1 సమూ 20:1-17

1 సమూ 20:1-17 IRVTEL

తరువాత దావీదు రమాలోని నాయోతు నుండి పారిపోయి యోనాతాను దగ్గరకు వచ్చి “నేనేం చేశాను? నా తప్పు ఏంటి? నా ప్రాణం తీసేందుకు వెతికేలా మీ నాన్న దృష్టిలో నేను ఏం పాపం చేశాను?” అని అడిగాడు, యోనాతాను “నువ్వు ఎన్నటికీ అలా అనుకోవద్దు, నువ్వు చనిపోవు. నాకు చెప్పకుండా మా తండ్రి చిన్న పనైనా, పెద్ద పనైనా చెయ్యడు. అతడు ఈ విషయం నాకు చెప్పకుండా ఎందుకు ఉంటాడు?” అన్నాడు. దావీదు “నేను నీకు అనుకూలంగా ఉన్న విషయం మీ తండ్రికి బాగా తెలుసు కాబట్టి నీకు బాధ కలిగించడం ఇష్టంలేక నీకు చెప్పడం లేదు. యెహోవా మీద ఒట్టు, నీ మీద ఒట్టు, నిజంగా నాకూ, మరణానికి ఒక్క అడుగు దూరం మాత్రమే ఉంది” అని ప్రమాణపూర్తిగా చెప్పాడు. యోనాతాను “నువ్వు ఎలా చేయమంటే నీ తరపున అలా చేస్తాను” అన్నాడు. అప్పుడు దావీదు “రేపు అమావాస్య. అప్పుడు నేను తప్పక రాజుతో కలసి కూర్చుని భోజనం చెయ్యాలి. ఎల్లుండి సాయంత్రం వరకూ పొలంలో దాక్కోడానికి నాకు అనుమతి ఇవ్వు. నేను లేకపోవడం మీ తండ్రి గమనించినప్పుడు నువ్వు ఈ మాట చెప్పాలి, ‘దావీదు ఇంటివారు ప్రతి ఏడూ బలి చెల్లించడం వారి ఆనవాయితీ. అందువల్ల అతడు బేత్లెహేమనే తన ఊరు వెళ్ళాలని నన్ను బతిమాలి నా దగ్గర అనుమతి తీసుకున్నాడు.’ మీ తండ్రి అలాగేనని సమ్మతించిన పక్షంలో నీ దాసుడనైన నాకు క్షేమమే. అతడు బాగా కోపగించి మనసులో నాకు కీడు చేయాలని సంకల్పిస్తే నువ్వు తెలుసుకుని నీ దాసుడనైన నాకు ఒక మేలు చెయ్యాలి. ఏమిటంటే యెహోవా పేరట నీతో నిబంధన చేయడానికి నువ్వు నీ దాసుడనైన నన్ను రప్పించావు. నాలో ఏమైనా తప్పు ఉంటే మీ నాన్న దగ్గరికి నన్నెందుకు తీసుకువెళ్తావు? నువ్వే నన్ను చంపెయ్యి” అని యోనాతానును కోరాడు. యోనాతాను “అలాంటి మాటలు ఎప్పటికీ అనవద్దు. మా తండ్రి నీకు కీడు చేయడానికి నిర్ణయించుకున్నాడని నాకు తెలిస్తే నీతో చెబుతాను గదా” అన్నాడు. దావీదు “మీ తండ్రి నన్నుగూర్చి నీతో కఠినంగా మాట్లాడినప్పుడు దాన్ని నాకు ఎవరు తెలియచేస్తారు?” అని యోనాతానును అడిగాడు. అప్పుడు యోనాతాను “పొలంలోకి వెళ్దాం రా” అంటే, ఇద్దరూ పొలంలోకి వెళ్లారు. అప్పుడు యోనాతాను “ఇశ్రాయేలీయులకు దేవుడైన యెహోవాయే సాక్ష్యం. రేపైనా, ఎల్లుండైనా, ఈ రోజైనా మా తండ్రిని అడుగుతాను, అప్పుడు దావీదుకు క్షేమం కలుగుతుందని నేను తెలుసుకొన్నప్పుడు ఆ సమాచారం పంపిస్తాను. అయితే నా తండ్రి నీకు కీడు చేయాలని ఉద్దేశిస్తున్నాడని నాకు తెలిస్తే అది నీకు తెలియజేసి నీవు క్షేమంగా వెళ్ళేలా నిన్ను పంపించకపోతే యెహోవా నాకు గొప్ప కీడు కలుగచేస్తాడు గాక. యెహోవా నా తండ్రికి తోడుగా ఉండినట్లు నీకూ తోడుగా ఉంటాడు గాక. అయితే నేనింకా బతికి ఉంటే నేను చావకుండా యెహోవా నిబంధన విశ్వాస్యతను నువ్వు నా పట్ల చూపిస్తావు కదా? నేను మరణించిన తరువాత యెహోవా దావీదు శత్రువుల్లో ఒక్కడైనా భూమిపై లేకుండా నాశనం చేసిన తరువాత నువ్వు నా సంతతి పట్ల దయ చూపించకపోతే యెహోవా నిన్ను విసర్జిస్తాడు గాక.” ఇలా యోనాతాను దావీదు వంశంతో నిబంధన చేశాడు. “ఈ విధంగా యెహోవా దావీదు శత్రువులు లెక్క అప్పగించేలా చేస్తాడు గాక” అని అతడు అన్నాడు. యోనాతాను దావీదును తన ప్రాణస్నేహితుడిగా ప్రేమించాడు కాబట్టి ఆ ప్రేమను బట్టి దావీదు చేత తిరిగి ప్రమాణం చేయించాడు.