2 సమూ 22:2-20

2 సమూ 22:2-20 IRVTEL

యెహోవా నా ఆశ్రయ శిల, నా కోట, నా రక్షకుడు. నా ఆశ్రయ శిల, నేను ఆయన సంరక్షణలో ఉంటాను. నా డాలు, నా రక్షణ కొమ్ము, నా సురక్ష. ఆశ్రయస్థానం. హింస నుండి నన్ను కాపాడేవాడు. స్తుతికి అర్హుడైన యెహోవాకు నేను మొర్రపెట్టాను. నా శత్రువుల చేతిలోనుండి నేను తప్పించుకుంటాను. మృత్యుకెరటాలు నన్ను చుట్టుకున్నాయి. భక్తిహీనుల వరద పొంగు నన్ను ముంచెత్తింది. పాతాళ పాశాలు నన్ను కట్టి వేశాయి. మరణపు ఉచ్చులు నన్ను చిక్కించుకున్నాయి. నా దురవస్థలో నేను యెహోవాకు మొర్ర పెట్టాను. నా దేవునికి విన్నవించుకున్నాను. ఆయన తన ఆలయంలో నా ఆక్రోశం విన్నాడు. నా మొర్ర ఆయన చెవులకు చేరింది. అప్పుడు భూమి కంపించింది. అదిరింది. పరమండలపు పునాదులు వణికాయి. ఆయన కోపానికి అవి కంపించాయి. ఆయన ముక్కుపుటాల్లో నుంచి నుండి పొగ లేచింది. ఆయన నోట నుండి జ్వాలలు వచ్చాయి. అవి నిప్పు కణాలను రగిల్చాయి. ఆకాశాన్ని చీల్చి ఆయన దిగి వచ్చాడు ఆయన పాదాల కింద చిక్కటి చీకటి కమ్మి ఉంది. ఆయన కెరూబును అధిరోహించి వచ్చాడు. గాలి రెక్కల మీద స్వారీ చేస్తూ కనిపించాడు. అంధకారాన్ని తన చుట్టూ గుడారంగా చేసుకున్నాడు. దట్టమైన కారుమబ్బులను ఆకాశంలో రాశి పోశాడు. ఆయన సన్నిధి మెరుపుల్లోనుండి అగ్ని కణాలు కురిశాయి. యెహోవా ఆకాశం నుండి గర్జించాడు. సర్వోన్నతుడు భీకర ధ్వని చేశాడు. తన బాణాలు వేసి శత్రువులను చెదరగొట్టాడు. ఉరుములు కురిపించి వారిని కకావికలు చేశాడు. యెహోవా యుధ్ధ ధ్వనికి ఆయన ముక్కుపుటాల నుండి వెలువడిన సెగకి భూగోళం పునాది రాళ్లు బయట పడ్డాయి. పైనుండి చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకున్నాడు. నురగలు కక్కుతున్న జలరాసుల్లో నుండి నన్ను బయటికి తీశాడు. బలవంతులైన పగవారి నుండి, నన్ను ద్వేషించే వారినిండి, నన్ను లొంగదీసుకునే వారి నుండి ఆయన నన్ను రక్షించాడు. విపత్కర సమయంలో వారు నా మీదికి వచ్చారు. కానీ యెహోవా నాకు అండగా ఉన్నాడు. యెహోవా విశాలమైన చోటికి నన్ను తోడుకుని వచ్చాడు. నేనంటే ఆయనకు ఇష్టం గనక ఆయన నన్ను రక్షించాడు.