అపొస్తలుల కార్యములు 9:20-31

అపొస్తలుల కార్యములు 9:20-31 IRVTEL

వెంటనే సమాజ మందిరాల్లో యేసే దేవుని కుమారుడని ప్రకటిస్తూ వచ్చాడు. విన్నవారంతా ఆశ్చర్యపడి, ‘యెరూషలేములో ఈ పేరుతో ప్రార్థన చేసే వారిని నాశనం చేసింది ఇతడే కదా? వారిని బందీలుగా ప్రధాన యాజకుల దగ్గరికి తీసుకుపోడానికి ఇక్కడికి కూడా వచ్చాడు కదా’ అని చెప్పుకున్నారు. అయితే సౌలు మరింతగా బలపడి ‘యేసే క్రీస్తు’ అని రుజువు పరుస్తూ దమస్కులో నివసిస్తున్న యూదులను కలవరపరచాడు. చాలా రోజులు గడిచిన తరువాత యూదులు అతనిని చంపాలని ఆలోచించారు. వారి కుతంత్రం సౌలుకు తెలిసింది. వారు అతనిని చంపాలని రాత్రింబగళ్ళు పట్టణ ద్వారాల దగ్గర కాపు కాశారు. అయితే అతని శిష్యులు రాత్రివేళ అతనిని తీసుకుపోయి గంపలో కూర్చోబెట్టి గోడ మీద నుండి అతనిని కిందికి దింపి తప్పించారు. అతడు యెరూషలేము వచ్చినపుడు శిష్యులతో చేరడానికి ప్రయత్నం చేశాడు గాని, అతడు శిష్యుడని నమ్మలేక అందరూ అతనికి భయపడ్డారు. అయితే బర్నబా అతనిని చేరదీసి అపొస్తలుల దగ్గరికి తీసుకుని వచ్చి, “అతడు దారిలో ప్రభువును చూశాడనీ, ప్రభువు అతనితో మాట్లాడాడనీ, అతడు దమస్కులో యేసు నామంలో ధైర్యంగా బోధించాడు” అనీ, వారికి వివరంగా తెలియపరచాడు. అతడు యెరూషలేములో వారితో కలిసి వస్తూ పోతూ, ప్రభువు నామంలో ధైర్యంగా బోధిస్తూ, గ్రీకు యూదులతో మాట్లాడుతూ తర్కించాడు. అయితే వారు అతణ్ణి చంపాలని ప్రయత్నం చేశారు. సోదరులు దీన్ని తెలుసుకుని అతనిని కైసరయకు తీసుకు వచ్చి తార్సుకు పంపేశారు. కాబట్టి యూదయ, గలిలయ, సమరయ, ప్రాంతాలంతటా సంఘం ప్రశాంతంగా ఉంటూ అభివృద్ది చెందింది. ప్రభువు పట్ల భయం, పరిశుద్ధాత్మ ప్రసాదించే ఆదరణ కలిగి సాగిపోతూ విస్తరించింది.

అపొస్తలుల కార్యములు 9:20-31 కోసం వీడియో