కైసరయ పట్టణంలో కొర్నేలి అనే భక్తిపరుడు ఉండేవాడు. ఇతడు ఇటలీ దళానికి చెందిన ఒక శతాధిపతి. అతడు కుటుంబ సమేతంగా దేవుణ్ణి ఆరాధించేవాడు. యూదు ప్రజలకు దానధర్మాలు చేస్తూ ఎప్పుడూ దేవునికి ప్రార్థన చేసేవాడు. మధ్యాహ్నం సుమారు మూడు గంటలప్పుడు దేవుని దూత అతని దగ్గరికి వచ్చి, “కొర్నేలీ” అని పిలవడం దర్శనంలో స్పష్టంగా చూశాడు. అతడు ఆ దూతను తేరి చూసి చాలా భయపడి, “ప్రభూ, ఏమిటి?” అని అడిగాడు. అందుకు దూత, “నీ ప్రార్థనలూ పేదలకు నీవు చేసే దానధర్మాలూ దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరాయి. ఇప్పుడు యొప్పేకు మనుషులను పంపి, పేతురు అనే మారు పేరున్న సీమోనును పిలిపించుకో. అతడు సీమోను అనే ఒక చర్మకారుని దగ్గర ఉన్నాడు. అతని ఇల్లు సముద్రం పక్కనే ఉంది” అని చెప్పాడు. ఆ దూత వెళ్ళిన తరువాత కొర్నేలి తన ఇంట్లో పని చేసే ఇద్దర్ని, తనను ఎప్పుడూ కనిపెట్టుకుని ఉండే భక్తిపరుడైన ఒక సైనికుణ్ణి పిలిచి వారికి ఈ సంగతులన్నీ వివరించి వారిని యొప్పేకి పంపాడు. తరువాతి రోజున వారు ప్రయాణమై పోయి పట్టణానికి దగ్గరగా వచ్చేటప్పటికి పగలు సుమారు పన్నెండు గంటల వేళకి పేతురు ప్రార్థన చేసుకోడానికి ఇంటి పైకి వెళ్ళాడు. అతనికి బాగా ఆకలిగా ఉండి, భోజనం చేయాలనిపిస్తే ఇంట్లో వారు వంట సిద్ధం చేస్తూ ఉన్నారు. అదే సమయంలో అతడు పారవశ్యానికి లోనై, ఆకాశం తెరుచుకుని, నాలుగు చెంగులు పట్టి దింపిన పెద్ద దుప్పటి లాంటి పాత్ర ఒకటి భూమి మీదికి దిగి రావడం చూశాడు. దానిలో భూమి మీద ఉన్న అన్నిరకాల నాలుగు కాళ్ళ జంతువులూ పాకే పురుగులూ ఆకాశ పక్షులూ ఉన్నాయి. అప్పుడు, “పేతురూ, లేచి చంపుకుని తిను” అనే ఒక శబ్డం అతనికి వినిపించింది. అయితే పేతురు, “వద్దు ప్రభూ. నిషిద్ధమైన దానినీ అపవిత్రమైన దానినీ నేనెప్పుడూ తినలేదు” అని జవాబిచ్చాడు. “దేవుడు పవిత్రం చేసిన వాటిని నీవు నిషిద్ధం అనకు” అని మళ్ళీ రెండవసారి ఆ స్వరం అతనికి వినబడింది. ఈ విధంగా మూడుసార్లు జరిగింది. వెంటనే ఆ పాత్ర ఆకాశానికి తిరిగి వెళ్ళిపోయింది. పేతురు తనకు వచ్చిన దర్శనం ఏమిటో అని తనలో తాను ఆలోచించుకుంటూ అయోమయంలో ఉండగా, కొర్నేలి పంపిన మనుషులు సీమోను ఇంటి కోసం వాకబు చేసి, తలుపు దగ్గర నిలబడి “పేతురు అనే పేరున్న సీమోను ఇక్కడుంటున్నాడా?” అని అడిగారు.
Read అపొస్తలుల కార్యములు 10
వినండి అపొస్తలుల కార్యములు 10
షేర్ చేయి
అన్ని అనువాదాలను సరిపోల్చండి: అపొస్తలుల కార్యములు 10:1-18
వచనాలను సేవ్ చేయండి, ఆఫ్‌లైన్‌లో చదవండి, బోధన క్లిప్‌లను చూడండి ఇంకా మరెన్నో చేయండి!
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు