2 రాజులు 6:25-33

2 రాజులు 6:25-33 IRVTEL

దానివల్ల షోమ్రోనులో భయంకరమైన కరువు వచ్చింది. వాళ్ళ ముట్టడి ఎంత దారుణంగా ఉందంటే దాని మూలంగా షోమ్రోనులో గాడిద తలను ఎనభై తులాల వెండికీ, పావు కొలత పెన్నేరు దుంప ఐదు తులాల వెండికీ అమ్మారు. ఆ సమయంలో ఇశ్రాయేలు రాజు ప్రాకారం గోడపై నడుస్తూ ఉన్నప్పుడు ఒక స్త్రీ రాజును చూసింది. “రాజా, నా ప్రభూ, సహాయం చెయ్యండి” అంటూ కేకలు పెట్టింది. అది విని రాజు “యెహోవాయే నీకు సహాయం చెయ్యడం లేదు. ఇక నేనేం చేస్తాను. ద్రాక్ష గానుగ నుండీ, ధాన్యపు కళ్ళం నుండీ ఏమన్నా వస్తుందా” అన్నాడు. రాజు ఇంకా “నీకు వచ్చిన కష్టం ఏమిటి?” అని అడిగాడు. దానికి ఆమె “ఒకామె నాతో ఇలా అంది, ‘ఈ రోజుకి నీ కొడుకుని ఇవ్వు. వాణ్ని ఈ రోజు మనం వండుకుని తినేద్దాం. రేపు నా కొడుకుని ఇస్తా. రేపు తిందాం’ అంది. అలాగే మేము నా కొడుకుని వండుకుని తినేశాం. అయితే తరువాత రోజు నేను ‘ఈ రోజు భోజనానికి నీ కొడుకుని ఇవ్వు’ అని అడిగాను. కానీ ఆమె తన కొడుకుని దాచిపెట్టుకుంది” అని చెప్పింది. రాజు ఆమె చెప్పింది విని తన బట్టలు చింపుకున్నాడు. ప్రాకారం గోడ పైన నడుస్తున్న రాజును ప్రజలు చూసినప్పుడు వారికి రాజు శరీరం పై గోనె పట్ట కనిపించింది. అప్పుడు రాజు “ఈ రోజు షాపాతు కొడుకు ఎలీషా మెడపై తల నిలిచి ఉంటే దేవుడు నన్ను పెద్ద ప్రమాదంలో పడవేస్తాడు గాక” అన్నాడు. అప్పుడు ఎలీషా తన ఇంట్లో కూర్చుని ఉన్నాడు. అతనితో పాటు కొందరు పెద్దలు కూడా ఉన్నారు. అప్పుడు రాజు ఒక మనిషిని పంపాడు. ఆ వ్యక్తి ఎలీషా దగ్గరికి రాక ముందే ఎలీషా ఆ పెద్దలతో “ఈ హంతకుని కొడుకు నా తల తీయడానికి మనిషిని పంపాడు చూశారా! మీరు చూస్తూ ఉండండి. అతడు వచ్చిన వెంటనే తలుపుతో వాణ్ని వెనక్కు తోసి తలుపులు మూయండి. వాడి వెనకాలే వాడి యజమాని కాళ్ళ చప్పుడు మనకు విన్పిస్తున్నది కదా” అన్నాడు. ఎలీషా మాట్లాడుతూ ఉండగానే రాజు పంపిన మనిషి, వాడి వెనకే రాజూ వచ్చారు. అప్పుడు రాజు “ఈ హాని మనకు యెహోవా వల్ల జరిగింది. ఇక మనం ఆయన కోసం ఎందుకు ఎదురు చూడాలి?” అన్నాడు.