ్తావా?” అని అడిగారు. దానికామె “వెళ్తాను” అంది. కాబట్టి వాళ్ళు తమ సోదరి అయిన రిబ్కాను మరో దాసీని తోడుగా ఇచ్చి అబ్రాహాము సేవకుడూ, అతనితో వచ్చిన మనుషులతో పంపించారు. అప్పుడు వాళ్ళు రిబ్కాతో “మా సోదరీ, నువ్వు లక్షలాది మందికి తల్లివి కావాలి. నీ సంతానం తమను ద్వేషించే వారి గుమ్మాలను ఆక్రమించుకుంటారు గాక!” అంటూ ఆమెను దీవించారు. రిబ్కా, ఆమె సేవకురాళ్ళూ ఒంటెలెక్కి ఆ వ్యక్తి వెంట వెళ్లారు. ఆ విధంగా అబ్రాహాము సేవకుడు రిబ్కాను తీసుకుని తన దారిన వెళ్ళాడు. ఇస్సాకు కనాను దక్షిణ దేశంలో నివాసమున్నాడు. ఆ సమయంలో అతడు బెయేర్ లహాయి రోయి నుండి వస్తూ ఉన్నాడు. ఆ సాయంత్రం ఇస్సాకు ధ్యానం చేయడానికి మైదానంలోకి వెళ్ళాడు. అక్కడ అతడు తలెత్తి చూసినప్పుడు ఒంటెలు వస్తూ ఉన్నాయి. రిబ్కా కూడా ఇస్సాకును చూసింది. వెంటనే ఒంటె పైనుండి దిగింది. “మనలను కలుసుకోడానికి మైదానం నుండి వస్తున్నఆ వ్యక్తి ఎవరు?” అని అబ్రాహాము సేవకుణ్ణి అడిగింది. దానికతడు “ఆయన నా యజమాని” అన్నాడు. వెంటనే ఆమె ముసుగు వేసుకుంది. అప్పుడు ఆ దాసుడు జరిగినదంతా ఇస్సాకుకు వివరించి చెప్పాడు. అప్పుడు ఇస్సాకు తన తల్లి అయిన శారా గుడారం లోకి ఆమెను తీసుకు వెళ్ళాడు. అలా అతడు రిబ్కాను తన భార్యగా స్వీకరించాడు. అతడు ఆమెను ప్రేమించాడు. అప్పుడు ఇస్సాకు తన తల్లి మరణం విషయమై ఆదరణ పొందాడు.
చదువండి ఆది 24
వినండి ఆది 24
షేర్ చేయి
అన్ని అనువాదాలను సరిపోల్చండి: ఆది 24:52-67
వచనాలను సేవ్ చేయండి, ఆఫ్‌లైన్‌లో చదవండి, బోధన క్లిప్‌లను చూడండి ఇంకా మరెన్నో చేయండి!
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు