నిర్గమ 3:1-17

నిర్గమ 3:1-17 IRVTEL

మోషే మిద్యానులో యాజకుడైన తన మామ యిత్రో మందను మేపుతున్నాడు. ఆ మందను అరణ్యం అవతలి వైపుకు తోలుకుంటూ దేవుని పర్వతం హోరేబుకు వచ్చాడు. అక్కడ ఒక పొద మధ్య నుండి అగ్నిజ్వాలల్లో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమయ్యాడు. మోషే చూస్తూ ఉండగా అగ్నిలో ఆ పొద మండుతూ ఉంది గానీ పొద కాలిపోవడం లేదు. అప్పుడు మోషే ఆ పొద ఎందుకు కాలిపోవడం లేదో, ఆ వింత ఏమిటో ఆ వైపుకు వెళ్లి చూద్దాం అనుకున్నాడు. దాన్ని చూద్దామని అతడు ఆ వైపుకు రావడం యెహోవా చూశాడు. ఆ పొద మధ్య నుండి దేవుడు “మోషే, మోషే” అని అతణ్ణి పిలిచాడు. అప్పుడు అతడు “చిత్తం ప్రభూ” అన్నాడు. అందుకు ఆయన “దగ్గరికి రావద్దు. నీ కాళ్ళకున్న చెప్పులు తీసెయ్యి. నువ్వు నిలబడి ఉన్న ప్రదేశం పవిత్రమైనది” అన్నాడు. ఆయన ఇంకా “నేను నీ పూర్వికులు అబ్రాహాము ఇస్సాకు యాకోబుల దేవుణ్ణి” అని చెప్పగా మోషే తన ముఖం కప్పుకుని దేవుని వైపు చూసేందుకు భయపడ్డాడు. యెహోవా ఇలా చెప్పాడు. “ఐగుప్తులో ఉంటున్న నా ప్రజలు పడుతున్న బాధలు నాకు తెలుసు. కఠినమైన పనులు చేయిస్తూ వారిని బాధపెడుతున్న వారిని బట్టి వారు పెడుతున్న మొర నేను విన్నాను. వారి దుఃఖం నాకు తెలుసు. కనుక ఐగుప్తీయుల చేతిలో నుండి నా ప్రజలను విడిపించి, ఆ దేశం నుండి కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు యెబూసీయులు నివసిస్తున్న చాలా సారవంతమైన, విశాలమైన మంచి దేశానికి వారిని నడిపించడానికి నేను దిగి వచ్చాను. నిజంగా ఇశ్రాయేలు ప్రజల మొర నేను విన్నాను. ఐగుప్తీయులు వారి పట్ల జరిగిస్తున్న హింసాకాండను చూశాను. నువ్వు సిద్ధపడు. నిన్ను ఫరో దగ్గరికి పంపిస్తాను. నువ్వు నా ప్రజలైన ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుండి బయటకు నడిపించాలి.” అప్పుడు మోషే దేవునితో “ఫరో దగ్గరికి వెళ్ళి, ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుండి బయటకు నడిపించడానికి నేను ఏపాటి వాణ్ణి?” అని అన్నాడు. దేవుడు “నువ్వు ఆ ప్రజలను ఐగుప్తు నుండి తీసుకు వచ్చిన తరువాత మీరు ఈ కొండపై దేవుణ్ణి ఆరాధిస్తారు. కచ్చితంగా నేను నీకు తోడుగా ఉంటాను. నేను నిన్ను పంపించాను అని చెప్పడానికి ఇదే సూచన” అన్నాడు. మోషే “నేను ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి వెళ్లి వారితో మీ పూర్వీకుల దేవుడు మీ దగ్గరికి నన్ను పంపించాడని చెప్పినప్పుడు వారు ‘ఆయన పేరేమిటి?’ అని అడిగితే వారితో నేనేం చెప్పాలి?” అని దేవుణ్ణి అడిగాడు. అందుకు దేవుడు “ నేను శాశ్వతంగా ఉన్నవాణ్ణి , అనే పేరు గల వాణ్ణి. ఉన్నవాడు అనే ఆయన నన్ను మీ దగ్గరికి పంపించాడు, అని ఇశ్రాయేలు ప్రజలతో చెప్పు” అని మోషేతో చెప్పాడు. దేవుడు మోషేతో ఇంకా “మీ పూర్వీకుల దేవుడు యెహోవా, అంటే అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు యెహోవా మీ దగ్గరికి నన్ను పంపించాడు అని నువ్వు ఇశ్రాయేలు ప్రజలతో చెప్పాలి. చిరకాలం నిలిచి ఉండే, తరతరాలకు జ్ఞాపకముండే నా పేరు ఇదే. నువ్వు వెళ్లి ఇశ్రాయేలు పెద్దలను సమకూర్చి ‘మీ పూర్వీకుల దేవుడు యెహోవా, అంటే అబ్రాహాము ఇస్సాకు యాకోబుల దేవుడు నాకు కనబడి ఇలా చెప్పాడు, నేను ఐగుప్తులో మీకు జరుగుతున్నదంతా చూశాను. ఐగుప్తులో మీరు పడుతున్న బాధల నుండి విడిపించి కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, యెబూసీయులు నివసిస్తున్న పాలు తేనెలు ప్రవహించే దేశానికి మిమ్మల్ని తీసుకువస్తాను’ అని చెప్పాడని వారితో చెప్పు.

నిర్గమ 3:1-17 కోసం వీడియో