గలతీ పత్రిక 2:14-21

గలతీ పత్రిక 2:14-21 IRVTEL

వారు సువార్త సత్యాన్ని అనుసరించడం లేదని నేను చూసి అందరి ముందు కేఫాతో, “నీవు యూదుడవై ఉండి కూడా యూదుల్లాగా కాక యూదేతరుడిలా ప్రవర్తిస్తుంటే, యూదేతరులు యూదుల్లాగా ప్రవర్తించాలని ఎందుకు బలవంతం చేస్తున్నావు?” అన్నాను. మనం పుట్టుకతో యూదులం గానీ, “యూదేతర పాపులం” కాదు. మనిషి యేసు క్రీస్తులో విశ్వాసం ఉంచడం ద్వారానే దేవుడు నీతిమంతుడుగా తీరుస్తాడు గాని, ధర్మశాస్త్ర క్రియల వలన కాదు. ఆ సంగతి ఎరిగిన మనం కూడా ధర్మశాస్త్ర క్రియల వలన గాక క్రీస్తు పట్ల విశ్వాసం ద్వారానే దేవుని చేత నీతిమంతులుగా తీర్పు పొందడానికి యేసు క్రీస్తులో విశ్వాసముంచాము. ధర్మశాస్త్ర క్రియల వలన ఎవరూ నీతిమంతుడని తీర్పు పొందడు గదా. అయితే, దేవుడు మనలను క్రీస్తులో నీతిమంతులుగా తీర్చాలని కోరుకొంటూ, మనకు మనం పాపులుగా కనబడితే, క్రీస్తు పాపానికి సేవకుడయ్యాడా? కచ్చితంగా కాదు. నేను పడగొట్టిన వాటిని మళ్ళీ కడితే నన్ను నేనే అపరాధిగా చేసుకుంటాను గదా. నేనైతే దేవుని కోసం బతకడానికి ధర్మశాస్త్రం ద్వారా ధర్మశాస్త్రానికి చనిపోయాను. నేను క్రీస్తుతోబాటు సిలువ మరణం పొందాను. ఇక మీదట జీవించేది నేను కాదు. క్రీస్తే నాలో జీవిస్తున్నాడు. నేనిప్పుడు శరీరంలో జీవిస్తున్న జీవితం నన్ను ప్రేమించి, నా కోసం తనను తాను సమర్పించుకున్న దేవుని కుమారుడి మీద విశ్వాసం వల్లనే. నేను దేవుని కృపను నిరర్థకం చేయను. నీతి ధర్మశాస్త్రం ద్వారా సాధ్యం అయితే క్రీస్తు అనవసరంగా చనిపోయినట్టే గదా.