అప్పటి వరకూ ఇశ్రాయేలు ప్రజల ముందు నడిచిన దేవదూత వాళ్ళ వెనక్కి వెళ్ళాడు. మేఘస్తంభం కూడా వాళ్ళ వెనక్కి వచ్చి నిలిచింది. అది ఐగుప్తు సేనలకూ ఇశ్రాయేలు ప్రజల సమూహనికీ మధ్య నిలిచింది. ఆ మేఘం ఆ రాత్రంతా ఐగుప్తు సైన్యానికి చీకటి కమ్మేలా, అదే సమయంలో ఇశ్రాయేలు ప్రజలకు వెలుగు ఉండేలా చేసింది. మోషే సముద్రంపై తన చెయ్యి చాపాడు. యెహోవా ఆ రాత్రి అంతా బలమైన తూర్పు గాలి వీచేలా చేసి, సముద్రం పాయలుగా చీలి మధ్యలో ఆరిపోయి పొడి నేల ఏర్పడేలా చేశాడు. సముద్రం నీళ్లు రెండుగా విడిపోగా ఇశ్రాయేలు ప్రజలు సముద్రం మధ్యలో ఆరిన నేలపై నడిచి వెళ్ళారు. ఆ నీళ్లు వారి కుడి పక్కన, ఎడమ పక్కన గోడల్లాగా నిలబడ్డాయి. ఫరో సైన్యం, గుర్రాలు, రథాలు, రౌతులు వారిని తరుముకుంటూ సముద్రం మధ్యకు చేరుకున్నారు. తెల్లవారుతుండగా యెహోవా ఆ అగ్ని స్తంభం నుండీ మేఘ స్తంభం నుండీ ఐగుప్తు సైన్యాన్ని చూసి వాళ్ళను కలవరానికి గురి చేశాడు. ఆయన వాళ్ళ రథచక్రాలు ఊడిపోయేలా చేసినప్పుడు వాళ్ళు అతి కష్టంగా రథాలు తోలవలసి వచ్చింది. అప్పుడు ఐగుప్తువాళ్ళు “రండి, మనం ఇశ్రాయేలు ప్రజల ఎదుట నుండి పారిపోదాం. యెహోవా వారికి తోడుగా ఉండి వాళ్ళ పక్షంగా యుద్ధం చేస్తున్నాడు” అని చెప్పుకున్నారు. యెహోవా మోషేతో “ఐగుప్తు సైన్యం మీదికి, వాళ్ళ రథాల, రౌతుల మీదికి నీళ్లు తిరిగి వచ్చేలా సముద్రం పైకి నీ చెయ్యి చాపు” అని చెప్పాడు. మోషే సముద్రం పైకి తన చెయ్యి చాపాడు. సాయంత్రం అయ్యేటప్పటికి సముద్రం వడిగా మళ్ళీ కలిసిపోయింది. అది చూసిన ఐగుప్తు సైన్యం వెనక్కి పారిపోవాలని చూశారు. అప్పుడు యెహోవా సముద్రం మధ్యలో ఐగుప్తు సైన్యం నాశనమయ్యేలా చేశాడు. నీళ్లు వేగంగా ప్రవహించి ఆ రథాలను, రౌతులను, వారి వెనుక సముద్రంలోకి వచ్చిన ఫరో సైన్యం మొత్తాన్నీ ముంచివేశాయి. వాళ్ళలో ఒక్కడు కూడా మిగలకుండా అంతా తుడిచిపెట్టుకు పోయారు. అయితే ఇశ్రాయేలు ప్రజలు సముద్రం మధ్యలో ఆరిన నేలపై నడిచినప్పుడు ఆ నీళ్లు వారికి కుడి, ఎడమ పక్కల గోడల్లాగా నిలబడ్డాయి. ఆ రోజున యెహోవా ఐగుప్తు సైన్యం నుండి ఇశ్రాయేలు ప్రజలను రక్షించాడు. చనిపోయి ఒడ్డుకు కొట్టుకు వచ్చిన ఐగుప్తు వాళ్ళను ఇశ్రాయేలు ప్రజలు చూశారు. తమ కోసం యెహోవా ఐగుప్తు వాళ్ల పట్ల చేసిన ఈ గొప్ప కార్యం చూసిన ఇశ్రాయేలు ప్రజలకు యెహోవా అంటే భయభక్తులు కలిగాయి. ఆ ప్రజలు యెహోవా మీదా, ఆయన సేవకుడు మోషే మీదా నమ్మకముంచారు.
చదువండి నిర్గమ 14
వినండి నిర్గమ 14
షేర్ చేయి
అన్ని అనువాదాలను సరిపోల్చండి: నిర్గమ 14:19-31
వచనాలను సేవ్ చేయండి, ఆఫ్‌లైన్‌లో చదవండి, బోధన క్లిప్‌లను చూడండి ఇంకా మరెన్నో చేయండి!
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు