ద్వితీ 21:10-23

ద్వితీ 21:10-23 IRVTEL

మీరు మీ శత్రువులతో యుద్ధం చేయబోయేటప్పుడు మీ యెహోవా దేవుడు మీ చేతికి వారిని అప్పగించిన తరువాత వారిని చెరపట్టి ఆ బందీల్లో ఒక అందమైన అమ్మాయిని చూసి ఆమెను మోహించి, ఆమెను పెళ్లి చేసుకోడానికి ఇష్టపడి, నీ ఇంట్లోకి ఆమెను చేర్చుకున్న తరువాత ఆమె తల క్షౌరం చేయించుకుని గోళ్ళు తీయించుకోవాలి. ఆమె తన ఖైదీ బట్టలు తీసేసి మీ ఇంట్లో ఉండే నెలరోజులు తన తల్లిదండ్రులను గురించి ప్రలాపించడానికి ఆమెను అనుమతించాలి. తరువాత నువ్వు ఆమెను పెళ్లిచేసుకోవచ్చు. ఆమె నీకు భార్య అవుతుంది. నువ్వు ఆమె వలన సుఖం పొందలేకపోతే ఆమెకు ఇష్టమున్న చోటికి ఆమెను పంపివేయాలే గాని ఆమెను వెండికి ఎంతమాత్రమూ అమ్మివేయకూడదు. మీరు ఆమెను అవమాన పరిచారు కాబట్టి ఆమెను బానిసగా చూడకూడదు. ఒక వ్యక్తికి ఇద్దరు భార్యలున్నప్పుడు అతడు ఒకరిని ఇష్టపడి, మరొకరిని ఇష్టపడకపోవచ్చు. ఇద్దరికీ పిల్లలు పుడితే, పెద్ద కొడుకు ఇష్టం లేని భార్యకు పుట్టిన వాడైతే తండ్రి తనకున్న ఆస్తిని తన కొడుకులకు వారసత్వంగా ఇచ్చే రోజున ఇష్టం లేని భార్యకు పుట్టిన పెద్ద కొడుక్కి బదులు ఇష్టమైన భార్యకు పుట్టినవాణ్ణి పెద్ద కొడుకుగా పరిగణించకూడదు. ఇష్టం లేని భార్యకు పుట్టిన వాడికి తండ్రి తన ఆస్తి అంతట్లో రెట్టింపు భాగమిచ్చి అతణ్ణి పెద్ద కొడుకుగా ఎంచాలి. ఇతడు అతని బలారంభం కాబట్టి జ్యేష్ఠత్వ అధికారం అతనిదే. ఒక వ్యక్తి కొడుకు మొండివాడై తిరగబడి తండ్రి మాట, తల్లి మాట వినక, వారు అతణ్ణి శిక్షించిన తరువాత కూడా అతడు వారికి విధేయుడు కాకపోతే అతని తలిదండ్రులు అతని పట్టుకుని ఊరి గుమ్మం దగ్గర కూర్చునే పెద్దల దగ్గరికి అతణ్ణి తీసుకురావాలి. మా కొడుకు మొండివాడై తిరగబడ్డాడు. మా మాట వినక తిండిబోతూ తాగుబోతూ అయ్యాడు, అని ఊరి పెద్దలతో చెప్పాలి. అప్పుడు ఊరి ప్రజలంతా రాళ్లతో అతన్ని చావగొట్టాలి. ఆ విధంగా చెడుతనాన్ని మీ మధ్యనుంచి తొలగించిన వాడివౌతావు. ఇశ్రాయేలు ప్రజలందరూ ఈ సంగతి విని భయపడతారు. మరణశిక్ష పొందేటంత పాపం ఎవరైనా చేస్తే అతణ్ణి చంపి మాను మీద వేలాడదీయాలి. అతని శవం రాత్రి వేళ ఆ మాను మీద ఉండనియ్యకూడదు. వేలాడదీసినవాడు దేవుని దృష్టిలో శాపగ్రస్తుడు కనుక మీ దేవుడైన యెహోవా వారసత్వంగా మీకిస్తున్న దేశం అపవిత్రం కాకుండా ఉండేలా అదే రోజు ఆ శవాన్ని తప్పకుండా పాతిపెట్టాలి.”