విన్నవారంతా ఆశ్చర్యపడి, ‘యెరూషలేములో ఈ పేరుతో ప్రార్థన చేసే వారిని నాశనం చేసింది ఇతడే కదా? వారిని బందీలుగా ప్రధాన యాజకుల దగ్గరికి తీసుకుపోడానికి ఇక్కడికి కూడా వచ్చాడు కదా’ అని చెప్పుకున్నారు. అయితే సౌలు మరింతగా బలపడి ‘యేసే క్రీస్తు’ అని రుజువు పరుస్తూ దమస్కులో నివసిస్తున్న యూదులను కలవరపరచాడు.
చాలా రోజులు గడిచిన తరువాత యూదులు అతనిని చంపాలని ఆలోచించారు. వారి కుతంత్రం సౌలుకు తెలిసింది. వారు అతనిని చంపాలని రాత్రింబగళ్ళు పట్టణ ద్వారాల దగ్గర కాపు కాశారు. అయితే అతని శిష్యులు రాత్రివేళ అతనిని తీసుకుపోయి గంపలో కూర్చోబెట్టి గోడ మీద నుండి అతనిని కిందికి దింపి తప్పించారు.
అతడు యెరూషలేము వచ్చినపుడు శిష్యులతో చేరడానికి ప్రయత్నం చేశాడు గాని, అతడు శిష్యుడని నమ్మలేక అందరూ అతనికి భయపడ్డారు. అయితే బర్నబా అతనిని చేరదీసి అపొస్తలుల దగ్గరికి తీసుకుని వచ్చి, “అతడు దారిలో ప్రభువును చూశాడనీ, ప్రభువు అతనితో మాట్లాడాడనీ, అతడు దమస్కులో యేసు నామంలో ధైర్యంగా బోధించాడు” అనీ, వారికి వివరంగా తెలియపరచాడు. అతడు యెరూషలేములో వారితో కలిసి వస్తూ పోతూ, ప్రభువు నామంలో ధైర్యంగా బోధిస్తూ, గ్రీకు యూదులతో మాట్లాడుతూ తర్కించాడు. అయితే వారు అతణ్ణి చంపాలని ప్రయత్నం చేశారు.
సోదరులు దీన్ని తెలుసుకుని అతనిని కైసరయకు తీసుకు వచ్చి తార్సుకు పంపేశారు. కాబట్టి యూదయ, గలిలయ, సమరయ, ప్రాంతాలంతటా సంఘం ప్రశాంతంగా ఉంటూ అభివృద్ది చెందింది. ప్రభువు పట్ల భయం, పరిశుద్ధాత్మ ప్రసాదించే ఆదరణ కలిగి సాగిపోతూ విస్తరించింది.
ఆ తరువాత పేతురు ఆ ప్రాంతమంతా తిరిగి, లుద్ద అనే ఊరులో నివసిస్తున్న దేవుని ప్రజల దగ్గరికి వచ్చాడు. అక్కడ పక్షవాతంతో ఎనిమిది సంవత్సరాల నుండి మంచం పట్టిన ఐనెయ అనే ఒకతన్ని చూసి, “ఐనెయా, యేసు క్రీస్తు నిన్ను బాగుచేశాడు, నీవు లేచి నీ పడక సర్దుకో” అని అతనితో చెప్పగానే వెంటనే అతడు పైకి లేచాడు. లుద్దలో, షారోనులో నివసిస్తున్న వారంతా అతనిని చూసి ప్రభువును విశ్వసించారు.
యొప్పేలో తబిత అనే ఒక శిష్యురాలు ఉంది. (ఈ పేరు గ్రీకులో దొర్కా, అంటే లేడి). ఈమె ఎప్పుడూ మంచి పనులు చేస్తూ, పేదలను ఆదుకుంటూ ఉండేది. ఆ రోజుల్లో ఆమె జబ్బుపడి చనిపోయింది. ఆమె శవానికి స్నానం చేయించి మేడ గదిలో ఉంచారు. లుద్ద అనే ఊరు యొప్పేకు దగ్గరగా ఉండడం వల్ల పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని, ఆలస్యం చేయకుండా తమ దగ్గరికి రమ్మని అతనిని బతిమాలడానికి ఇద్దర్ని అతని దగ్గరకి పంపారు.
పేతురు లేచి వారితో కూడా వెళ్ళాడు. అక్కడ చేరినప్పుడు, వారు మేడగదిలోకి అతనిని తీసుకొచ్చారు. అక్కడ ఉన్న వితంతువులందరూ ఏడుస్తూ, దోర్కా తమతో ఉన్నప్పుడు కుట్టిన అంగీలు, బట్టలు చూపిస్తూ అతని పక్కనే నిలబడ్డారు. పేతురు అందరినీ బయటికి పంపి మోకరించి ప్రార్థన చేశాడు. తరువాత ఆ శవం వైపు తిరిగి, “తబితా, లే” అనగానే ఆమె కళ్ళు తెరచి పేతురును చూడగానే లేచి కూర్చుంది. అతడామె చెయ్యి పట్టుకుని పైకి లేపాడు. అక్కడ చేరిన విశ్వాసులనూ, వితంతువులనూ పిలిచి ఆమెను సజీవంగా వారికి అప్పగించాడు.
ఇది యొప్పే ప్రాంతమంతా తెలిసింది, చాలామంది ప్రభువులో విశ్వాసముంచారు. పేతురు యొప్పేలో సీమోను అనే చర్మాలు బాగు చేసే వాని దగ్గర చాలా రోజులున్నాడు.