2 తిమోతి పత్రిక 2:1-15

2 తిమోతి పత్రిక 2:1-15 IRVTEL

నా కుమారా, క్రీస్తు యేసులో ఉన్న కృపచేత బలవంతుడవుగా ఉండు. అనేకుల ముందు నేను నీకు నేర్పిన సంగతులను ఇతరులకు బోధించగలిగిన, నమ్మకమైన వ్యక్తులకు అప్పగించు. క్రీస్తు యేసు కోసం మంచి సైనికుడిలా కష్టాలు భరించు. సైనికుడు యుద్ధానికి వెళ్ళేటప్పుడు తన జీవితంలో ఇతర వ్యాపకాల్లో చిక్కుకోకుండా తనను సైన్యంలో చేర్చుకున్నవాణ్ణి సంతోషపెట్టాలని ప్రయత్నిస్తాడు. ఒక క్రీడాకారుడు నియమాల ప్రకారం పూర్తిచేయకపోతే అతనికి బహుమానం దొరకదు. కష్టపడిన వ్యవసాయదారుడే రాబడిలో మొదటి భాగం పొందడానికి అర్హుడు. నేను చెప్పే మాటలు ఆలోచించు. అన్ని విషయాల్లో ప్రభువు నీకు జ్ఞానం అనుగ్రహిస్తాడు. నా సువార్త ప్రకారం, దావీదు సంతానంలో పుట్టి చనిపోయినవారిలో నుండి లేచిన యేసు క్రీస్తును జ్ఞాపకం చేసుకో. ఆ సువార్త విషయంలో నేను ఒక నేరస్థుడిలా సంకెళ్ళపాలై కష్టాలు అనుభవిస్తున్నాను. అయితే దేవుని వాక్యానికి మాత్రం సంకెళ్ళు లేవు. అందుచేత ఎన్నికైనవారు నిత్యమైన మహిమతో క్రీస్తు యేసులోని రక్షణ పొందాలని నేను వారి కోసం అన్నీ ఓర్చుకుంటున్నాను. “మనం ఆయనతో చనిపోతే ఆయనతో బతుకుతాం. కష్టాలు సహిస్తే ఆయనతోబాటు రాజ్య పరిపాలన చేస్తాం. ఆయన ఎవరో మనకు తెలియదు అంటే ఆయన కూడా మనం ఎవరో తెలియదు అంటాడు. ఆయన తన నైజానికి విరుద్ధంగా ఏమీ చేయలేడు కాబట్టి, మనం నమ్మకస్తులం కాకపోయినా ఆయన మాత్రం నమ్మదగినవాడే,” అనే మాటలు నమ్మదగినవి. వినేవారిని చెడగొట్టడానికే తప్ప మరి ఏ ప్రయోజనమూ లేని మాటలను గూర్చి వాదం పెట్టుకోవద్దని ప్రభువు ఎదుట విశ్వాసులకు హెచ్చరిస్తూ ఈ సంగతులు వారికి గుర్తు చెయ్యి. దేవుని దృష్టిలో ఆమోదయోగ్యుడుగా, సిగ్గుపడనక్కరలేని పనివాడుగా, సత్యవాక్యాన్ని సరిగా ఉపదేశించేవాడుగా నిన్ను నీవే దేవునికి కనుపరచుకో.

2 తిమోతి పత్రిక 2:1-15 కోసం వీడియో