2 కొరింతీ పత్రిక 11:12-27

2 కొరింతీ పత్రిక 11:12-27 IRVTEL

అయితే ప్రస్తుతం నేను చేసేది తరువాత కూడా చేస్తాను. ఎందుకంటే, కొందరు ఏఏ విషయాల్లో గర్వంగా చెప్పుకొంటారో ఆ విషయాల్లో తాము మాలాగే ఉన్నట్టు అనిపించుకోవాలని చూస్తున్నారు. అలా గర్వంతో చెప్పే అవకాశమేమీ వారికి లేకుండా చేయాలని కోరుతున్నాను. అలాంటి వారు క్రీస్తు అపొస్తలుల వేషం వేసుకున్న అబద్ధ అపొస్తలులు, మోసకరమైన సేవకులు. ఇందులో ఆశ్చర్యమేమీ లేదు. సాతాను కూడా వెలుగు దూత వేషం వేసుకుంటాడు. అందుచేత, వాడి సేవకులు కూడా నీతి పరిచారకుల వేషం వేసుకోవడం వింతేమీ కాదు. వారి పనులనుబట్టే వారి అంతముంటుంది. మళ్ళీ చెబుతున్నాను. నేను బుద్ధిహీనుడినని ఎవరూ అనుకోవద్దు. అలా అనుకుంటే, నేను కొంచెం అతిశయపడేలా, నన్ను బుద్ధిహీనుడిగానే చేర్చుకోండి. గొప్పలు చెప్పుకుంటూ నేను అతిశయంగా చెప్పే ఈ విషయాలు ప్రభువు మాటగా చెప్పడం లేదు, బుద్ధిహీనుడిలా చెబుతున్నాను. చాలామంది శరీరానుసారంగా అతిశయిస్తున్నారు. నేనూ అతిశయిస్తాను. తెలివిగల మీరు బుద్ధిహీనులను సంతోషంతో సహిస్తున్నారు. ఎవరైనా మిమ్మల్ని బానిసలుగా చేసినా, మీలో విభేదాలు కలిగించినా, మిమ్మల్ని వశం చేసుకున్నా, తన గురించి గొప్పలు చెప్పుకుంటున్నా, చెంప దెబ్బ కొట్టినా మీరు సహిస్తున్నారు. వారు చేసినట్టు చేయలేని బలహీనులమని సిగ్గుతో చెబుతున్నాను. అయితే, ఎవరైనా ఎపుడైనా అతిశయిస్తుంటే-బుద్ధిహీనుడిలా మాట్లాడుతున్నాను-నేనూ అతిశయిస్తాను. వారు హెబ్రీయులా? నేను కూడా హెబ్రీయుడినే. వారు ఇశ్రాయేలీయులా? నేను కూడా ఇశ్రాయేలీయుడినే. వారు అబ్రాహాము సంతానమా? నేను కూడా. వారు క్రీస్తు సేవకులా? (వెర్రివాడిలాగా మాట్లాడుతున్నాను) నేను కూడా ఇంకా ఎక్కువగా క్రీస్తు సేవకుణ్ణి. వారికంటే చాలా ఎక్కువగా కష్టపడ్డాను. అనేక సార్లు చెరసాల పాలయ్యాను. లెక్కలేనన్ని సార్లు దెబ్బలు తిన్నాను. అనేకమార్లు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాను. యూదుల చేత ఐదు సార్లు “ఒకటి తక్కువ నలభై” కొరడా దెబ్బలు తిన్నాను. మూడు సార్లు నన్ను బెత్తాలతో కొట్టారు. ఒకసారి రాళ్లతో కొట్టారు. మూడుసార్లు నేనెక్కిన ఓడలు పగిలిపోయాయి. ఒక పగలు, ఒక రాత్రి సముద్రంలో గడిపాను. తరచుగా ప్రయాణాల్లో అపాయాలకు గురయ్యాను. నదుల్లో అపాయాలూ దోపిడీ దొంగల వలన అపాయాలూ నా సొంత ప్రజల వలన అపాయాలూ యూదేతరుల వలన అపాయాలూ పట్టణాల్లో అపాయాలూ అరణ్యాల్లో అపాయాలూ సముద్రంలో అపాయాలూ కపట సోదరుల వల్ల అపాయాలూ నాకు ఎదురయ్యాయి. కష్ట పడ్డాను. వేదన అనుభవించాను. నిద్ర కరువైన అనేక రాత్రులు గడిపాను. చలితో, ఆకలి దప్పులతో, తినడానికి ఏమీ లేక, బట్టల్లేక ఉన్నాను.