2 కొరింతీ పత్రిక 11:1-15

2 కొరింతీ పత్రిక 11:1-15 IRVTEL

నా బుద్దిహీనతను దయతో సహించమని కోరుతున్నాను, నిజానికి మీరు సహిస్తూనే ఉన్నారు. మీ గురించి నేను రోషంతో ఉన్నాను. మీ పట్ల నాకు దైవిక రోషం ఉంది. ఎందుకంటే పవిత్ర కన్యగా ఒక్క భర్తకే, అంటే క్రీస్తుకు సమర్పించాలని మిమ్మల్ని ప్రదానం చేశాను. అయితే, సర్పం తన కుయుక్తితో హవ్వను మోసగించినట్టు మీ మనసులు క్రీస్తులో ఉన్న నిజాయితీ నుండి, పవిత్ర భక్తి నుండి తొలగిపోతాయేమో అని నేను భయపడుతున్నాను. ఎందుకంటే ఎవరైనా వచ్చి మేము ప్రకటించిన యేసును కాక మరొకరిని ప్రకటించినా, లేక మీరు పొందని వేరొక ఆత్మను పొందినా, మీరు అంగీకరించని వేరొక సువార్త మీరు అంగీకరించినా, మీరు వాటిని బాగానే సహిస్తున్నారు. ఆ “గొప్ప అపొస్తలుల” కంటే నేనేమాత్రం తక్కువ వాణ్ణి కానని అనుకుంటున్నాను. ఎలా బోధించాలో నేను నేర్చుకోక పోయినా తెలివిలో నేర్పులేని వాడిని కాను. అన్ని రకాలుగా అన్ని విషయాల్లో దీన్ని మీకు తెలియజేసాం. మీకు దేవుని సువార్త ఉచితంగా ప్రకటిస్తూ మిమ్మల్ని హెచ్చించడానికి నన్ను నేనే తగ్గించుకుని తప్పు చేశానా? మీకు సేవ చేయడానికి ఇతర సంఘాల నుంచి జీతం తీసుకుని, నేను ఒక విధంగా ఆ సంఘాలను “దోచుకున్నాను.” నేను మీతో ఉన్నప్పుడు నాకు అక్కర కలిగితే మీలో ఎవరి మీదా భారం మోపలేదు. మాసిదోనియ ప్రాంతం నుండి వచ్చిన సోదరులు నా అవసరాలు తీర్చారు. ప్రతి విషయంలో నేను మీకు భారంగా ఉండకుండాా చూసుకున్నాను. ఇంకా అలానే చేస్తూ ఉంటాను. క్రీస్తు సత్యం నాలో ఉండడం వలన అకయ ప్రాంతాల్లో నా అతిశయాన్ని ఎవరూ ఆపలేకపోయారు. ఎందుకు? నేను మిమ్మల్ని ప్రేమించనందుకా? నేను ప్రేమిస్తున్నట్టు దేవునికే తెలుసు. అయితే ప్రస్తుతం నేను చేసేది తరువాత కూడా చేస్తాను. ఎందుకంటే, కొందరు ఏఏ విషయాల్లో గర్వంగా చెప్పుకొంటారో ఆ విషయాల్లో తాము మాలాగే ఉన్నట్టు అనిపించుకోవాలని చూస్తున్నారు. అలా గర్వంతో చెప్పే అవకాశమేమీ వారికి లేకుండా చేయాలని కోరుతున్నాను. అలాంటి వారు క్రీస్తు అపొస్తలుల వేషం వేసుకున్న అబద్ధ అపొస్తలులు, మోసకరమైన సేవకులు. ఇందులో ఆశ్చర్యమేమీ లేదు. సాతాను కూడా వెలుగు దూత వేషం వేసుకుంటాడు. అందుచేత, వాడి సేవకులు కూడా నీతి పరిచారకుల వేషం వేసుకోవడం వింతేమీ కాదు. వారి పనులనుబట్టే వారి అంతముంటుంది.