2 సమూ 7:18-29

2 సమూ 7:18-29 IRVTEL

అప్పుడు రాజైన దావీదు లోపలికి వెళ్ళి యెహోవా సన్నిధిలో కూర్చుని ఇలా ప్రార్థించాడు. “నా ప్రభూ యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించడానికి నేనెంతటివాణ్ణి? నా వంశం ఏపాటిది? నన్ను ఇంతగా హెచ్చించి నాకు చేసినదంతా నీకు స్వల్పమైన విషయం. నీ దాసుడనైన నా వంశానికి భవిషత్తులో కలగబోయే ఉన్నతిని గూర్చి నాకు వెల్లడించావు. యెహోవా, నా ప్రభూ, దావీదు అనే నేను ఇక నీతో ఏమి చెప్పుకొంటాను? యెహోవా నా ప్రభూ, నీ దాసుడనైన నా గురించి నీకు తెలుసు. నీ మాటను బట్టి నీ చిత్తం చొప్పున ఈ గొప్ప కార్యాలు జరిగించి అవి నీ దాసుడనైన నాకు తెలియజేశావు. దేవా, యెహోవా, నువ్వు అనంతమైన ప్రభావం గలవాడివి. మేము విన్నదాన్ని బట్టి చూసినప్పుడు నీవు తప్ప దేవుడెవరూ లేడు. నువ్వు విమోచించిన ఇశ్రాయేలీయులనే నీ ప్రజలవంటి వారు లోకంలో ఎక్కడా లేరు. నీ ప్రజలయ్యేలా వారిని నీవు విమోచించావు. నీకు పేరు ప్రఖ్యాతులు కలిగేలా, నీ ప్రజలను బట్టి నీ దేశం కోసం భీకరమైన గొప్పకార్యాలు చేసేలా దేవుడవైన నువ్వు ఐగుప్తు దేశంలో నుండి, ఆ జనుల వశంలో నుండి, వారి దేవుళ్ళ వశంలో నుండి విడిపించావు. యెహోవావైన నీవు వారికి దేవుడై ఉండి, వారు నిరంతరం ఇశ్రాయేలీయులు అనే పేరుగల ప్రజలుగా నీ కోసం నిలిచి ఉండేలా స్థిరపరచావు. దేవా యెహోవా, నీ దాసుడనైన నన్ను గూర్చీ, నా వంశం గూర్చీ నీవు సెలవిచ్చిన మాట ఎప్పటికీ నిలిచిపోయేలా దృఢపరచు. ‘సైన్యాలకు అధిపతి అయిన యెహోవా ఇశ్రాయేలీయులకు దేవుడు’ అని ప్రజలనే మాటచేత నీకు శాశ్వత మహిమ కలిగేలా నీ దాసుడనైన నా వంశం నీ సన్నిధిలో స్థిరపరచబడేలా నువ్వు సెలవిచ్చిన మాట నెరవేర్చు. ఇశ్రాయేలీయుల దేవా, సైన్యాలకు అధిపతి అయిన యెహోవా నాకు సంతానం కలిగిస్తానని నీ దాసునికి తెలియపరచావు. కాబట్టి ఈ విధంగా నీతో విన్నపం చేయడానికి నీ దాసుడనైన నాకు ధైర్యం వచ్చింది. యెహోవా, నా ప్రభూ, నీ దాసుడనైన నాకు మేలు దయచేస్తానని చెప్తున్నావు కదా. నువ్వు దేవుడివి కాబట్టి నీ మాటలన్నీ నిజమైనవి. నీ దాసుడనైన నా వంశం అంతా నిత్యమూ నీ సన్నిధిలో ఉండేలా దయచేసి దీవించు. యెహోవా నా ప్రభూ, నువ్వు సెలవిచ్చినట్టు నీ దీవెనలు పొంది నా వంశం అన్నివేళలా దీవెన పొందుతుంది గాక.”