అప్పుడు ఆసాపు సంతతివాడూ లేవీయుడు అయిన యహజీయేలు, సమాజంలో ఉన్నాడు. అతని తండ్రి జెకర్యా, జెకర్యా తండ్రి బెనాయా, బెనాయా తండ్రి యెహీయేలు, యెహీయేలు తండ్రి మత్తన్యా. యెహోవా ఆత్మ యహజీయేలు మీదికి రాగా అతడు ఇలా ప్రకటించాడు, “యూదాప్రజలారా, యెరూషలేము నివాసులారా, యెహోషాపాతు రాజా, మీరంతా వినండి. యెహోవా చెప్పేదేమిటంటే, ఈ గొప్ప సైన్యానికి మీరు భయపడవద్దు, నిస్పృహ చెందవద్దు. ఈ యుద్ధం మీది కాదు, దేవునిదే.
రేపు మీరు వారిమీదికి వెళ్ళాలి. వారు జీజు అనే కనుమ గుండా వస్తారు. మీరు యెరూవేలు అరణ్యం ముందున్న వాగు చివర, వారిని కనుగొంటారు. ఈ యుద్ధంలో మీరు పోరాడవలసిన అవసరం లేదు. యూదా ప్రజలారా, యెరూషలేము వాసులారా, మీరు మీ స్థానాల్లో అలాగే నిలబడండి. మీతో ఉన్న యెహోవా అందించే రక్షణను మీరు చూస్తారు. భయపడవద్దు, నిస్పృహ చెందవద్దు. రేపు మీరు వారి మీదికి వెళ్ళాలి. యెహోవా మీతో ఉంటాడు.”
అప్పుడు యెహోషాపాతు సాష్టాంగ నమస్కారం చేశాడు. యూదావారు, యెరూషలేము నివాసులు యెహోవా సన్నిధిలో సాగిలపడి నమస్కరించారు. కహాతీయుల సంతతివారు, కోరహీయుల సంతతివారైన లేవీయులు నిలబడి బిగ్గరగా ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను స్తుతించారు.
వారు ఉదయాన్నే లేచి తెకోవ అరణ్యానికి వెళ్ళారు. వారు వెళ్తూ ఉంటే యెహోషాపాతు నిలబడి “యూదా, యెరూషలేములో నివసించే మీరంతా నా మాట వినండి! మీ దేవుడైన యెహోవాను నమ్మండి, అప్పుడు మీకు సహాయం దొరుకుతుంది. ఆయన ప్రవక్తలను నమ్మండి, అప్పుడు మీకు విజయం కలుగుతుంది” అని చెప్పాడు.
అతడు ప్రజలతో చర్చించిన తరువాత యెహోవాను స్తుతించడానికి గాయకులను ఏర్పరచి, వారు సైన్యం ముందు నడుస్తూ “యెహోవా కృప ఎల్లప్పుడూ ఉంటుంది. ఆయనకు కృతజ్ఞత తెలియచేయండి.” అని పలకాలని నియమించాడు.
వారు పాడడం, స్తుతించడం మొదలు పెట్టినప్పుడు, యూదావారి మీదికి వచ్చిన అమ్మోనీయులమీదా మోయాబీయుల మీదా శేయీరు కొండ ప్రాంతం వారి మీదా యెహోవా ఆకస్మిక దాడి చేసే మనుషులను పెట్టాడు. శత్రువులు ఓడిపోయారు. అమ్మోనీయులు, మోయాబీయులు కలిసి శేయీరు కొండప్రాంతం వారిని పూర్తిగా చంపి వేసి నాశనం చేద్దామని పొంచి ఉండి, వారిమీద పడ్డారు. వారు శేయీరు నివాసులను తుదముట్టించిన తరువాత ఒకరినొకరు చంపుకోవడం మొదలుపెట్టారు.
యూదావారు అరణ్యం దగ్గరికి వచ్చి, సైన్యం వైపు చూస్తే, వారంతా నేలమీద పడి ఉన్నారు. ఏ ఒక్కడూ తప్పించుకోలేదు. యెహోషాపాతూ, అతని ప్రజలూ వారి వస్తువులను తీసుకోడానికి వస్తే, ఆ శవాల మీద విస్తారమైన ధనం, ప్రశస్తమైన నగలు దొరికాయి. తాము మోయలేనంతగా వారు సొమ్ము దోచుకున్నారు. కొల్లసొమ్ము ఎంత ఎక్కువగా ఉందంటే, వాటిని మోసుకు పోవడానికి వారికి మూడు రోజులు పట్టింది. నాలుగవ రోజు బెరాకా లోయలో వారు సమావేశమయ్యారు. అక్కడ వారు యెహోవాను స్తుతించారు. అందుకే ఇప్పటి వరకూ ఆ స్థలానికి “బెరాకా లోయ” అని పేరు.
ఆ తరువాత యూదావారూ యెరూషలేమువారూ వారికి ముందు యెహోషాపాతు, ఆనందంగా యెరూషలేము తిరిగి వెళ్లాలని బయలు దేరారు. ఎందుకంటే యెహోవా వారి శత్రువుల మీద వారికి జయం అనుగ్రహించాడు. వారు యెరూషలేములో ఉన్న యెహోవా మందిరానికి తీగె వాయిద్యాలను సితారాలను వాయిస్తూ బాకాలు ఊదుతూ వచ్చారు.
ఇశ్రాయేలీయుల శత్రువులతో యెహోవా యుద్ధం చేసాడని అన్ని రాజ్యాల వారు విని, దేవుని భయంతో వణికిపోయారు. ఈ విధంగా యెహోషాపాతు రాజ్యం ప్రశాంతంగా ఉంది. ఎందుకంటే అతని దేవుడు, అతని చుట్టూ నెమ్మది ఇచ్చాడు.