2 తిమోతి పత్రిక 3:10-17

2 తిమోతి పత్రిక 3:10-17 IRVTEL

నీవు మాత్రం నా బోధనూ, ప్రవర్తననూ, ఉద్దేశాన్నీ, విశ్వాసాన్నీ, సహనాన్నీ, ప్రేమనూ, ఓర్పునూ అనుకరించావు. అంతియొకయ, ఈకొనియ, లుస్త్ర అనే పట్టణాల్లో నేను అనుభవించిన హింసలనూ ప్రమాదాలనూ ఎరిగే నన్ను వెంబడించావు. అలాంటి హింసలు నేను సహించాను గాని, వాటన్నిటిలో నుండి ప్రభువు నన్ను తప్పించాడు. క్రీస్తు యేసులో సద్భక్తితో జీవించాలని కోరేవారంతా హింస పొందుతారు. అయితే చెడ్డ వారూ, వంచకులూ ఇతరులను మోసపరుస్తూ తాము కూడా మోసపోతూ అంతకంతకూ చెడిపోతారు. కానీ నీవు మాత్రం కచ్చితంగా తెలుసుకున్న వాటిని ఎవరి ద్వారా నేర్చుకున్నావో గ్రహించి వాటిలో నిలకడగా సాగిపో. ఎందుకంటే క్రీస్తు యేసులో విశ్వాసం ద్వారా పాప విముక్తినిచ్చే జ్ఞానాన్ని నీకు కలిగించే శక్తిగల పరిశుద్ధ లేఖనాలు బాల్యం నుండీ నీకు తెలుసు. దేవుని సేవకుడు సిద్ధపడి ప్రతి మంచి పనినీ జరిగించడానికి పూర్తి సన్నాహంతో ఉండాలి. అందుకోసమే ప్రతి లేఖనం దైవావేశం వలన ఉనికిలోకి వచ్చింది. అది బోధించడానికీ, ఖండించడానికీ, తప్పు దిద్దడానికీ, నీతిలో శిక్షణ ఇవ్వడానికీ తోడ్పడుతుంది.