ద్వితీ 14
14
పవిత్రమైనవి, హేయమైనవి
1“మీరు మీ యెహోవా దేవుని ప్రజలు కాబట్టి ఎవరైనా చనిపోతే మిమ్మల్ని మీరు కోసుకోవడం, మీ ముఖంలో ఏ భాగాన్నైనా గొరుక్కోవడం చేయకూడదు. 2ఎందుకంటే మీ దేవుడైన యెహోవాకు మీరు ప్రతిష్టితమైన ప్రజలు. భూమి మీద ఉన్న అన్ని జాతుల ప్రజల నుండి ప్రత్యేకంగా తన స్వంత ప్రజలుగా యెహోవా మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు.
3మీరు హేయమైనది ఏదీ తినకూడదు. మీరు ఈ జంతువులను తినవచ్చు. 4ఎద్దు, గొర్రె, మేక. 5దుప్పి, ఎర్ర చిన్న జింక, దుప్పి, కారు మేక, కారు జింక, లేడి, కొండ గొర్రె. 6జంతువుల్లో రెండు డెక్కలు ఉండి నెమరు వేసే వాటిని తినవచ్చు. 7నెమరు వేసేవైనా రెండు డెక్కలు గలదైనా నెమరు వేసి ఒక్కటే డెక్క కలిగిన ఒంటె, కుందేలు, పొట్టి కుందేలు అనే జంతువులను తినకూడదు. అవి మీకు నిషిద్ధం. 8అలాగే పంది రెండు డెక్కలు కలిగినదైనా నెమరు వేయదు కాబట్టి అది మీకు నిషిద్ధం. వాటి మాంసం తినకూడదు, వాటి శవాలను తాకకూడదు.
9నీటిలో నివసించే వాటిలో రెక్కలు, పొలుసులు గలవాటినన్నిటినీ తినవచ్చు. 10రెక్కలు, పొలుసులు లేని దాన్ని మీరు తినకూడదు. అది మీకు నిషిద్ధం.
11పవిత్రమైన ప్రతి పక్షినీ మీరు తినవచ్చు. 12మీరు తినరాని పక్షులు ఏవంటే, పక్షిరాజు, రాబందు, గద్ద. 13ఎర్ర గద్ద, నల్ల గద్ద, డేగ. 14అన్ని రకాల కాకులు. 15నిప్పు కోడి, నిశి డేగ, అన్ని రకాల డేగలు. 16చిన్న గుడ్లగూబ, పెద్ద గుడ్లగూబ, తీతువు పిట్ట, 17గూడబాతు, బోడి రాబందు, గండ భేరుండం. 18కొంగ, అన్ని రకాల బకాలు, కూకుడు గువ్వ, గబ్బిలం. 19ఎగిరే ప్రతి పురుగూ మీకు నిషిద్ధం. వాటిని తినకూడదు. 20ఎగిరే పవిత్రమైన ప్రతి దాన్నీ తినవచ్చు.
21దానికదే చచ్చిన దాన్ని మీరు తినకూడదు. అయితే దాన్ని మీ ఇంటి ఆవరణంలో ఉన్న పరదేశికి తినడానికి ఇయ్యవచ్చు. లేక అన్యునికి దాన్ని అమ్మవచ్చు. ఎందుకంటే మీ దేవుడైన యెహోవాకు మీరు ప్రతిష్ఠితమైన ప్రజలు. మేకపిల్లను దాని తల్లి పాలతో కలిపి వండకూడదు.
దశమ భాగాలు
22ప్రతి సంవత్సరం, మీ విత్తనాల పంటలో దశమ భాగాన్ని తప్పనిసరిగా వేరు చెయ్యాలి. 23మీ జీవితమంతటిలో మీ దేవుడైన యెహోవాను మీరు గౌరవించాలంటే ఆయన తన నామానికి నివాస స్థానంగా ఏర్పాటు చేసుకొన్న స్థలంలో, ఆయన సన్నిధిలో మీ పంటలో, ద్రాక్షారసంలో, నూనెలో పదో పంతును, మీ పశువుల్లో గొర్రెల్లో మేకల్లో తొలిచూలు వాటిని తినాలి.
24యెహోవా తన సన్నిధి కోసం ఏర్పాటు చేసుకున్న స్థలం దూరంగా ఉంటే, మీరు వాటిని మోయలేరు కాబట్టి మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించినప్పుడు, 25వాటిని వెండిగా మార్చి దాన్ని తీసుకుని మీ యెహోవా దేవుడు ఏర్పాటు చేసుకున్న స్థలానికి వెళ్లి, 26ఎద్దులు, గొర్రెలు, ద్రాక్షారసం, మద్యం, వీటిలో మీరు కోరిన దానికి ఆ వెండిని ఇచ్చి, అక్కడ మీ దేవుడు యెహోవా సన్నిధిలో భోజనం చేసి, మీరు, మీ ఇంటివారు, మీ ఇంట్లో ఉండే లేవీయులు సంతోషించాలి. 27లేవీయులను విడిచిపెట్టకూడదు. ఎందుకంటే మీ మధ్యలో వారికి వంతు గాని, స్వాస్థ్యం గాని లేదు.
28మీ దేవుడు యెహోవా మీరు చేసే పని అంతటిలో మిమ్మల్ని ఆశీర్వదించేలా మూడు సంవత్సరాల కొకసారి, ఆ సంవత్సరం మీకు కలిగిన పంటలో పదో వంతుని బయటికి తెచ్చి మీ ఇంట్లో ఉంచాలి. 29అప్పుడు మీ మధ్యలో వంతు గాని, స్వాస్థ్యం గాని లేని లేవీయులు, మీ ఇంట్లో ఉన్న పరదేశులు, అనాథలు, విధవరాళ్ళు వచ్చి భోజనం చేసి తృప్తి పొందుతారు.”
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
ద్వితీ 14: IRVTel
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
TEL-IRV
Creative Commons License
Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.