1 సమూ 17:45-51

1 సమూ 17:45-51 IRVTEL

దావీదు “నువ్వు కత్తి, ఈటె, బల్లెం తీసుకుని నా మీదికి వస్తున్నావు. నేనైతే నువ్వు దూషిస్తున్న ఇశ్రాయేలీయుల సేనల అధిపతి యెహోవా పేరిట నీ మీదికి వస్తున్నాను. ఈ రోజు యెహోవా నిన్ను నా చేతికి అప్పగిస్తాడు. నేను నిన్ను చంపి నీ తల తీసేస్తాను. దేవుడు ఇశ్రాయేలీయులకు తోడుగా ఉన్నాడని లోకంలోని వారంతా తెలుసుకొనేలా నేను ఈ రోజున ఫిలిష్తీయుల శవాలను పక్షులకు, జంతువులకు వేస్తాను. అప్పుడు యెహోవా కత్తిచేత, ఈటెచేత రక్షించేవాడు కాదని ఇక్కడ ఉన్నవారంతా తెలుసుకుంటారు. యుద్ధం యెహోవాయే చేస్తాడు. ఆయన మిమ్మల్ని మాకు అప్పగిస్తాడు” అని చెప్పాడు. ఆ ఫిలిష్తీయుడు లేచి దావీదును ఎదుర్కోవడానికి ముందుకు కదిలాడు. దావీదు, సైన్యం ఉన్న వైపుకు వేగంగా పరిగెత్తి వెళ్ళి తన సంచిలో చెయ్యి పెట్టి అందులోనుండి ఒక రాయి తీసి వడిసెలతో విసరి ఆ ఫిలిష్తీయుని నుదురుపై తగిలేలా కొట్టాడు. ఆ రాయి వాడి నుదురులోకి దూసుకు పోయింది. వాడు నేలపై బోర్లా పడిపోయాడు. ఆ విధంగా దావీదు వడిసెలతో, రాయితో ఫిలిష్తీయుణ్ణి ఓడించాడు. అతడు ఆ ఫిలిష్తీయుణ్ణి కొట్టి చంపాడు. అతని చేతిలో కత్తి లేదు. దావీదు పరుగెత్తుకుంటూ వెళ్ళి ఫిలిష్తీయుని మీద నిలబడి వాడి వరలోని కత్తి దూసి దానితో వాడిని చంపి, తల తెగగొట్టాడు. ఫిలిష్తీయులు తమ వీరుడు చనిపోవడం చూసి అంతా పారిపోయారు.