అపొస్తలుల కార్యములు 16:25-34

అపొస్తలుల కార్యములు 16:25-34 IRVTEL

మధ్యరాత్రి సమయంలో పౌలు, సీలలు ప్రార్థన చేసుకుంటూ పాటలు పాడుకుంటూ ఉంటే యితర ఖైదీలు వింటున్నారు. అప్పుడు అకస్మాత్తుగా పెద్ద భూకంపం వచ్చింది, చెరసాల పునాదులు కదిలి పోయాయి, వెంటనే తలుపులన్నీ తెరుచుకున్నాయి, అందరి సంకెళ్ళు ఊడిపోయాయి. అంతలో చెరసాల అధికారి నిద్ర లేచి, చెరసాల తలుపులన్నీ తెరచి ఉండడం చూసి, ఖైదీలు పారిపోయారనుకుని, కత్తి దూసి, ఆత్మహత్య చేసుకోబోయాడు. అయితే పౌలు, “నీవు ఏ హానీ చేసుకోవద్దు, మేమంతా ఇక్కడే ఉన్నాం,” అన్నాడు. చెరసాల అధికారి దీపాలు తెమ్మని చెప్పి వేగంగా లోపలికి వచ్చి, వణుకుతూ పౌలు, సీలలకు సాష్టాంగ పడి, వారిని బయటికి తెచ్చి, “అయ్యలారా, రక్షణ పొందాలంటే నేనేమి చేయాలి?” అని అడిగాడు. అందుకు వారు, “ప్రభువైన యేసులో విశ్వాసముంచు, అప్పుడు నువ్వూ, నీ ఇంటివారూ రక్షణ పొందుతారు” అని చెప్పి అతనికీ అతని ఇంట్లో ఉన్న వారందరికీ దేవుని వాక్కు బోధించారు. రాత్రి ఆ సమయంలోనే చెరసాల అధికారి వారిని తీసుకు వచ్చి, వారి గాయాలు కడిగాడు. వెంటనే అతడూ అతని ఇంటి వారంతా బాప్తిసం పొందారు. అతడు పౌలు సీలలను తన ఇంటికి తీసికెళ్ళి భోజనం పెట్టి, తాను దేవునిలో విశ్వాసముంచినందుకు తన ఇంటి వారందరితో కూడ ఆనందించాడు.

అపొస్తలుల కార్యములు 16:25-34 కోసం వీడియో