ఎస్తేరు 4:9-17

ఎస్తేరు 4:9-17 IRVTEL

అప్పుడు హతాకు వెళ్లి మొర్దెకై చెప్పినదంతా ఎస్తేరుకు తెలియజేశాడు. అప్పుడు ఎస్తేరు మొర్దెకైతో చెప్పమని హతాకుతో ఇలా చెప్పి పంపింది. “పిలుపు రాకుండా పురుషుడు గానీ స్త్రీ గానీ రాజు గారి అంతఃపురం లోకి అడుగు పెడితే చట్ట ప్రకారం ఆ మనిషికి శిక్ష మరణమే. రాజు తన బంగారు రాజ దండాన్ని ఎవరివైపు చాపుతాడో ఆ వ్యక్తి మాత్రమే బ్రతుకుతాడు. ఈ కఠినమైన ఆజ్ఞ రాజసేవకులందరికీ రాజ సంస్థానాల్లోని వారందరికీ తెలుసు. ముప్ఫై రోజులుగా రాజు సముఖానికి వెళ్ళడానికి నాకు పిలుపు రాలేదు.” హతాకు ఎస్తేరు మాటలు మొర్దెకైకి తెలిపాడు. మొర్దెకై ఎస్తేరుకు ఇలా కబురంపాడు. “రాజ భవనంలో ఉన్నంత మాత్రాన ఇతర యూదులకు భిన్నంగా నువ్వు తప్పించుకుంటావనుకోవద్దు. నువ్వు ఈ సమయంలో ఏమీ మాట్లాడక పోతే యూదులకు సహాయం, విడుదల వేరొక దిక్కునుండి వస్తుంది. అయితే నువ్వూ నీ తండ్రి వంశమూ నశిస్తారు. నువ్వొకవేళ ఇలాటి తరుణం కోసమే ఈ రాజరికానికి వచ్చావేమో ఎవరికి తెలుసు?” అప్పుడు ఎస్తేరు మొర్దెకైకి ఇలా చెప్పి పంపింది. “షూషనులో ఉన్న యూదులందరినీ సమకూర్చి నాకోసం ఉపవాసముండేలా చెయ్యి. మూడు రోజులు ఏమీ తినవద్దు, తాగవద్దు. నేనూ నా దాసీలు కూడా ఉపవాసం ఉంటాము. చట్టవ్యతిరేకం అయినప్పటికీ నేను రాజు దగ్గరికి వెళ్తాను. నేను నశిస్తే నశిస్తాను.” మొర్దెకై వెళ్లి ఎస్తేరు తనకు చెప్పినదంతా చేశాడు.